అవనిపై హరివిల్లు
ABN , Publish Date - Jan 04 , 2026 | 11:33 PM
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
మంచిర్యాల, కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
ఆనందోత్సాహాలతో పాల్గొన్న మహిళలు, యువతులు
మంచిర్యాల క్రైం/మంచిర్యాల కలెక్టరేట్/నస్పూర్/శ్రీరాంపూర్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ హైస్కూల్‌లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీలో 72 మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభా పాటవాలను కనబరిచారు. ’ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ సంతూర్ ముత్యాల ముగ్గుల పోటీలు... పవర్డ్‌బై సన్‌ఫీస్ట్ మ్యాజిక్ మామ్స్ బిస్కెట్, టేస్ట్ పార్ట్‌నర్ స్వస్తిక్ మసాలా, ప్రేయర్ పార్ట్‌నర్ పరిమళ్ మందిర్ భారత్‌వాసి అగర్‌బత్తీ...సహకారంతో ఈ పోటీలను నిర్వహించింది. పోటీల్లో ప్రథమ బహుమతి కింద ఆరు వేల రూపాయలు, ద్వితీయ బహుమతి కింద నాలుగు వేల రూపాయలు, తృతీయ బహుమతి కింద మూడు వేల రూపాయలతో పాటు స్పెషల్ కన్సోలేషన్ బహుమతుల కింద ఐదుగురికి 500 రూపాయల చొప్పున నగదు, పోటీల్లో పాల్గొన్న మహిళలందరికీ కన్సొలేషన్ బహుమతులు అందజేశారు.
విజేతలు వీరే...
మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ముత్యాల ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతిని మందమర్రి పట్టణానికి చెందిన శనిగారపు హేమలత, ద్వితీయ బహుమతిని జైపూర్ మండలం ఇందారం గ్రామానికి చెందిన గాదె లలిత, తృతీయ బహుమతిని మంచిర్యాల పట్టణానికి చెందిన కలగూర సుమలత గెల్చుకున్నారు.
స్థానిక స్పాన్సర్లు వీరే....
ముగ్గుల పోటీలకు స్పాన్సర్లుగా ప్రథమ, ద్వితీయ బహుమతులు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన చార్వాక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ ఈఎన్‌టీ వైద్యుడు నీలకంఠేశ్వరరావు, తృతీయ బహుమతి మంచిర్యాల పట్టణంలోని ప్రవీణ్స్ హాస్పటల్ నిర్వాహకుడు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ ప్రవీణ్ బుద్దె, కన్సోలేషన్ బహుమతుల స్పాన్సర్‌గా మక్క కన్‌స్ట్రక్చర్ చైర్మన్ మక్క మురళీమోహన్ వ్యహరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత హాజరుకాగా, న్యాయ నిర్ణేతలుగా జి స్వప్న, పి స్వర్ణలత, డి సునీత వ్యవహరించారు. రాష్ట్రపతి అవార్డుగ్రహీత గుండేటి యోగేశ్వర్ తన వ్యాఖ్యానంతో అలరించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ డేగ సత్యం, పాత్రికేయులు పూరెళ్ల లక్ష్మణ్, చెనిగారపు జనార్దన్, బియ్యాల రాజ్‌కుమార్, కేశిరెడ్డి నారాయణరెడ్డి, అత్తెసాగర్, రాజ్‌గోపాల్ రావు, ఎనగందుల సత్యం, రాంచందర్, తణుకు కృష్ణమూర్తి, విష్ణువర్ధన్ రావు, ఏబీఎన్ జిల్లా స్టాఫ్ కెమెరామెన్ రామంచ శ్రీనివాస్, అడ్వటైజ్‌మెంట్ ఇన్‌చార్జి మల్లేష్‌గౌడ్, అసిస్టెంట్ సర్యులేషన్ ఆఫీసర్ గణేష్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
‘ఆంధ్రజ్యోతి’ కృషి అభినందనీయం
- డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత
సంక్రాంతి పండుగపూట మహిళలను ఉత్తేజపరిచేందుకు ముగ్గుల పోటీలు ఏర్పాటుచేస్తూ సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ చేస్తున్న కృషి అభినందనీయమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత పేర్కొన్నారు. పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు తరలిరావడం అభినందనీయమన్నారు. సంప్రదాయం ఉట్టిపడేలా వివిధ అలంకరణలతో మహిళలు వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయన్నారు. చిన్న పిల్లలు సైతం పోటీలలో వారి ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను, స్పాన్సర్ చేసిన వారిని ఆమె అభినందించారు.
సృజనాత్మకత వెలికితీయడం సంతోషదాయకం
- డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు
ఏబీఎన్ ‘ఆంధ్రజ్యోతి’ మహిళల్లోని సృజనాత్మకతను వెలికితీయడం కోసం ముత్యాల ముగ్గుల పోటీ నిర్వహించడం సంతోషదాయకం. తెలుగు రాష్ర్టాలతో సంక్రాంతి అంటేనే ముగ్గులు అనేవిధంగా ప్రతీ ఏటా ముగ్గుల పోటీ నిర్వహించడం ఆనందంగా ఉంది. ఆంధ్రజ్యోతి చేపట్టే ప్రతీ కార్యక్రమానికి సహాయ, సహకారాలు అందిస్తాం.
నా బాల్యాన్ని గుర్తు చేశాయి..
- న్యాయనిర్ణేత జి స్వప్న
ఏ పోటీలోనైనా గెలుపోటములు సహజం. పోటీల్లో పాల్గొంటున్నారంటే నైతికంగా విజయం సాధించినట్లే. ఇంటి బాధ్యతల్లో నిత్యం బిజీగా ఉండే మహిళలను ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొనే విధంగా ప్రోత్సహిస్తున్న ‘ఆంధ్రజ్యోతి’ కృషి అభినందనీయం. చిన్నారులు వేసిన ముగ్గులు నా బాల్యాన్ని గుర్తుచేశాయి.
ప్రతీ సంవత్సరం పాల్గొంటున్నా...
ప్రథమ బహుమతి విజేత శనిగారపు హేమలత
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించే సంక్రాంతి ముగ్గుల పోటీల్లో ప్రతీ సంవత్సరం పాల్గొంటున్నాను. పోటీల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. రెండుసార్లు జిల్లాస్థాయిలో, ఒకసారి రాష్ట్రస్థాయిలో విజేతగా నిలవడం సంతోషంగా ఉంది. ఇప్పటికి ఎనిమిదిసార్లు పోటీల్లో పాల్గొన్నా. రాష్ట్రస్థాయిలో బహుమతి సాధించేందుకు ప్రయత్నిస్తా.
ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషం....
గాదె లలిత, ద్వితీయ బహుమతి విజేత
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. ఒకసారి రాష్ట్రస్థాయి బహుమతి వచ్చింది. ఇలాంటి పోటీలు ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించడం ఎంతో అభినందనీయం. రాష్ట్రస్థాయిలో విజేతగా నిలిచేవరకు పోటీల్లో పాల్గొంటూనే ఉంటా.
వినూత్న ఆలోచనకు బహుమతి వచ్చింది
తృతీయ బహుమతి విజేత, కలగూర సుమలత
ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీల్లో భాగంగా వినూత్నంగా రైతు, సైనికుని చిత్రంతో అందరినీ ఆలోచింపజేసే విధంగా ముగ్గు వేశాను. దీనికి బహుమతి లభించింది. దేశానికి రైతు, సైనికులు చాలా ముఖ్యం అనే ధోరణిలో ముగ్గు వేశాను. బహుమతి రావడం చాలాసంతోషంగా ఉంది.