మున్సిపాలిటీలపై ఎగిరేది కాంగ్రెస్ జెండానే
ABN , Publish Date - Jan 14 , 2026 | 11:47 PM
త్వరలో జరగనున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు గల్లంతవుతాయని, కాంగ్రెస్ పార్టీదే విజయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.
- రూ. 5 కోట్లతో క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి - మంత్రి వివేక్‌వెంకటస్వామి
మందమర్రిటౌన్, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న మున్సిపాలిటీలో ఎన్నికల్లో బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు గల్లంతవుతాయని, కాంగ్రెస్ పార్టీదే విజయమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో ఐదు కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ పాలనలో మున్సిపాలిటీలను విస్మరించారన్నారు. తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడంతో పాటు రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం, కొత్త రేషన్‌కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని తెలిపారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కేసీఆర్ కుటుంబం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి కుంభకోణాలతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని విమర్శించారు. ఆ డబ్బుల కోసం గొడవ పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని, ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఒరిగేదేమీ లేదన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలోని వార్డుల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. మున్సిపాలిటీకి రానున్న రోజుల్లో మరిన్ని నిధులు మంజూరు చేస్తానని తెలిపారు. చెన్నూరు మున్సిపాలిటీ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు. పాలకవర్గంలేని మందమర్రి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. నియోజకవర్గంలో మూడు వేలకు పైగా ఇందిరమ్మ గృహాలను మంజూరు చేశామని, రెండో విడతలో కూడా పెద్ద ఎత్తున మంజూరు చేస్తామన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారని తెలిపారు. క్యాతనపల్లిలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రజలు తనదృష్టికి తీసుకువచ్చారని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలందరు తాము చేస్తున్న అభివృద్ధిని పరిశీలించాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను నిలిపివేశామన్నారు. అనంతరం మంత్రిని కాలనీ వాసులు సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు, జిల్లా అధ్యక్షుడు రఘునాధ్‌రెడ్డి, నాయకులు అబ్దుల్ అజీజ్, శ్రీనివాస్, సమ్మయ్య, పల్లె రాజు, విజయ తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తా
క్రైస్తవుల సంక్షేమానికి కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక ఉపాధికల్పన గనులశాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం రాత్రి నిర్వహించిన కిస్మ్రస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్రైస్తవుల సమావేశానికి సంబంధించి కమ్యూనిటి హాల్‌కు 20లక్షలు మంజూ రు చేస్తానని తెలిపారు. చర్చి అభివృద్ధికి కృషిచేస్తానని తెలిపారు. క్రైస్తవు లు చూపుతున్న ప్రేమ కరుణ మరువలేనని అన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. అంతకుముందు చర్చిల ఫాదర్లు పూలమొక్క అందించి శాలు వాలతో సత్కరించారు. కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మందమర్రి జీఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాజలింగ్, చర్చిల పాధర్లు రెవా జర్మియా, పేరం రాజశేఖర్, పద్మరావు, సామియల్, లూతర్, సంధ్య పాల్గొన్నారు.
నేడు మంత్రి పర్యటన
చెన్నూరు: చెన్నూరు నియోజకవర్గంలో గురువారం కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నట్లు కాంగ్రెస్ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో అభివృద్ది పనులకు శంకుస్దాపన చేస్తారన్నారు. నాయకులు, కార్యకర్తలు తరలి రావాలన్నారు.