ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Jan 28 , 2026 | 11:31 PM
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల కలెక్టరేట్, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. బుధవారం నస్పూర్‌లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ల తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించిన అనుభవంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. నామినేషన్‌ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించి అభ్యర్ధులనుంచి నామినేషన్లను స్వీకరించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల సమాచారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూమ్ నెంబర్ 08736-250501ను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, కలెక్టరేట్ పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం చెన్నూరు మున్సిపల్ పరిధిలోని కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెన్నూరు మున్సిపల్ పరిధిలోని 18 వార్డులకు సంబంధించి అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు స్వీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అభ్యర్ధుల నామినేషన్‌పత్రాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి నిర్ణీత సమయంలోగా స్వీకరించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి, డీఆర్‌డీవో కిషన్, మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.