Share News

క్రీ‘డల్‌ ’

ABN , Publish Date - May 11 , 2026 | 11:42 PM

గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పంచాయతీకి ఒకటి చొప్పున నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.

క్రీ‘డల్‌ ’

క్రీ‘డల్‌ ’

- బోర్డులకే పరిమితమైన క్రీడా ప్రాంగణాలు

- నిర్వహణ శూన్యం.. క్రీడాకిట్లు నిరుపయోగం

వాంకిడి, మే 11 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పంచాయతీకి ఒకటి చొప్పున నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి. ఇందుకోసం లక్షల రూపాయలను వ్యయం చేసింది. వాటిని ఏర్పాటు చేసినప్పటి నుంచి నిర్వహణ పట్టించుకోకపోవడం, కొన్నిమైదానాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో నిర్దేశించిన లక్ష్యం నెరవేరడంలేదు. క్రీడా ప్రాంగణాల్లో సౌకర్యాల కల్పనను అధికారులు పట్టించకోకపోవడంతో ప్రాంగణాలు అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. క్రీడా ప్రాంగణాల నిర్వహణ బాధ్యతలను గాలికి వదిలేశారు. దీంతో కంపచెట్లు పెరిగి వనాలను తలపిస్తున్నాయి. క్రీడాకారులకు చక్కటి ఆటస్థలం అన్నది కలగానే మిగిలింది. ఆటల ద్వారా యువతీయువకుల శారీరక, మానసిక వికాసాన్ని పెంపొందించాలన్న లక్ష్యం నెరవేరటంలేదు. క్రీడా ప్రాంగణాలకు బోర్డులు పెట్టారే తప్ప ఆటలు ఆడేందుకు సరైన వసతులను కల్పించలేదన్న విమర్శలున్నాయి. క్రీడాపరికరాలు ఎక్కడున్నాయో తెలియని దుస్థితి నెలకొంది. ఏళ్ల తరబడి ఆదరణ కరువై కంప చెట్లు మొలిచి వనాలను తలపిస్తున్నాయి. క్రీడల అభివృద్ధికి అధిక ప్రాధాన్య మిస్తున్నామని పాలకులు చెబుతున్నా అది ఆచరణకు నోచుకోవటం లేదు. క్రీడాకారులకు ప్రోత్సాహం అన్నది ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది.

పిచ్చి మొక్కలతో దర్శనం..

జిల్లాలోని 15 మండలాల్లో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 1,102 క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వీటిలో 902 ప్రాంగణాలకు ప్రభుత్వ స్థలం గుర్తించగా మిగితా 200 ప్రాంగణాలకు ప్రభుత్వ స్థలాలను గుర్తించలేదు. జిల్లావ్యాప్తంగా మొత్తం 878 క్రీడాప్రాంగణాలను పూర్తి చేసినట్లు అధికారులు లెక్కలు తెలుపుతునప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం ఎక్కడా సౌకర్యాలు క్పలించిన దాఖలాలు లేవు. ఒక్కో ప్రాంగణలో భూమి చదును చేసేందుకు, మొక్కలు నాటేందుకు సౌకర్యాల కల్పనకు రెండు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వ విడుదల చేసింది. అనేక ప్రాంగణాల్లో నామమాత్రంగా పనులు చేసి అధికారులు చేతులు దులుపుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్రీడాప్రాంగణాలపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుండడతో అధికారులు బోర్డులు ఏర్పాటు చేసి రికార్డుల్లో మాత్రం పనులు పూర్తి అయినట్లు చూపిస్తున్నారు. దీంతో చాలా మైదానాలు చదును చేయకపోగా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి. కొన్నిప్రాంగణాలు గ్రామాలకు దూరంగా ఉండి కనీసం సరైన రహదారి సైతం లేకుండా ఉన్నాయి.

- నిరుపయోగంగా కిట్లు..

క్రీడా ప్రాంగణాల కోసం గత ప్రభుత్వం జిల్లాకు 937 క్రీడా కిట్లను మంజూరు చేసింది. ఒక్కో కిట్లో క్రికెట్‌, వాలీబాల్‌ కిట్‌, టీషర్టులు, మూడు జతల డంబెల్స్‌తో పాటు మొత్తం 23 రకాల ఆట పరికరాలు ఉన్నాయి. గ్రామపంచాయతీల వారీగా అధికారులు కిట్లను పంపిణీ చేశారు. ప్రస్తుతం క్రీడామైదానాలు ఆటలకు అనువుగా లేకపోవడంతో వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్రీడా కిట్లు పంచాయతీల్లో మూలకు చేరాయి.

బోర్డులకే పరిమితం...

గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు బోర్డులకే పరిమితమయ్యాయి. ఊరికి దూరంగా ఆటలకు అనుకూలంగా లేని స్థలాల్లో బోర్డులు ఏర్పాటు చేసి అధికారులు చేతులు దులుపుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు ఒక్కటి కూడా క్రీడా పోటీలు నిర్వహించేందుకు అనువుగా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, క్రీడాకారులు పంట చేన్లను మైదానాలుగా వాడుకుంటున్నారు. ప్రతీ సంవత్సరం గ్రామాల్లో యువకులు పర్వదినాలను పురస్కరించుకొని క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. క్రీడా మైదానాలు లేకపోవడంతో పంట పొలాల్లో క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురవుతున్నారు. క్రీడా మైదానాలను ఉపయోగంలోకి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారని క్రీడాకారులు ఆరోపిస్తున్నారు. వేసవి సెలవులు వచ్చిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆటస్థలాలు చక్కటి వేదికలుగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు. లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకువచ్చి గ్రామీణ క్రీడాకారులకు క్రీడాపోటీలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ఉపయోగంలోకి తీసుకురావాలి

అజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ

గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు గత ప్రభుత్వం క్రీడామైదానాలను ఏర్పాటు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో మైదానాలు అలంకార ప్రాయంగా తయారయ్యాయి. ప్రతి ఏడాది పర్వదినాలను పురస్కరించుకొని యువకులు క్రీడాపోటీలను నిర్వహిస్తున్నారు. సరైన క్రీడామైదానాలు లేక పంట పొలాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలను ప్రభుత్వం ఉపయోగంలోకి తీసుకువచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలి.

ఆదేశాలు వస్తే పనులు చేపడతాం

శ్రావణ్‌కుమార్‌, ఏపీవో

గత ప్రభుత్వ హయాంలో క్రీడాప్రాంగణాలను ఏర్పాటు చేయడం జరిగింది. చాలా క్రీడా మైదానాలు అసంపూర్తిగా మిగిలాయి. ప్రభుత్వం నుంచి క్రీడా ప్రాంగణాల నిర్వహణకోసం ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే పనులు చేపడతాం.

Updated Date - May 11 , 2026 | 11:42 PM