Share News

మున్సి‘పోల్స్‌’కు అడుగులు

ABN , Publish Date - Jan 14 , 2026 | 11:58 PM

మున్సిపల్‌ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా అంశాలవారీగా పనులు పూర్తి చేస్తుండగా, ఇప్పటికే వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను సైతం ప్రజల ముందు ఉంచారు.

 మున్సి‘పోల్స్‌’కు అడుగులు
పోలింగ్‌స్టేషన్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తున్న మంచిర్యాల కార్పొరేషన్‌ అధికారులు

- ప్రతిపాదిత పోలింగ్‌ స్టేషన్‌ల జాబితా విడుదల

- కార్యాలయాలు, రాజకీయ పార్టీలకు అందజేత

- జిల్లాలో 444 కేంద్రాల ఏర్పాటు

- ఈ నెల 15లోపు అభ్యంతరాల స్వీకరణ

మంచిర్యాల, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికలకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల్లో భాగంగా అంశాలవారీగా పనులు పూర్తి చేస్తుండగా, ఇప్పటికే వార్డుల పునర్విభజన ముసాయిదా జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది జాబితాను సైతం ప్రజల ముందు ఉంచారు. ఇందులో భాగంగా జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్‌ స్టేషన్ల ముసాయిదా డ్రాఫ్ట్‌ జాబితాను అధికారులు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 15వ తేదీలోపు స్వీకరిస్తుండగా, సంక్రాతి పండుగ మరుసటి రోజున తుది జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల అథారిటీ జారీ చేసిన ఆదేశాల మేరకు అధికారులు తయారు చేసిన పోలింగ్‌స్టేషన్ల వారీగా జాబితాను జిల్లా సహాయ ఎన్నికల అధికారులు, మునిసిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో బుధవారం వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో విడుదల చేశారు. పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ముగియగానే, త్వరలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. అనంతరం ఈనెలలోనే మునిసిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీ) నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలు అనేకం ఉన్నాయి.

ఫ 444 పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు...

జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌తోపాటు ఎన్నికలు జరుగనున్న లక్షెట్టిపేట, చెన్నూర్‌, క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి మున్సిపాలిటీలలో మొత్తం 444 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ముసాయిదా డ్రాఫ్ట్‌ జాబితాను విడుదల చేశారు. ప్రతి పోలింగ్‌ కేంద్రాన్ని 16 నుంచి 26 చదరపు గజాల వెడల్పు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఓటర్ల ఇంటి నుంచి కనీసం అర కిలోమీటరు నుంచి గరిష్టంగా ఒక కిలోమీటర్‌ లోపు పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాల భవనాలతోపాటు కొన్ని చోట్ల ప్రైవేటు పాఠశాలల భవనాల్లోనూ పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో గరిష్టంగా 800 మంది ఓటర్లను కేటాయించారు. మంచిర్యాల కార్పొరేషన్‌లో 1,81,778 మంది ఓటర్లకుగాను 265 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా, లక్షెట్టిపేటలో 18,358 మందికి 30 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే చెన్నూర్‌లో 19,903 మంది ఓటర్లకు 36 కేంద్రాలు, క్యాతన్‌పల్లిలో 29,785 మందికి 45 స్టేషన్లు, బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 44,575 మంది ఓటర్లకు 68 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

రేపు తుది జాబితా విడుదల...

ప్రతిపాదిత పోలింగ్‌ కేంద్రాలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజల అభ్యంతరాలను ఈ నెల 15వ తేదీ వరకు స్వీకరించనున్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఈ నెల 16న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈలోపు ఓటరు ఇంటి నుంచి గరిష్ట దూరం ఒక కిలోమీటర్‌ కంటే ఎక్కువ ఉన్న పక్షంలో పోలింగ్‌ స్టేషన్‌ మార్పు కోరుతూ దగ్గరలోని మరోస్టేషన్‌ను కేటాయించే విధంగా అభ్యంతరం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేసే భవన స్థితిగతులు, వెంటిలేషన్‌, తదితర సౌకర్యాలపై అభ్యంతరాలను వెలిబుచ్చే వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు భవనాల విషయంలో రాజకీయ నాయకులకు సంబంధించిన బిల్డింగ్‌లు, వివాదాస్పదంగా ఉన్న వాటిపట్ల సైతం అభ్యంతరాలను తెలియజేయవచ్చు. నిర్ణీత గడువులోపు వచ్చే అన్ని అభ్యంతరాలను పరిశీలించిన మీదట న్యాయబద్దంగా ఉన్న వాటిని పరిగణలోనికి తీసుకొని పోలింగ్‌ కేంద్రాల్లో చేర్పులు, మార్పులు చేస్తూ 16న తుది జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు.

అభ్యంతరాలకు ఒక్క రోజే గడువు...

పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు కేవలం ఒక్క రోజే గడువు ఇవ్వడం గమనార్హం. పోలింగ్‌ స్టేషన్‌ల ముసాయిదా జాబితాను ఈ నెల 13వ తేదీన అధికారులు విడుదల చేసి, కార్యాలయాల్లో ప్రదర్శించారు. ఆ విషయం వివిధ దినపత్రికల్లో వార్తలు ప్రచురితమై ప్రజలకు 14వ తేదీన సమాచారం అందింది. ఈ నెల 15వ తేదీన సంక్రాంతి పండుగ సెలవు దినం కావడం, 16వ తేదీన తుది జాబితా డుదల చేయనుండగా పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుపై అభ్యంతరాలు తెలిపేందుకు ప్రజలకు ఒక రోజు వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. 14వ తేదీన భోగి పండుగ సందర్భంగా అభ్యంతరాలపై ప్రజలు పెద్దగా స్పందించలేదని సమాచారం. కేవలం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశంలోనే పలు సూచనలు చేసే అవకాశం ఏర్పడింది.

Updated Date - Jan 14 , 2026 | 11:58 PM