క్యాతన్‌పల్లి మునిసిపల్ పీఠం బీఆర్‌ఎస్‌దే
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:46 PM
క్యాతన్‌పల్లి మునిసిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌ల పర్యవేణలో శనివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో చేపట్టారు.
- ముగిసిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక
- ఎన్నికలకు కాంగ్రెస్ సభ్యులు దూరం
- కోరం ఉండటంతో ముందుకు సాగిన ప్రక్రియ
మంచిర్యాల, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మునిసిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌ల పర్యవేణలో శనివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో చేపట్టారు. దీంతో దాదాపు రెండునెలలుగా మునిసిపాలిటీలో నెలకొన్న ఉద్రిక్తతకు తెరపడింది. రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 11న మునిసిపాలిటీల ఎన్నికలు జరగగా, 13వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. అన్ని మునిసిపాలిటీలకు 16న చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికలు నిర్వహించగా, క్యాతన్‌పల్లిలో మాత్రం అనూహ్యంగా వాయిదా పడ్డాయి. ఆ రోజు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య నెలకొన్న వివాదం కారణంగా బీఆర్‌ఎస్ సభ్యులు సమయానికి కార్యాలయానికి రాలేదన్న కారణంతో అధికారులు మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఫిబ్రవరి 17వ తేదీన రెండు పార్టీలకు చెందిన కౌన్సిల్ సభ్యులు సకాలంలో హాజరైనప్పటికీ పీఠం కైవసం చేసుకోవడం కోసం ఇరు పార్టీలు పట్టుదలకు పోవడంతో కార్యాలయం లోపల నెలకొన్న ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు నిర్వహించలేమని పేర్కొంటూ మళ్లీ వాయిదా వేశారు. ఎన్నికల్లో తమకు పూర్తి మెజార్టీ ఉన్నప్పట్టికీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటు న్నారని పేర్కొంటూ బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి సభ్యులు హై కోర్టును ఆశ్రయించారు. దీంతో మూడు వారాల్లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించడంతో దాదాపు రెండు నెలల అనంతరం ఎట్టకేలకు మార్గం సుగమం అయింది.
- అనేక మలుపుల నడుమ...
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో అనేక మలుపుల మధ్య ఎట్టకేలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చైర్మపర్సన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎన్నికలు ముగిసినప్పటి నుంచి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు విశ్వ ప్రయత్నాలు చేశాయి. మునిసిపాలిటీ పరిధిలో మొత్తం 22 వార్డులు ఉండగా బీఆర్‌ఎస్‌కు 10 సీట్లు, మిత్రపక్షమైన సీపీఐకి నాలుగు స్థానాలు లభించాయి. అలాగే కాంగ్రెస్‌కు ఏడు సీట్లు రాగా, స్వతంత్రుల్లో ఒకరు ఆ పార్టీకి మద్దతు తెలపడంతో అధికార పార్టీ సభ్యుల సంఖ్య ఎనిమిదికి చేరింది. బీఆర్‌ఎస్, సీపీఐ కూటమికి మ్యాజిక్ ఫిగర్‌కు అవసరమైన మెజారిటీ ఉన్నప్పటికీ చైర్‌పర్సన్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి గడ్డం వివేకానంద పావులు కదిపారు. ఒక దశలో సీపీఐ నుంచి గెలుపొందిన నలుగురు సభ్యులను తమవైపు తిప్పుకోవడం కోసం విశ్వప్రయత్నాలు చేశారు. పరిస్థితిని అంచనా వేసిన మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఫలితాలు వెలువడిన రోజే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కూటమి సభ్యులను క్యాంపు కోసం ఖమ్మం జిల్లాకు తరలించారు. తిరిగి చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికను పురస్కరించుకొని ఫిబ్రవరి 16న తన కూటమి సభ్యులను క్యాంపు నుంచి నేరుగా మునిసిపల్ కార్యాలయానికి తరలించారు. కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయినప్పటికీ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక వాయిదా పడింది.
- రెండు నెలలు క్యాంపులోనే...
చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య చెలరేగిన వివాదం, పరస్పర దాడులు, పోలీసుల లాఠీ చార్జీతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మంత్రి వివేకాంద కాన్వాయ్‌పై దాడి చేశారనే కారణంలో బాల్క సుమన్‌పై ఫిబ్రవరి 17న కేసు నమోదు చేసిన పోలీసులు మరుసటి రోజు ఆయన్ను ఆరెస్టు చేసి, మంచిర్యాల కోర్టులో హాజరు పరిచారు. దీంతో ఆయనకు మంచిర్యాల కోర్టు 14 రోజులు రిమాండ్ విఽధించగా, ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అయినప్పటికీ తమ సభ్యులను కాపాడుకునేందుకు బాల్క సుమన్ అలుపెరగని పోరాటం చేశారు. తాను జైలుకు వెళ్లిన రోజే కూటమి సభ్యులు 14 మందిని హైద్రాబాద్ క్యాంపునకు తరలించారు. దాదాపు 51 రోజుల అనంతరం శనివారం జరిగిన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికకు నేరుగా క్యాంపు నుంచి కార్యాలయానికి ప్రత్యేక బస్సులో తరలించారు. దీంతో కూటమి సభ్యులు దాదాపు రెండు నెలల పాటు కుటుంబాలకు దూరం కావడమేగాకుండగా, పండుగ, పబ్బాలకు కూడా ఇంటి ముఖం చూడకుండా ఉండిపోయారు.
- ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు దూరం..
హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహించగా, కూటమి సభ్యులనే రెండు పదవులు వరించాయి. ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు దూరంగా ఉండగా, బీఆర్‌ఎస్, సీపీఐ కూటమి సభ్యులు 14 మంది హాజరయ్యారు. సరిపడా కోరం ఉండటంతో అధికారులు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ఎన్నికల్లో 10 సీట్లు సాధించిన బీఆర్‌ఎస్ సభ్యురాలు గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్‌గా మిత్రపక్షమైన సీపీఐకి చెందిన మిట్టపల్లి సరితకు మిగతా సభ్యులు మద్దతు తెలపడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి, నియామక పత్రం అందజేశారు. అనంతరం ఇద్దరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించడంతో రెండు నెలల అనంతరం కథ సుఖాంతం అయింది. కాగా ఎన్నికల సరళిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా పరిశీలించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా బందోబస్తు ఏర్పాటు చేయించారు.