మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం
ABN , Publish Date - Apr 06 , 2026 | 11:04 PM
జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మహిళలు, యువతులు ఎటువంటి హింసకు గురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
- ఎస్పీ నితికా పంత్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు. మహిళలు, యువతులు ఎటువంటి హింసకు గురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. షీ టీం, యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్, భరోసా కేంద్రాల ద్వారా మహిళల రక్షణకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థినులు, మహిళలకు ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, పోక్సో చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మార్చి నెలలో జిల్లావ్యాప్తంగా షీ టీం ద్వారా 71 హాట్‌స్పాట్ ప్రాంతాలను గురించి 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆరుగురిని రెడ్‌హ్యాండ్‌గా పట్టుకుని వచ్చిన ఫిర్యాదుల్లో నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి ఒక కేసులో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. సామాజిక మాద్యమాల వినియోగంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హింసకు గురైన వారు నేరుగా పోలీసులను సంప్రదించలేని పరిస్థితుల్లో షీ టీంలను సంప్రదించాలని సూచించారు. జిల్లాలో రెండు షీ టీంలు పని చేస్తున్నాయని ఆసిఫాబాద్( 8712670564), కాగజ్‌నగర్ (8712670565) లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.
ఫిర్యాదుల స్వీకరించిన ఎస్పీ
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 12 ఫిర్యాదు లను స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి అవసరమైన సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలని, ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా పోలీసు శాఖ ప్రజలకు చేరువగా ఉండి శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.
పదోన్నతి చిహ్నం బహూకరణ
ఏఆర్‌ఎస్సై నుంచి ఆర్‌ఎస్సైగా పదోన్నతి పోందిన దేవాజీకి ఎస్పీ నితికా పంత్ రెండు చుక్కల చిహ్నాన్ని సోమవారం బహుకరించి అభినందించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ వామనమూర్తి ఉన్నారు.