Share News

చివరి దశకు పింఛన్ల ప్రక్షాళన

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:28 PM

‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే చివరి అంకానికి చేరుకుంది.

చివరి దశకు పింఛన్ల ప్రక్షాళన

- కొనసాగుతున్న అనర్హుల ఏరివేత

- జిల్లాలో 92,659 మంది లబ్ధిదారులు

- ఈ నెలాఖరుతో ముగియనున్న సర్వే

- అనంతరం కొత్త పింఛన్‌ దరఖాస్తుల పరిశీలన

- గంపెడాశతో ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు

మంచిర్యాల, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘చేయూత’ పింఛన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే చివరి అంకానికి చేరుకుంది. లబ్ధిదారుల్లో మృతి చెందిన వారిని గుర్తించి, వారి పింఛన్లు రద్దు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టగా ఈ నెలఖారు వరకు కొనసాగనుంది. గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు, నగరపాలక సంస్థ, పురపాలక సంఘాల కమిషనర్లు సంయుక్తగా పింఛన్ల జాబితాలో మృతుల వివరాలు అందజేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ అధికారులు, కార్పొరేషన్‌, మునిసిపాలిటీల్లో వార్డు అధికారులు, బిల్‌ కలెక్టర్లు లబ్ధిదారుల సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. పదేళ్లుగా అందుతున్న పింఛన్లలో చాలా మంది వృద్ధులు, ఇతర లబ్ధిదారులు మృతి చెందినప్పటికీ వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఇంకా సొమ్ము జమ అవుతూనే ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. మృతుల ఏరివేతతో పింఛన్ల రూపంలో ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారం తగ్గడంతోపాటు నిజమైన పేదలు, అవసరమున్న వారికి లబ్ధి చేకూరుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వే అనంతరం ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులకు కొత్త పింఛన్లు జారీ చేయనున్నారు.

జిల్లాలో 92,159 మంది లబ్దిదారులు....

వివిధ రకాల పింఛన్లు పొందుతున్న వారిలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 92,159 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో మునిసిపాలిటీలకు చెందిన 22,641 మంది లబ్ధిదారులు ఉండగా, వీరికి బ్యాంకు ఖాతాల్లో నగదు పింఛన్‌ డబ్బులు జమ అవుతుండగా, 70,018 మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. వారందరికీ పోస్టాఫీసుల ద్వారా నెలవారీ పింఛన్లు అందుతున్నాయి. గతప్రభుత్వ హయాం నుంచి ఈ విధంగా లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతూనే ఉంది. ఈక్రమంలో చనిపోయిన వారికి కూడా పింఛన్‌ సొమ్ము జమ అవుతుందనే ప్రచారం మేరకు ప్రభుత్వం సర్వేకు పూనుకుంది. సర్వేలో భాగంగా అధికారుల విచారణలో మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు మందమర్రి, బెల్లంపల్లి మునిసిపాలిటీలకు సంబంధించి పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు 1,600 పైచిలుకు లబ్ధిదారులు మృతి చెందినట్లు తేలింది. అలాగే పోస్టాఫీసు ద్వారా పింఛన్లు పొందుతున్న వారిని ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు చేపడుతున్నారు. గత ఏడాది ఆగస్టు నుంచే సర్వే నిర్వహిస్తుండగా, ఈ నెలాఖరుతో ముగియనుంది.

దరఖాస్తుల పరిశీలనకు..

ప్రస్తుతం జరుగుతున్న సర్వే ముగియగానే నివేదికలను సంబంధిత అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. అనంతరం కొత్త దరఖాస్తుల పరిశీలన చేపట్టనున్నారు. అనంతరం అర్హుల జాబితా తయారుచేసి, కొత్త పింఛన్లు పంపిణీ ప్రారంభించనున్నారు. కొత్త పింఛన్ల కోసం ప్రభుత్వం ఏర్పాటైన తరువాత ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. అంతా సవ్యంగా సాగితే కిందటి ఏడాది ఆగస్టు 1 నుంచే కొత్త పింఛన్లు అందజేయాలని ప్రభుత్వం భావించించింది. కానీ మృతిచెందిన లబ్ధిదారుల అంశం తెరపైకిరావడం, జాబితాను ప్రక్షాళన చేయాల్సి రావడంతో కొత్త దరఖాస్తుల పరిశీలనకు ఆటంకం ఏర్పడింది. నెలాఖరుతో సర్వే పూర్తికానుండగా, అనంతరం కొత్త దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి, అర్హుల జాబితాను తయారు చేయనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత వివిధ రకాల పథకాల కోసం స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగానే పింఛన్‌దారుల నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆయా దరఖాస్తులతోపాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెండింగులో ఉన్న పింఛన్‌ లిస్టు కూడా పరిగణలోనికి తీసుకోవడం ద్వారా అర్హుల జాబితా తయారు చేయాలనే ఆదేశాలు వెలువడ్డాయి. వివిధవర్గాలకు చెందిన అర్హులకు చేయూత పథకం కింద పింఛన్లు పెంచబోతుండగా ప్రస్తుతం చేనేత, ఫైలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, ఎయిడ్స్‌ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నారు. ప్రస్తుతం ఆసరా పథకం కింద 2,016 రూపాయలు, దివ్యాంగులకు 3,016 రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్‌ హామీ మేరకు చేయూత పథకం ద్వారా దివ్యాంగులకు రూ. ఆరు వేల రూపాయలు, ఇతరులకు నాలుగు వేల రూపాయలు అందించే అవకాశాలు ఉన్నాయి.

భారీగా దరఖాస్తులు...

ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా వివిధ పథకాలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా మొత్తం 10లక్షల 84వేల 479 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. వీటిలో ఇప్పటి వరకు రెండు లక్షల 54వేల 989 దరఖాస్తులు కంప్యూటరైజ్డ్‌ చేయగా, మిగతా వాటిని త్వరలో ఎంటర్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. దరఖాస్తుల్లో చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్లు మంజూరు చేసేందుకు అంగవైకల్యం కింద మొత్తం 6,591 దరఖాస్తులను అధికారులు ఆమోదించారు. అలాగే ఇతర విభాగాలకు చెందిన పింఛన్ల కోసం 50, 467 దరఖాస్తులు అర్హత సాధించాయి. చేయూత పథకంలో భాగంగా అంగవైకల్యం కింద జిల్లాలోని అర్హులకు పింఛన్లు అందజేసేందుకు నెలకు మూడు కోట్ల 95 లక్షల 46 వేల రూపాయలు అవసరం కాగా, ఇతర విభాగాల వారికి పింఛన్లు మంజూరు చేసేందుకు నెలకు 20 కోట్ల 18 లక్షల 68 వేల రూపాయలు అవసరం అవుతాయని అంచనా.

Updated Date - Jun 23 , 2026 | 11:28 PM