నకిలీ విత్తనాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Apr 08 , 2026 | 11:05 PM
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నాని తెలిపారు. నకిలీ విత్తనాల వినియోగం వల్ల కలిగే నష్టాలను రైతులకు అవగాహన కల్పించడంతో పాటు నకిలీ విత్తనాలు సరఫరా చేసే దళారులు, విక్రయదారులపై చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రతీ మండలానికి పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో టాస్క్‌ఫోర్స్ టీంను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామాల్లో దళారులు ఎవరైనా విడిగా పత్తి విత్తనాలు విక్రయించినట్లయితే పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. రైతులు ప్రభుత్వ అనుమతి గల విత్తనాలను మాత్రమే వినియోగించాలన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల వద్ద నకిలీ విత్తనాల వాడకం వల్ల కలిగే రైతులకు, పర్యావరణానికి కలిగే నస్టాలను వివరించాలన్నారు. రైతులు లైసెన్స్ ఉన్న షాపుల్లోనే విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. లైసెన్స్ లేని దుకాణాల ద్వారా విక్రయించే ఏ విత్తనమైనా నకిలీ విత్తనంగానే పరిగణించడుతుందని, రైతులు గమనించాలన్నారు. షాపుల్లో కొన్న వాటికి రశీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. జిల్లా సరిహద్దుప్రాంతాల్లో చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ గత సంవత్సరం జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 54 మందిని అరెస్టు చేసి సుమారు 14 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను సీజ్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి సురేఖ, మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ ఏసీపీలు ప్రకాష్, కిరణ్‌కుమార్, వెంకటేశ్వర్లు , తహసీల్దార్లు, ఏవోలు,ఏఈవోలు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో రోడ్డు ప్రమాదాల నివారణపై రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రోడ్లపై తక్కువ ఎత్తు గల బీమ్‌లు, తక్కువ విజిబిలిటి ఉన్న చోట్ల లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారులపై రంబుల్ స్ర్టిప్స్, లైటింగ్, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, రోడ్లపై పరిమితికి మించి వేగంగా వెళ్లే వాహనాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ తప్పనిసరి చేయడంలో కఠినచర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రహదారులపై కేజీవీల్స్, ట్రాక్టర్ కేజ్ వీల్స్ వినియోగాన్ని నిలిపివేసేందుకు అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, అంతర్గత రహదారులు, కల్వర్టుల వద్ద సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారి నియమాలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులు పాల్గొన్నారు.