Share News

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ABN , Publish Date - May 26 , 2026 | 11:36 PM

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
వేమనపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌గౌడ్‌

వేమనపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాకు తెచ్చిన ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి ఉండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నెలల తరబడి ధాన్యాన్ని తరలించకపోవడం సిగ్గు చేటని వాపోయారు. మండలంలోని గొర్లపల్లి నుంచి వేమనపల్లి వరకు ధాన్యం బస్తాలు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులు ధాన్యాన్ని రోడ్లపై నెల రోజులుగా నిల్వ చేసి తరలింపు కోసం ఎదురుచూస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల నిర్వాహకులు క్వింటాల్‌కు 10 కిలోల వడ్లు దోపిడీ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి ధాన్యం కొనుగోళ్లు త్వరగా జరిగేలా చూడాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఏట రవికుమార్‌, సీనియర్‌ నాయకులు రాపర్తి వెంకటేశ్వర్‌, నాయకులు పులగం తిరుపతి, బైస మల్లేష్‌, ఎనుముల వెంకటేశం, చౌదరి మధునయ్య, లస్మయ్య, అంజన్న, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:36 PM