పరిషత్ ఎన్నికలకు కసరత్తు
ABN , Publish Date - Apr 21 , 2026 | 11:50 PM
పల్లెల్లో మళ్లీ ఎన్నికల వాతావరణం మొదలుకానుంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.
- ఓటరు జాబితా తయారీ పనిలో అధికారులు
- ఈనెల 23లోగా జాబితా సిద్ధం
- జిల్లాలో 15 జడ్పీటీసీలు, 127 ఎంపీటీసీ స్థానాలు
ఆసిఫాబాద్‌రూరల్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): పల్లెల్లో మళ్లీ ఎన్నికల వాతావరణం మొదలుకానుంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. గత డిసెంబరులో గ్రామపంచాయతీ, ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు పూర్తి కాగా తాజాగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. జాబితాలో లోటుపాట్లు ఉంటే 23లోగా నివేదిక ఇచ్చి, ఆ తర్వాత ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
- 3,53,895 మంది ఓటర్లు
జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలు, 127 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. గత సెప్టెంబరు 6వ తేదిన పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. ఆ జాబితా ప్రకారమే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. జిల్లాలో 3,53,895 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,76,606 మంది, మహిళలు 1,77,269 మంది, ఇతరులు 18 మంది ఉన్నారు.
ప్రత్యేకాధికారుల పాలనలో...
గత ఏడాది జూలై 3, 2024న ఎంపీటీసీ, జూలై 4, 2024న జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల నిర్వహణ ప్రత్యేక అధికారుల పాలనలో సాగుతోంది. గత సెప్టెంబరులో ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రత్యే ఆర్డినెన్స్ ద్వారా మొదట జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసినా కోర్టు ఆదేశాలతో ఆ ఎన్నికలకు బ్రేక్ పడింది. రిజర్వేషన్లు సైతం ప్రకటించి నామినేషన్ స్వీకరణ షెడ్యూల్ సైతం ప్రారంభించినప్పటికీ ప్రభుత్వం కోర్టు అదేశాలతో ఎన్నికలను వాయిదా వేసింది. అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించిన ప్రభుత్వం పరిషత్ ఎన్నికలు మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో త్వరలోనే పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
- సిద్ధమవుతున్న ప్రధాన పార్టీలు
పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీల దృష్టి ఇప్పుడు పరిషత్ ఎన్నికలపై పడింది. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండడంతో జూన్, జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అధికార కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తాచాటిన అధికార కాంగ్రెస్ పార్టీ పరిషత్‌లోను సత్తాచాటి జిల్లా పరిషత్‌తో పాటు మెజార్టీ మండల పరిషత్‌లను గెలుచుకునేందుకు సన్నద్ధం అవుతోంది. అలాగే బీఆర్‌ఎస్, బీజేపీలు సైతం పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ గుర్తులతో జరిగే ఎన్నిక కావడంతో అన్ని రాజకీయ పార్టీలు పరిషత్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.