రెండో రోజు కొనసాగిన సమ్మె
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:15 PM
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది.
- డిపోలకే పరిమితమైన బస్సులు
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె గురువారం రెండో రోజు కొనసాగింది. ఆర్టీసీ ఉద్యోగులు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన బొట్టు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ఆర్టీసీ డిపో నుంచి ఐబీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. మరో వైపు ప్రయాణికులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో స్థానికంగా 61 బస్సులను కేటాయించి నడిపిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య బస్సులు నడుస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ చైర్మన బొట్టు లక్ష్మణ్, తోట సత్తయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల ప్రధాన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని తెలిపారు. 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పీఆర్‌సీని ప్రకటించాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
-61 అద్దె బస్సులను నడిపిస్తున్నాం
- శ్రీనివాస్, డీఎం, మంచిర్యాల
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో 61 బస్సులను నడిపిస్తున్నాం. ప్రజా రవాణా స్తంభించకూడదని యాజమాన్యం సూచనల మేరకు బస్సులను నడిపిస్తున్నాం. ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బందులు పడవద్దని, ప్రయాణికులకు సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలి.