నయా జోష్... 2026
ABN , Publish Date - Jan 01 , 2026 | 12:36 AM
కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా యువత కేరింతలతో హంగామా చేశారు.
- కొత్త సంవత్సరం.. కోటి ఆశలు
- జోరందుకున్న మద్యం, మాంసం విక్రయాలు
- కేక్‌లకు భలే గిరాకీ
- ఆనందోత్సవాల్లో మునిగి తేలిన యువత
- మార్కెట్‌లో న్యూ ఇయర్ సందడి
ఆసిఫాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా యువత కేరింతలతో హంగామా చేశారు. తమ ఆశలు ఫలించాలని, కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ న్యూ ఇయర్‌కు వెల్‌కమ్ చెప్పారు. ఈ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి పంటలు పండాలని రైతులు, వ్యాపారాలు వృద్ధి చెందాలని వ్యాపార వర్గాలు, వేతనాలు పెరగాలని ఉద్యోగులు, పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు, ప్రజల్లో తమ పలుకుబడి పెరగాలని రాజకీయ నాయకులు.. ఇలా ఎవరికి వారు తమ ఆశలు. ఆశయాలు నెవరేరాలని నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
2025కు వీడ్కోలు..
అనంత విశ్వంలో కాలచక్రపు పొత్తిళ్లోకి 2025 సంవత్సరం చేరిపోయింది. ఎన్నో తీపి చేదుగుర్తులను మనకు వదిలి మరలిపోయింది. ఆనందోత్సహాలను, నూతనోత్తేజాన్ని నింపి కొత్త అనుభూతుల్ని పంచేందుకు 2026 మన ముగింట నిలిచింది. గత చరిత్రతో కూడిన వర్తమాన అంశాల అనుభవాలు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపంలో అందించేందుకు నూతన సంవత్సరం వచ్చింది. ఈక్రమంలో డిసెంబరు 31ని చిరకాలం గుర్తుండి పోయే ఓ కమ్మని తీపిగుర్తుగా ఘనంగా జరుపుకోవడానికి పట్టణమంతా సిద్ధమైంది. వస్తువుల కొనుగోళ్లతో మార్కెట్‌లో సందడిగా కనిపించింది. రాత్రి 12 గంటల సమయంలో వేడుకలు జరుపుకోవడానికి యువతతో పాటు అన్నివర్గాల ప్రజలు సంసిద్ధులయ్యారు. కళాశాలలు, గురుకులాలు, వసతి గృహల్లో రాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేసుకున్నారు.
జోరుగా మాంసం, మద్యం విక్రయాలు..
వేడుక అంటేనే జోష్, ఎంజాయ్. మధ్యాహ్నం నుంచే మాంసం విక్రయాలు కొనసాగగా మద్యం షాపుల వద్ద సందడి కనిపించింది. పార్టీలు జరుపుకోవడానికి వేదికలను వెతుక్కున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు విభిన్న వంటకాలను తెప్పించుకొని రుచులు ఆస్వాధించారు.
వస్తువులు, కేకులకు భలే గిరాకీ..
జిల్లా అంతా పలు చోట్ల ఏర్పాట్లు చేసిన కేకుల దుకాణాలు, బేకరీల వద్ద యువత, విద్యార్థుల సందడి కనిపించింది. వస్త్ర నిలయాలు, వ్యాపార సంస్థల వద్ద మహిళలు తమకు నచ్చిన వస్త్రాలు, వస్తువులు, రంగురంగుల ముగ్గులను కొంటూ కనిపించారు. ద్విచక్రవాహనాలపై కుర్రకారు షికారు చేస్తూ హ్యపీ న్యూయర్ అంటూ అరుపులతో ఎంజాయ్ చేశారు. జనవరి 1కి స్వాగతం చెబుతూ తమ ఇళ్లలొగిళ్లను రంగులమయం చేసేందుకు రంగులను, టపాసులను కాల్చడానికి పలురకాల బాంబులు, తారాజువ్వలను కూడా కొనుగోలు చేశారు. దూర దేశాల్లో, పలు ప్రాంతాల్లో ఉన్న వారికి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పోలీసుల బందోబస్తు..
న్యూ ఇయర్ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ నితిక పంత్ ఆదేశాల మేరకు జిల్లాలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పోలీసు సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో సీఐలు, ఎస్సైలు ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.