ఆర్థికాభివృద్ధి వైపు అడుగులు
ABN , Publish Date - Jun 10 , 2026 | 11:36 PM
సమాజంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి పలు దఫాలుగా ప్రకటించారు.
- మహిళా సమాఖ్యలకు అద్దె బస్సులు
- లక్ష్యం దిశగా సాగుతున్న ప్రభుత్వం
ఆసిఫాబాద్‌రూరల్, జూన్ 10(ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడే సమసమాజం సాధ్యమవుతుందని అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో ముఖ్యమంత్రి పలు దఫాలుగా ప్రకటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పలు సందర్భాల్లో ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో దానిని నిరుపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మహిళా సమాఖ్యలకు అద్దె బస్సులను అందజేశారు.
- 94,569 మంది సభ్యులు
జిల్లాలో మొత్తం గ్రామసమైఖ్యలు 386, స్వయం సహాయక సంఘాలు 8,236 ఉండగా వీటిలో 94,569 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే వీరికి వివిధ రూపాల్లో ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అనేక రకాల ఆర్థిక సాధికారిక పథకాలను అమలు చేస్తున్నారు. తాజాగా ప్రతీ మండల సమాఖ్యకు ఒక అద్దె బస్సును కొనుగోలు చేయించి దానిని ఆర్టీసీకి అందజేసి ప్రతినెలా అద్దె వారి ఖాతాలో వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం 15 మండలాలకు గానూ 11 మండలాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన బస్సులను హుజూరాబాద్, మెట్‌పల్లి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, సిద్దిపేట, ఆసిఫాబాద్‌తో పాటు గోదావరిఖని డిపోల్లో బస్సులు నడుస్తున్నాయి. లింగాపూర్, వాంకిడి, జైనూరు, సిర్పూర్(టి) మండలాలకు కేటాయించిన బస్సులు రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఉన్నాయి.
- పథకం తీరు ఇలా..
మండల మహిళా సమాఖ్యలకు బస్సులు అందజేస్తూ వాటిని తిరిగి ఆర్టీసీలో అద్డె ప్రాతిపదికన కొనసాగించాలనే ప్రభుత్వం నిర్ణయంతో ప్రతీ బస్సుకు కావాల్సిన రూ. 36 లక్షలు పెట్టుబడిలో రూ. 6 లక్షలు మండల సమాఖ్య సభ్యుల నిధుల నుంచి సమకూర్చగా రూ. 30 లక్షలు సెర్ప్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ కింద కేటాయించారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తయిన బస్సులు రెండు నెలల నుంచి ఆయా డిపోల పరిధిలో తిరుగుతుండగా అయా బస్సులకు అద్దె రూపంలో 69,468 రూపాయలను ఆర్టీస్దీ చెల్లిస్తోంది.
ఆర్థిక సాధికారితకు కృషి:
-దత్తరావు, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి
జిల్లాలో మహిళా సమాఖ్యలోని సభ్యుల ఆర్థిక సాధికారిత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు వ్యక్తిగత వ్యాపారాల నిర్వహణకు సబ్సిడీ రుణాలను అందజేస్తున్నాం. తాజాగా ప్రభుత్వం అద్దె బస్సులను కూడా 15 మండలాలకు కేటాయించింది. దీంతో ప్రతి నెల క్రమం తప్పకుండా మండల సమాఖ్యలకు అద్దె వస్తుండటంతో సభ్యులు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంది.
ఆనందంగా ఉంది...
- టేకం పద్మావతి, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు
మహిళా సమాఖ్య ద్వారా ఆర్టీసీకి అద్దె బస్సులు నడపడం సంతోషంగా ఉంది. ఇది వరకే ప్రభుత్వం మాకు క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వంటి వాటిని సమకూర్చింది. అలాగే మండల, జిల్లా సమాఖ్యలకు ప్రభుత్వం భవనాలు నిర్మిస్తోంది. సమాఖ్య ద్వారా ఆదాయాన్ని పెంచి గ్రూపు సభ్యులందరినీ అభివృద్ధి చేస్తాం.