Share News

మారిన ‘పది’ పరీక్షల విధానం

ABN , Publish Date - Mar 02 , 2026 | 11:57 PM

పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది.

మారిన ‘పది’ పరీక్షల విధానం

- గతంలో వరుసగా వార్షికపరీక్షలు

- ఈసారి ఒక్కోపరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల సమయం

- గ్యాప్‌ రోజుల్లో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

- ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం

వాంకిడి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): పదో తరగతి వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం ఈసారి మార్పులు తీసుకువచ్చింది. మారిన విధానం ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గత ఏడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారాలు మినహాయించి వరుసగా నిర్వహించేవారు. ఒక్కో పరీక్షకు మధ్యలో గడువు ఉండేది కాదు. ప్రస్తుతం మారిన విధానం ప్రకారం మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 14 వరకు కొసాగుతాయి. పరీక్షకు మధ్య గ్యాప్‌తో విద్యార్థులు బాగా చదివి పరీక్షలకు సిద్ధమై మంచిమార్కులు సాధించాలన్న లక్ష్యంతో ఈ విధానం అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

- గ్యాప్‌ రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ..

ప్రీఫైనల్‌ పరీక్షలు ముగియడంతో ప్రత్యేక కార్యాచణ ప్రకారం విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడానికి విద్యాశాఖ ఉపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రీ ఫైనల్‌ పరీక్షల సమాధాన పత్రాలను దిద్ది వాటిని తల్లిదండ్రులకు పంపించాల్సి ఉంటుంది. విద్యార్థులు ఎక్కడ వెనుకబడి ఉన్నారో, ఎక్కడ తప్పులు రాస్తున్నారో ఉపాధ్యాయులు గుర్తించి సరైన సమాధానాలు రాసేలా చూడాలి. ఈ పరీక్షల ఆధారంగా విద్యార్థులను మూడు గ్రేడ్‌లుగా తయారు చేసి వారిలో సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలి. పాస్‌ అయ్యే అవకాశం తక్కువ ఉన్న వారు, యావరేజ్‌ మార్కులు తెచ్చుకునే వారు, మంచి మార్కులు సాధించేవారు అనే గ్రేడ్‌లుగా విభజించాలి. గ్రేడ్‌ల వారీగా వారికి బోధించాలి. దీనిలో భాగంగా ప్రతిరోజూ సబ్జెక్‌ టీచర్లు విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన పాఠ్యాంశాలను వివరించి ఐదారు ముఖ్యమైన ప్రశ్నలతో స్లిప్‌ టెస్ట్‌లు ప్రతిరోజూ నిర్వహించాలి.

- రోజుకు మూడు పీరియడ్‌ల చొప్పున...

వార్షిక పరీక్షలు మొదలయ్యాక హిందీ పరీక్షకు మధ్యలో మూడు రోజులు సమయం ఉంది. ఈ మూడు రోజులు విద్యార్థులు పాఠశాలకు హాజరు కావాల్సి ఉంటుంది. సబ్జెక్టు టీచర్‌ వారికి రోజుకు మూడు పీరియడ్‌లు నిర్వహించి సబ్జెక్టులో మెరుగైన మార్కులు సాధించేలా శిక్షణ ఇస్తారు. మొదటి పీరియడ్‌లో రివిజన్‌, రెండో పీరియడ్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌, మూడో పీరియడ్‌లో సమాధాన పత్రాలు దిద్ది తప్పులు సరిచేయడం వంటివి చేస్తారు. గంట సమయంలో 20 నిమిషాలు పాఠ్యాంశ బోధన, 40 నిమిషాలు సమాధానాలు రాసేందుకు కేటాయిస్తారు. ఇలా ప్రతీరోజు సబ్జెక్టు సాధన చేయిస్తారు. ఇలా ప్రతి పరీక్షకు మూడు నుంచి ఐదు రోజుల సమయం ఉంటుంది. మధ్యలో పండుగలు, ఆదివారాలు మినహా యిస్తే మూడు నుంచి నాలుగు రోజుల సమయం లభిస్తుంది.

- పరీక్షల టైం టేబుల్‌ ఇలా.....

పదోతరగతి పరీక్షల టైం టేబుల్‌ ఇలా ఉంది. 14న తెలుగు, 18న హిందీ, 23న ఇంగ్లీష్‌, 28న గణితం, ఏప్రిల్‌ 2న ఫిజికల్‌ సైన్స్‌, 7న బయోలజీ, 13న సాంఘికశాస్త్రం, 14న ఒకేషనల్‌ పరీక్షలు ఉంటాయి. ప్రస్తుతం వార్షిక పరీక్షలకు కేవలం 11 రోజుల గడువు మాత్రమే ఉంది. ఈలోగా విద్యార్థులను పరీక్షలకు సిద్దం చేయడానికి, వార్షిక పరీక్షలు ప్రారంభమైన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల గ్యాప్‌ పీరియడ్‌లో కూడా విద్యార్థులను పాఠశాలలకు రప్పించి ఉపాధ్యాయులు పరీక్షలకు సిద్ధం చేయాల్సి ఉంటుంది.

విద్యార్థులు వినియోగించుకోవాలి

- శివచరణ్‌కుమార్‌, ఎంఈవో వాంకిడి

మారిన నూతన పరీక్షల విధానంతో విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. గ్యాప్‌ పీరియడ్‌ను విద్యార్థులు వినియోగించుకోవాలి. గ్యాప్‌ పీరియడ్‌లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించే ప్రత్యేక తరగతులకు విద్యార్థులు తప్పక హాజరుకావాలి. పట్టుదలతో చదవి మంచి మార్కులు సాధించాలి. విద్యార్థులను వారి తల్లిదండ్రులు ప్రత్యేక తరగతులకు తప్పకుండా పంపించేలా చూడాలి.

Updated Date - Mar 03 , 2026 | 12:02 AM