Share News

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:30 PM

జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రఽదాన పట్టణాల్లో గల్ల్లీగల్లీకి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారు.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

- కనీస నిబంధనలు పాటించని యాజమాన్యాలు

- బహుళ అంతస్థుల భవనాల్లో విద్యాలయాల ఏర్పాటు

- ఆటస్థలం ఉండాలన్న నిబంధనలు గాలికి

- అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన

మంచిర్యాల, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ప్రఽదాన పట్టణాల్లో గల్ల్లీగల్లీకి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అర్హత లేని వారు సైతం పాఠశాలలు నెలకొల్పుతూ అందినకాడికి దండుకుంటున్నారు. వ్యాపార దృక్పథంతో రోజురోజుకూ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో పాఠశాలలు వెలుస్తున్నా విద్యాశాఖాధికారులు పట్టించుకున్న పాపాన పోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 15 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలలు స్థాపించి ప్రచార హోరు మోగిస్తున్నారు. బ్రాంచీల పేరుతో పాఠశాలలు నెలకొల్పుతూ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇరుకుల గదుల్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండానే పాఠశాలలను నెలకొల్పుతున్నారు. విద్యా వ్యాపారం లాభసాటిగా మారడంతో ఇతరాత్ర రంగాలకు చెందిన వ్యాపారులు సైతం ప్రాముఖ్యత(బ్రాండెడ్‌) కలిగిన సంస్థల పేర్లను ఉపయోగించి పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రభుత్వ గుర్తింపు లేకున్నా...

జిల్లాలో నూతనంగా నెలకొల్పుతున్న కొన్ని పాఠశాలలకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు లేకున్నా అడ్మిషన్లు సేకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. విద్యాశాఖ నిబంధనల ప్రకారం మొదట ప్రారంభ అనుమతి పొందిన అనంతరం పాఠశాలలను ఏర్పాటు చేయాలి. అందుకు భిన్నంగా ప్లే స్కూళ్లు, కిడ్స్‌ స్కూళ్ల పేరిట కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చదివే విద్యార్థులకు భవిష్యత్‌ల్లో బోనఫైడ్‌ సర్టిఫికేట్‌లు అందక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం పొందిన పక్షంలో బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ తప్పనిసరిగా అడుగుతారు. అప్పుడు అభ్యర్థులు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వేల రూపాయలు దారపోసి చదివించే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గుర్తింపు ఉండి, అన్ని రకాల సౌకర్యాలు ఉన్న పాఠశాలల్లోనే చేర్పిస్తే వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసినవారు అవుతారు.

విద్యాశాఖ నిబంధనలివీ....

- పాఠశాలను ప్రారంభించేముందు విద్యాశాఖకు చలానా రూపంలో తనిఖీ రుసుం చెల్లించి నిబంధనల మేరకు ఓపెనింగ్‌ అనుమతులు పొందాలి. అనంతరం పాఠశాల ఏర్పాటుచేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలి. అన్నివసతులు కల్పించినట్లు ప్రతిపాదనలు తయారుచేసి శాశ్వత గుర్తింపు కోసం ఫైల్‌ విద్యాశాఖకు అందజేయాలి. దరఖాస్తు సమయంలో రూ. 50వేలు ఎండోమెంట్‌ రుసుము చెల్లించాలి.

- విద్యార్థులు ఆడుకోవడానికి పాఠశాలకు అనుసంధానంగా పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు మీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 2000 చదరపు మీటర్ల ఆట స్థలం కలిగి ఉండాలి.

- అగ్నిమాపకశాఖ అనుమతి తీసుకొని ఉండాలి. ప్రతీ పాఠశాలలో అగ్నిమాపక పరికరాలు (ఫైర్‌ ఎస్టింగిషర్స్‌, అలారం) అందుబాటులో ఉండాలి.

- పాఠశాల భవన స్థితిగతులతోపాటు విద్యార్థుల ఆరోగ్యం కోసం ధారాళంగా గాలి, వెలుతురు సౌకర్యాలు ఉన్నట్లు సూచించే సౌండ్‌నెస్‌, శానిటరీ సర్టిఫికేట్లు విద్యాశాఖ అధికారులకు అందజేయాలి.

- పాఠశాలల్లో విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఇంటర్‌తో పాటు టీటీసీ లేదా డిగ్రీ అనంతరం బీఈడీ శిక్షణ పొంది ఉండాలి. వ్యాయామ ఉపాధ్యాయులైతే బీపీఈడీ శిక్షణ పొంది ఉండాలి.

- విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వేర్వేరుగా టాయ్‌లెట్ల సౌకర్యం కల్పించాలి.

- తరగతి గదులు విద్యార్థులకు అనుగుణంగా విశాలంగా ఉండటంతోపాటు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే వెసులుబాటు కలిగి ఉండాలి.

- విద్యార్థుల వేథాశక్తి కోసం పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటు చేయాలి. అందులో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి.

- పాఠశాలలో తప్పనిసరిగా కంప్యూటర్‌, టీవీ వంటి ప్రసార సాధనాలు అందుబాటులో ఉండాలనే నిబంధనలున్నా చాలా పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా విద్యాబోధన జరుగుతోంది.

అర్హతలేని ఉపాధ్యాయులతో విద్యాబోధన...

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలల్లో చాలా వాటిలో అర్హత లేని ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నట్లు సమాచారం. చాలా పాఠశాలల్లో కేవలం ఇంటర్మీడియట్‌, డిగ్రీ అర్హతలు ఉన్నవారిని ఉపాధ్యాయులుగా నియమిస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో డీఈడీ శిక్షణ పొంది ఉన్నట్లయితే విద్యార్థుల మనసత్వాన్ని ఎరిగి వారిని విద్యపట్ల ఆకర్షితులను చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నత తరగతులు బోధించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా బీఈడీ, తదితర ట్రైనింగ్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. అయితే ఎలాంటి ట్రైనింగ్‌ లేకున్నా, కేవలం అకాడమిక్‌ అర్హతలతోనే ఉపాధ్యా యులుగా నియమిస్తున్నట్లు తెలుస్తోంది.

Updated Date - Jun 08 , 2026 | 11:30 PM