ఇరుకు రోడ్లు.. వాహనాల రద్దీ
ABN , Publish Date - May 27 , 2026 | 11:26 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.
- అస్తవ్యస్తంగా ట్రాఫిక్
- రోడ్లపైనే తోపుడు బండ్లు
- పార్కింగ్‌కు స్థలాల కరువు
- రోడ్లపైనే వాహనాలు నిలిపివేత
- జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు
ఆసిఫాబాద్, మే 27(ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. చాలీచాలని రోడ్లతో ట్రాఫిక్ సమస్యకు దారితీస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న సమయంలోనే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రం అయ్యే సరికి ట్రాఫిక్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. జిల్లా కేంద్రంగా ఏర్పడినప్పటినుంచి వాహనాల తాకిడి పెరగడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. జిల్లా కేంద్రం ఏర్పడడంతో అటు జిల్లాస్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చి పోయే వారి వాహనాల తాకిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ఆటో స్టాండ్‌లకు అనువైన స్థలం లేకపోవడంతో రోడ్లపైనే ఆటో స్టాండ్‌లు ఏర్పాటు చేశారు. ఇరుకైన రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్‌పాత్ వ్యాపారం కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాదాచారులు సైతం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు జిల్లా కేంద్రంలోని రోడ్లపై తిరుగాలన్నా అటుగుండా ప్రయాణించాలన్నా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు ఉండడంతో పార్కింగ్ కోసం స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. రద్దీగా ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ పడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయడం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పోలిసు అధికారులు దృష్టి సారించి అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్‌లలో ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికి పరిస్థితిలో ఎలాంటి మార్పు చోటుచేసుకోవడం లేదు. పార్కింగ్ కోసం అనువైన స్థలాలను ఏర్పాటు చేస్తే తప్ప ఈ ట్రాఫిక్ సమస్య తీరదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధాన కూడళ్లలో..
జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లు అయిన అంబేద్కర్ చౌక్, వివేకానంద చౌక్, గాంధీ చౌక్‌లలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రధాన కూడళ్లలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండడం, వీటి సమీపంలోనే ఆర్టీసీ బస్టాండు, డిపో ఉండడంతో నిత్యం వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలతో ట్రాఫిక్ ఇబ్బందులు తీవ్రమయ్యాయి. గాంధీ చౌక్, వివేకానంద చౌక్‌లలో తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు రోడ్లపైనే తమ వ్యాపారాలు కొనసాగిస్తుండడంతో వాహనాలను రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్లు విస్తారంగా లేకపోవడం ఇరువైపులా వ్యాపార సముదాయాలు ఉండడంతో వినియోగదారులు వస్తువుల క్రయ విక్రయాల కోసం వచ్చినప్పుడల్లా ద్విచక్ర వాహనాలను, నాలుగు చక్రాల వాహనాలను రోడ్డుపైనే ఉంచి తమ పనులను కొనసాగించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో ఇతర వాహనాల రాకపోకలు తీవ్రఇబ్బందులు తలెత్తుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రతి శనివారం సంత జరుగుతుంది. ఆరోజు ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది.
రోడ్డుపైనే తోపుడు బండ్లు పెడుతున్నారు..
- ప్రణయ్, ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతున్నది. వాహనాల రద్దీ పెరగడంతో రోడ్లపై వాహనాలను నడపాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. ప్రధాన కూడళ్లలో రోడ్లపైనే తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పార్కింగ్‌తో పాటు ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అధికారులు దృష్టి సారించి రోడ్లపై తోపుడు బండ్లను తొలగించి పార్కింగ్ కోసం స్థలాలను ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలి.