రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తం
ABN , Publish Date - May 11 , 2026 | 11:38 PM
పట్టణంలోని ఎంజీ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం పొక్లెయినర్‌తో దుకాణాలను తొలగించేందుకు ఆర్‌ఓబీ వద్దకు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు.
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం
కాగజ్‌నగర్, మే 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎంజీ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం పొక్లెయినర్‌తో దుకాణాలను తొలగించేందుకు ఆర్‌ఓబీ వద్దకు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. కొంత మంది వ్యాపారస్థులు తమ దుకాణాలను తొలగించారని అడ్డుకున్నారు. బీఆర్‌ఎస్ నాయకులు పలువురు కాంగ్రెస్ నాయకులతో వాగ్వావాదానికి దిగారు. బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులపై దూషణ చేయటంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ దస్తగీర్ బీఆర్‌ఎస్ నాయకులతో వాగ్వావాదానికి దిగారు. తమపై కులం పేరుతో దూషించారని, బీఆర్ ఎస్ నాయకులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నాయకుడు అల్లాడి రాజు, తదితరులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ దస్తగిర్ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులను అడ్డుకోవటం సరికాదన్నారు. అరగంట పాటు ట్రాఫిక్ జాం కావటంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరువర్గాలను నచ్చజెప్పారు. అనంతరం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి యశ్వంత్ సమక్షంలో రోడ్డు విస్తరణ పనుల ను ప్రారంభించారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా డీఎస్పీ వహీదోద్దీన్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు.