ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 15 , 2026 | 11:34 PM
ప్రజవాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు.
- అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్
ఆసిఫాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): ప్రజవాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి వేణుతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామానికి చెందిన మడిరాం తనకు వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. రెబ్బెన మండలం నవేగాం గ్రామానికి చెందిన శకుంతల తనకు రైతు బీమా డబ్బులు మంజూరు చేయాలని, కాగజ్‌నగర్ పోచమ్మ బస్తీకి చెందిన దివ్యాంగుడు రాజేశ్వర్ తనకు ఎలక్ట్రికల్ సైకిల్ అందజేయాలని అర్జీ సమర్పించారు. దహెగాం మండలం ఐనం గ్రామానికి చెందిన దుర్గాగౌడ్ తనకు ప్రభుత్వం ఇచ్చిన లావుని పట్టా భూమిని అటవీ శాఖ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దహెగాం మండలం ఐనం సర్పంచ్ ప్రశాంత్ తమ గ్రామంలో వంగిన విద్యుత్ స్తంభాలను సరిచేయాలని, రెబ్బెన మండలం కైరిగాం గ్రామపంచాయతీ పరిధిలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన రైతులు తమ పంట పొలాలకు వట్టివాగు నీరు అందించాలని కోరారు. కౌటాల మండలం బాలెపల్లికి చెందిన సాయిప్రసాద్ తనకు ఎనిమిదో తరగతిలో గురుకుల పాఠశాలలో సీటు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు అందజేశారు. దహెగాం మండలం కోత్మీర్‌కు చెందిన రాజయ్య తనకు బ్యాంకు నుంచి రుణం ఇప్పించాలని అర్జీ సమర్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌లో లేకుండా పర్యవేక్షించాలని తెలిపారు.