భూసమస్యలను సత్వరం పరిష్కరించండి
ABN , Publish Date - Apr 23 , 2026 | 11:17 PM
భూభారతి దరఖాస్తులతో పాటు, పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
- కలెక్టర్ కుమార్ దీపక్
నెన్నెల, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): భూభారతి దరఖాస్తులతో పాటు, పరిష్కారం కోరుతూ కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బెల్లంపల్లి సబ్‌కలెక్టర్ మనోజ్‌తో కలిసి గురువారం నెన్నెల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూభారతి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయి..? ఎన్నింటిని పరిష్కరించారు.. ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయో తహసీల్దార్ శ్రీనివాస్‌ను అడిగి తెలసుకున్నారు. అర్జీదారుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కార్యాలయ రికార్డులు, హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం కార్యాలయానికి వచ్చిన రైతులతో మాట్లాడారు. దరఖాస్తులు ఇచ్చి ఎన్నిరోజులు అవుతుంది... అధికారులు ఎం చెప్పారో రైతులను అడిగి తెలసుకున్నారు. ఆలస్యం చేయకుండా రైతుల పనులను చేసి పెట్టాలని అధికారులకు సూచించారు.
బెల్లంపల్లి: భూభారతి దరఖాస్తుల ప్రకియను సమర్థవంతగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి భూభారతి దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించారు. ఎంతో మంది వివిధ రకాల భూ సమస్యలపై దరఖాస్తులు పెట్టుకున్నారని, ఇందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తాండూర్: భూభారతి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం తాండూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనల ప్రకారం దరఖాస్తుల ప్రక్రియ చేపట్టాలన్నారు. అలాగే పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండి వారు వచ్చిన కారణాలను తెలుసుకుని త్వరగా దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట సబ్ కలెక్టర్ మనోజ్, తహసీల్దార్ ఉన్నారు.