Share News

ష్‌.. గప్‌చుప్‌..

ABN , Publish Date - Feb 10 , 2026 | 12:53 AM

Shut up.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారంరోజుల పాటు పట్టణాల్లో వాడవాడల మైకుల హోరు, ర్యాలీల జోరుకు సోమవారం సాయంత్రం బ్రేక్‌ పడింది. పోలింగ్‌కు 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది.

ష్‌.. గప్‌చుప్‌..

- ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం

- ఇక మిగిలింది ఓటరు నాటి పట్టడమే

- తాయిలాల పంపీణీయే తరువాయి

- అన్ని పార్టీల ఉరుకులు పరుగులు

- అభ్యర్థులకు వచ్చే 24 గంటలు కీలకం

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారంరోజుల పాటు పట్టణాల్లో వాడవాడల మైకుల హోరు, ర్యాలీల జోరుకు సోమవారం సాయంత్రం బ్రేక్‌ పడింది. పోలింగ్‌కు 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రదాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలతో పాటు ఇతర పార్టీల నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రచార పర్వంలో ఢీ అంటే ఢీ అని తలపడ్డ అభ్యర్థులంతా ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వాడవాడలా ఓటర్లను తమవైపు తీప్పుకునేందుకు ప్రలోభాల పర్వాన్ని ప్రారంభించారు. మందు, విందు, పచ్చనోట్లతో అకట్టుకునేం దుకు అఖరి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అభ్యర్థుల స్థాయిని బట్టి ఒక్కో ఓటరుకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు పంపిణీ చేస్తుండగా ఆర్థికంగా కొంత బలహీనంగా ఉన్న అభ్యర్థులు ఓటుకు 500 రూపాయలు ఓటరు స్లిప్‌లతో పాటు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని పార్టీలకు వచ్చే 24 గంటలు కీలకంగా మారడంతో సామాజిక లెక్కల కాగితాలను పట్టుకొని అభ్యర్థులు వారి అనుచరులు మున్సిపాలిటీలలోని ప్రతీ వార్డు ప్రతీ ఓటరు తలుపు తడుతున్నారు.

- కుల సంఘాలకు భళే గిరాకీ ...

ఎన్నికల ప్రచారానికి పుల్‌స్టాప్‌ పడడంతో అభ్యర్థులంతా వార్డుల్లో కులాల వారీగా ప్రభావం చూపగల కుల నాయకుల ను బుట్టలో వేసుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇతర పార్టీలు కుల సంఘాల పెద్దలను బుట్టలో వేసుకునేందుకు పెద్దఎత్తున తాయిళాలను ప్రలోభ పెడుతున్నారని తెలుస్తోంది. కులాల వారీగా ఓటర్లను విభజించి ఆయా కులాలకు సంబంధించిన ఓట్లను గంపగుత్తగా పార్టీకి వేయించేందుకుగాను పెద్దమొత్తంలో డబ్బులు ముట్టజెప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు పంపిణీ చేసినప్పటికీ అన్నిపార్టీల అభ్యర్థులు అనుకూల, ప్రతికూల సామాజికవర్గాల లెక్కలను చేతిలో పట్టుకుని వారిని బుట్టలో వేసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

జిల్లాలో 65,132 మంది ఓటర్లు..

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆసిపాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 94 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 13,927 మంది ఓటర్లు ఉండగా పురుషులు 6,822, మహిళలు 7,103, ఇద్దరు ఇతరులు ఉన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 130 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో 51,205 మంది ఓటర్లు ఉండగా పురుషులు 25,004, మహిళలు 26,193, ఇతరులు ఎనిమిది మంది ఉన్నారు.

- ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు..

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ముగిసింది. దీంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. బుధవారం మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ఉండటంతో అందుకు సంబంధించిన ఏర్పాటు పనులను అధికారులు చేపడుతున్నారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులు ఉండగా 28 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, అందులోనే కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులు ఉండగా 85 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పట్టణం లోని డీఏవీ పాఠశాలలో మున్సిపల్‌ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం, కౌంటింగ్‌ కేంద్రంను ఏర్పాటు చేశారు. సోమవారం అయా కేంద్రాలను కలెక్టర్‌ కె హరిత, అదనపు కలెక్టర్‌ డేవిడ్‌తో పరిశీలించారు.

Updated Date - Feb 10 , 2026 | 12:53 AM