గోదావరి పుష్కరాలకు సన్నద్ధం
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:57 PM
గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది.
- రూ. 50 కోట్లకుపైగా నిధులతో ఏర్పాట్లు
- జిల్లాలో పలుచోట్ల పుష్కరఘాట్లకు ప్రతిపాదనలు
- పది లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అంచనా
- ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష
మంచిర్యాల, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది. నదీతీరంలో పుష్కర ఘాట్ల అభివృద్ధితోపాటు రహదారులు, భక్తుల సౌకర్యాల కోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది. 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు 12 రోజుల పాటు జరిగే గోదావరి పుష్కరాలకు జిల్లా వ్యాప్తంగా పెద్దసంఖ్యలో భక్తులు వస్తారనే అంచనాల తో అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పుష్కరాల నిర్వహణకు కావలసిన నిధులపై ప్రభుత్వా నికి నివేదికలు పంపేందుకు డీపీఆర్ సిద్ధం చేసే పనిలో అధికారులు ఉన్నారు. పుష్కర ఏర్పాట్లపై కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ సన్నద్ధం చేస్తున్నారు.
- పది లక్షలకు పైగా భక్తులు...
జిల్లాలోని దండేపల్లి మండలం గూడెం మొదలుకొని లక్షెట్టిపేట, ఇటిక్యాల, ముల్కల్ల, మంచిర్యాల, సీతారాంపల్లి, జైపూర్ మండలం వేలాల, చెన్నూరు, కోటపల్లి వరకు గోదావరి తీరం వెంట దాదాపు పది లక్షలకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గత పుష్కరాల సమయంలోనే జిల్లా వ్యాప్తంగా ఐదు లక్షలకు పైగా భక్తులు పుణ్యసాన్నాలు ఆచరించగా, జాతీయ రహదారుల విస్తరణ, కనెక్టివిటీ కారణంగా వారి సంఖ్య పది లక్షలు దాటనుందని అంచనా. గోదావరి పుష్కరాలకు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్‌తోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాషా్ట్రల నుంచి కూడా భక్తులు తరలి రానుండటంతో వారి సంఖ్యకు సరిపడా ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశం ఉండటంతో ఇప్పటికే కలెక్టర్ నేతృత్వంలో ఇతర సంబంధిత జిల్లా యంత్రాంగం ఆయా ప్రదేశాలను పరిశీలించింది. ఏర్పాట్లలో భాగంగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో పుష్కరఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్నచోట వాటికి మరమ్మతు పనులు, ఘాట్ల వద్ద స్నానం ఆచరించేందుకు అవసరమైన నీటి కుళాయిల ఏర్పాటు, మహిళలు దస్తులు మార్చుకొనేందుకు ప్రత్యేక గదులు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టనుండగా, ఆర్‌అండ్‌బీ, పంచాయత్‌రాజ్‌శాఖ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ల వద్దకు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే ఆయా ప్రదేశాల్లోని ఆలయాల అభివృద్ధి కోసం కూడా చర్యలు చేపట్టనున్నారు.
- పారిశుధ్యం, లైటింగ్, తాగునీరు..
గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోయే గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు కేటాయించింది. ఇందులో జిల్లా అవసరాల కోసం రూ. 50 కోట్లకు పైగా నిధులను వెచ్చించనున్నారు. జిల్లావ్యాప్తంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొత్తం 13 పుష్కర ఘాట్లను అభివృద్ధి చేసేందుకు దేవాదాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే పనులకు సంబంధించిన నిధుల కోసం ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపింది. గోదావరి పుష్కర పనులను మూడంచెలుగా చేపట్టనున్నారు. మొదటి విడుతలో మంచిర్యాల, చెన్నూరు పుష్కరఘాట్ల పనులు చేపడుతుండగా, మిగతా చోట్లా పనులు రెండు, మూడు విడతల్లో చేపట్టనున్నారు. మంచిర్యాల వద్ద పనులు చేపట్టేందుకు 20 కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా, చెన్నూరులో 14.25 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. మిగిలిన నిధులతో జిల్లాలోని ఇతర ఘాట్ల పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. మంచిర్యాల నగరంలోని గోదావరి తీరంలో ఇప్పటికే పుష్కఘాట్ ఉండగా, నది ఒడ్డున ఉన్న గౌతమేశ్వరాలయం, స్థానికంగా ఇతర ఏర్పాట్లకు 10 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. అలాగే నగరంలోని ప్రసిద్ధ విశ్వనాథాలయం అభివృద్ధి కోసం మరో 10 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. చెన్నూరులోని మదన పోచమ్మ ఆలయానికి మూడు కోట్ల రూపాయలు, జగన్నాథస్వామి ఆలయానికి నాలుగు కోట్ల రూపాయలు, కత్తెరశాల మల్లికార్జున స్వామి ఆలయానికి 1.5 కోట్ల రూపాయలు కేటాయిస్తుండగా, స్థానికంగా ఉన్న మిగతా ఆలయాల అభివృద్ధి పనులు కూడా శాశ్వతంగా చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు పుష్కరఘాట్ల వద్ద పారిశుధ్యం, లైటింగ్, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.
- రోడ్లకు మహర్దశ....
గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని దేవాదాయశాఖ చేపట్టే పనులకు అధనంగా ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో అవసరమైన చోట వివిధ పుష్కరఘాట్లకు వెళ్లేందుకు శాశ్వతంగా రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవాదాయశాఖ కేటాయించిన నిధులకు అదనంగా రోడ్ల నిర్మాణాలు జరగనున్నాయి. గోదావరి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో శాశ్వత రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేపట్టనున్నారు. గోదావరి పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. పుష్కరాలు జూన్-జూలై నెలల్లో వర్షాకాలం ప్రారంభంలో జరుగను న్నాయి. దీంతో పార్కింగ్ స్థలాలు బురదమయ్యే అవకాశాలు అనేకం ఉన్నాయి. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తులు సైతం ఉన్నాయి.
శాశ్వత ప్రాతిపదికన పనులు...
కుమార్ దీపక్, కలెక్టర్
గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పార్కింగ్, వాహనాల నియంత్రణ కోసం అంతర్గత రహదారుల విస్తరణ, మునిసిపాలిటీల పరిధిలో రహదారుల విస్తరణ, మూత్రశాలలు, దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదలు ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేపట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికల్లా పుష్కర పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటాం.