పశువుల అక్రమ రవాణాపై నిఘా
ABN , Publish Date - May 05 , 2026 | 11:24 PM
బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు.
- రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా
కోటపల్లి, మే 5 (ఆంధ్రజ్యోతి): బక్రీద్ పండగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పటిష్టమైన నిఘా పెట్టినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మంగళవారం మండలంలోని రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఆయన సందర్శించారు. చెక్‌పోస్టు వద్ద అమలులో ఉన్న భద్రత చర్యలను పరిశీలించి విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత పత్రాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించాలని ఆదేశించారు. అనుమానస్పద వాహనాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పండగ సమయంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానస్పద కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో చెన్నూరు సీఐ బన్సీలాల్, కోటపల్లి ఎస్‌ఐ రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన సెర్చ్
- మంచిర్యాల ఏసీపీ ప్రకాశ
మంచిర్యాలక్రైం,మే5(ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన సెర్చ్ నిర్వహిస్తున్నట్లు యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాశ అన్నారు. మంచిర్యాల పట్టణం తిలక్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన కార్డన సెర్చ్‌లో ఆయన మాట్లాడుతూ నంబరు ప్లేట్ లేని, సరైన పత్రాలు లేని 58 ద్విచక్రవాహనాలను, ఎనిమిది ఆటోలను సీజ్ చేశామన్నారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పెద్దవాళ్లు ద్విచక్రవాహనాలను నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. యువత చెడు అలవాట్లకు బానిస కావద్దని, గంజాయి, ఆనలైన గేమ్‌లు ఆడవద్దని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సీసీ కెమెరాలతో నేరాలు నియంత్రించవచ్చునన్నారు. దొంగతనాలు, దోపిడీలు జరిగినప్పుడు, అల్లర్లు జరిగినప్పుడు సీసీ కెమెరాల ద్వారా సులభంగా గుర్తించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సీఐ ప్రమోద్‌రావు, సత్యనారాయణ, ఎస్‌ఐలు మధూసూదన, తిరుపతి, మజారోద్దీన, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.