Share News

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 11:42 PM

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ)లో చాలకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

- సంస్థ రక్షణ, డిమాండ్ల సాధన కోసం పోరుబాట

- నేటి నుంచి సమ్మెలో కార్మికులు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ)లో చాలకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు. ఆర్టీసీ సంస్థ రక్షణ, సమస్యల పరిష్కారమే ఏజెండాగా తెలంగాణ ఆర్టీసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ అధ్వర్యంలో బుధవారం నుంచి సమ్మెకు దిగుతున్నారు. ఈ నేపఽథ్యంలో ప్రజా రవాణా సంస్థ పై భారం పడనుంది. మహిళల ఉచిత ప్రయాణంపై తీవ్ర ప్రభావం పడనుంది.

పెరిగిన పని భారం... ఒత్తిడిలో కార్మికులు

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒకే డిపో ఉంది. ఆసిఫాబాద్‌ డిపో నుంచి ఆర్టీసీ యజమాన్యం ప్రతీ రోజు అన్ని రూట్లలో 81 షెడ్యూళ్లు 89 బస్సులను ఆయా పట్టణాలు, గ్రామాలు, శివారు గ్రామాలకు బస్సు సర్వీసులు నడుపుతోంది. సగటున ప్రతీ రోజు 33,700 కిలో మీటర్లు ఆర్టీసీ బస్సులు సేవలు అందిస్తుండగా ఇందులో 30 వేల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ప్రతీరోజు డిపోకు 20 లక్షల రూపాయల ఆదాయం సమకురుతోంది. డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్టు, మెకానిక్‌లతో పాటు ఇతర సిబ్బంది మొత్తం 325 మంది పనిచేస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టిమ్స్‌ డ్యూటీలు పెంచుతూ ఇబ్బంది పెడుతోందని జేఏసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎనిమిది గంటల డ్యూటీకి బదులు 12 నుంచి 16 గంటల దాకా పనిచేయిస్తున్నారని స్పెషల్‌ ఆఫ్‌ కూడా ఇవ్వడంలేదని జేఏసీ నాయకులు పేర్కొంటున్నారు. పెరిగిన పనిభారం, విరామం లేకుండా పనిచేయాల్సి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. మరోవైపు బస్సుల్లో 55 మంది ప్రయాణించాల్సి ఉండగా మహలక్ష్మి పథకం అమల్లోకి వచ్చాక 80 నుంచి 100 మంది దాకా ప్రయాణిస్తున్నారు. దీంతో కండక్టర్లతో పాటు డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిలక్స్‌, సూపర్‌ లగ్జరీ బస్సుల డ్రైవర్లకే టికెట్‌ ఇచ్చే బాధ్యత ఉండటంతో వాహనం నడుపుతూ టికెట్‌లు ఇవ్వాల్సి రావడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనిబారంతో కార్మికులు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నారని వాపోతున్నారు.

సమరానికి సన్నద్ధం

ఆర్టీసీని రక్షించుకోవడం సమస్యలు పరిష్కరించుకోవాలన్న లక్ష్యంతో ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమరానికి సన్నద్ధం అయ్యారు. బుధవారం నుంచి సమ్మెలో పాల్గొనేందుకు ఆసిఫాబాద్‌ డిపో పరిధిలోని కార్మికులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది వరకే సమ్మెకు సంబంధించిన నోటీసులను అధికారులకు అందజేశారు. కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేస్తూ తాము ఎందుకు సమ్మెకు వెళ్లాల్సి వస్తుందో వివరిస్తున్నారు.

ప్రధాన డిమాండ్లు ఇవే....

- ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి

- 2021 వేతన సవరణకు 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలి, 2025 వేతన సవరణ చేపట్టాలి

- మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రూ. 400 కోట్లను నెలానెలా విడుదల చేయాలి

- ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి

- ఆర్టీసీ స్థలాలను ఈవీ బస్సుల కంపెనీలకు ఇవ్వొద్దు.

- ఎలక్ట్రిక్‌ బస్సులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీకి ఇవ్వాలి

- ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి

- ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. కండక్టర్‌, డ్రైవర్లపై కేఎంపీఎల్‌, ఏపీకే వేధింపులు మానుకోవాలి

- 2019 సమ్మె కాలంలో నమోదైన కేసులను ఎత్తివేయాలి

- ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి

- సంస్థలో అన్ని కేటగిరిల్లో ఖాళీలను భర్తీ చేయాలి

Updated Date - Apr 21 , 2026 | 11:43 PM