వేసవి దుక్కులతో లాభాలు మెండు
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:07 PM
వేసవిలో దుక్కులు దున్నడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడ, పీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు లోతుగా వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
- చీడపీడల నివారణ
- దుక్కులతో వర్షపు నీరు లోతుకు చేరే అవకాశం
- భూసార పరీక్షలు కీలకం
- సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరం
వేసవిలో దుక్కులు దున్నడం వల్ల అనేక ప్రయోజనాలుంటాయి. పంటల ఉత్పత్తి పెరగడంతోపాటు చీడ, పీడల బెడద ఉండదు. అంతేకాకుండా లోతు దుక్కుల వల్ల వర్షపు నీరు లోతుగా వెళ్లి పంటలకు ఉపయోగకరంగా ఉంటుంది. సాగుకు ముందస్తు ప్రణాళిక అవసరమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
వాంకిడి, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతాంగం ఇప్పటి నుంచే సాగుకు సన్నాహాలు చేసుకుంటుంది. అయితే ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తే అధిక దిగుబడులు, మంచి లాభాలు పొందే అవకాశముంటుంది. భూసార పరీక్షలు, వేసవి దుక్కులు, చేను చదును, విత్తనాల ఎంపిక, విత్తన శుద్ధి, ఎరువుల వాడకం, పంటకు అనుగుణంగా భూమిని సిద్ధం చేయడం, తదితర ప్రణాళికలను ముందస్తుగా తయారు చేసుకుంటే పంట పండించడానికి అదే మంచి మందు అవుతుందని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తొలకరి వర్షాలు పడేవరకు వేచిచూసి ఖరీఫ్ పనులు ప్రారంభించుకునే కంటే ముందునుంచే సాగుకు సన్నద్ధమైతే సాగులో అధిక దిగుబడులు సాధించవచ్చు.
మొదళ్లను భూమిలో కలపడం...
జిల్లాలో ఏటా పత్తి పంట దిగుబడి అనంతరం పత్తి చెట్ల మొదళ్లను కుప్పగా చేసి రైతులు తగలబెడుతుంటారు. దీనిద్వారా సమయం వృథా కావడమే కాకుండా ఎటువంటి లాభం లేకుండా పోతుంది. ఒక్కొక్క కర్రను పీకేస్తుంటారు. దీనికోసం కూలీలను సైతం పెడుతుంటారు. అయితే కూలీల సమస్య లేకుండా పత్తి మొదళ్లు వృఽథాపోకుండా చేయడానికి రోటవేటర్ సహాయంతో భూమిలో తేమ ఉన్నప్పుడు కలియదున్నాలి. తర్వాత మరోసారి రోటవేటర్‌తో దున్నాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమేకాకుండా పత్తి పంటకు కావాల్సిన కృత్రిమ ఎరువులను తగ్గించవచ్చు. ఈ పద్ధతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో మాత్రమే రైతులు ఆచరించి లాభం పొందుతున్నారు.
వేసవి దుక్కులు కీలకం...
ఖరీఫ్ సాగుకు ముందునుంచే పంట పొలాలను చదును చేసుకుని నెలరోజుల ముందు వేసవిదుక్కులు దున్నుకోవాలి. తొలకరికి ముందే పంట విత్తుకోవడానికి భూములను సిద్ధం చేసుకోవాలి. వర్షాలకు ముందే విత్తుకోవడానికి భూములను తయారు చేసుకోవాలి. పంట కోతల తర్వాత భూమిని వృథాగా వదిలివేయకుండా వేసవిలో దుక్కి దున్నినట్లయితే చీడపీడలను కొంత వరకు నివారించవచ్చు. నేలను లోతుగా దున్నడంతో కొంత తేమలో ఉన్న కీటకాలు నశిస్తాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని భూమిని దున్నుకోవాలి. ఈ వర్షాలతో లోతుగా దున్నడం మూలంగా వరుస వరుసకు మధ్యలో వర్షపునీరు నిలిచి భూమిలోనికి చేరుతుంది. మొదటిసారి దుక్కులు దున్నిన తర్వాత రెండోసారి దున్నే ముందు పశువుల ఎరువు, వర్మీకంపోస్టుగానీ, వ్యవసాయ అధికారులు సూచించిన చెరువు మట్టిని పొలంలో వేసుకోవాలి. దీంతో పంటదిగుబడి సామర్థ్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులను అందించడం ద్వారా సూక్ష్మపోషక లోపాలను నివారించవచ్చు.
లోతు దుక్కులతో మేలు..
లోతుదుక్కులు దున్నడం చాలా ఉపయోగం. 35-40 సెంటీమీటర్ల లోతుగా దుక్కి చేయడంవల్ల భూమిలో గట్టి పొర పగిలి నేల బాగా గుల్లబారుతుంది. వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. ఇంకిన నీరు భూమిలో నిలువ ఉండడంవల్ల పంట వేర్లు లోపలి పొరల్లో పెరిగి ఎక్కువ నీటిని, పోషక పదార్థాలను గ్రహించడానికి వీలవుతుంది. లోతు దుక్కిన ప్రభావం 2-3 సంవత్సరాల వరకు ఉండడంతో పంటల దిగుబడులకు భూములు అనుకూలంగా ఉంటాయి.
భూసార పరీక్షలు...
మనిషిలో వ్యాధి నిర్ధారణకు ఏ విధంగానైతే రక్త, మూత్ర పరీక్షలు అవసరమో పంటకు కూడా భూసార పరీక్షలు అవసరమే. భూసార పరీక్షకు ముందు మట్టి నమూనాలు సరైన పద్ధతిలో తీసుకోవాలి. భూమిలో సారం ఎంత వరకు ఉంది. ఎలాంటి వ్తితనాలు, ఎంత మోతాదులో ఎరువులు వాడాలి అనేది తెలుసుకోవడానికి భూసార పరీక్షలు కీలకం. భూసార పరీక్షలపై ప్రభుత్వం విస్తృతప్రచారం చేస్తూ రైతులకు అవగాహన కూడా కల్పిస్తుంది. భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే పంటలు విత్తుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. భూసార పరీక్షల ద్వారా భూమిలో సూక్ష్మ, స్థూల పోషకాల లోపాలు, మోతాదు పద్ధతిలో ఎరువుల వాడకం ద్వారా అదనపు ఖర్చులు తగ్గించుకునే వీలుంది. భూమిలో భాస్వరం వినియోగాన్ని బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలి. ఆధునిక యంత్రాల వినియోగం సాంకేతిక పరిజ్ఞానం పాటించడం వల్ల ఎక్కువ దిగుబడులు సాధించుకోవచ్చు. ఇలాంటి పద్ధతులు పాటించకుండా రూ. వేలల్లో పెట్టుబడులు పెడుతూ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇసుక నేలలు, బంక మట్టి నేలలు, రేగడి నేలలు, నీరు నిలిచే నేలలు తదితర నేలలకు అనుగుణంగా పంట విత్తుకోవడంతో ఆశించిన దిగుబడులు పొందవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
సేంద్రియ ఎరువులు వాడకం...
సేంద్రియ ఎరువులు నేలలో కుళ్లి ఖనిజ పొరలను అభివృద్ధిచేసి పంటకు అవసరమైన స్థూల, సూక్ష్మ పోషకాలను అందిస్తాయి. రసాయనిక, భౌతిక, జీవగుణాలపై ప్రభావం చూపిస్తాయి. సేంద్రియ ఎరువుల్లో పశువులు, కోళ్లు, గొర్రెలు, వానపాముల ఎరువులను వేసి భూమిలో కలియదున్నాలి. సేంద్రియ పదార్థం వేయడం వల్ల భూమి గట్టి పడకుండా గుల్లగా ఉంటుంది. నీరు బాగా ఇంకడం వల్ల భూమిలో తేమ గణనీయంగా పెరిగి విత్తనం బాగా మొలకెత్తుతుంది.
సాలుకు అడ్డంగా దున్నడం...
సాలుకు అడ్డంగా సేద్యం చేస్తే నీటి సంరక్షణ పెరుగుతుంది. విత్తనం వేయడం, అంతర కృషి చేయడం వల్ల వర్షపు నీరు వాలుగా ఉన్న వైపు పరిగెత్తే అవకాశం ఉండదు. నీటి వేగం తగ్గి భూమిలోకి ఇంకడానికి అవకాశం కలుగుతుంది. ఎక్కువ నీరు భూమిలోకి ఇంకడం వల్ల తేమ శాతం పెరిగి అధికదిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రణాళికతో సాగుచేయాలి
మిలింద్‌కుమార్- ఏడీఏ, ఆసిఫాబాద్
రైతులు ప్రణాళికతో సాగుచేస్తే అధికదిగుబడులు సాధించుకోవచ్చు. వేసవిలో భూములను లోతుగా దున్నుకోవడంవల్ల భూమిలోని పంటలను నాశనం చేసే క్రీములు చనిపోతాయి. ఖరీఫ్‌కు ప్రారంభానికి రెండు నెలల ముందు నుంచే వేసవి దుక్కులు దున్నుకోవాలి. కొంత మంది రైతులు వర్షాకాలం సమీపించే వరకు పంటలను ఉంచుతున్నారు. వేసవి దుక్కులు దున్నడం లేదు. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. విత్తనాల ఎంపిక, సేంద్రియ ఎరువల వాడకం అవసరం, వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ పంటల సాగు చేసి అధికదిగుబడులు సాధించుకోవాలి