పుర పోరు పిరం
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:51 PM
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులే ప్రధానం కానున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా లేదా అని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
- మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులే ప్రధానం
- ఆశావహుల్లో నెలకొన్న ఆందోళన
- అప్పుల కోసం వెతుకులాట
- నేడు నామినేషన్ల ఉపసంహరణ
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులే ప్రధానం కానున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా లేదా అని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పురపాలిక ఎన్నికలు పిరంగా మారాయి. జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లోని 50 వార్డులకు ఎన్నికలు జరుగుతుండగా.. డబ్బుల ప్రతిపాదికనే రాజకీయం నడుస్తోంది. కొన్నిచోట్ల ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులు, కార్యకర్తలు ఉన్నప్పట్టికీ సర్వేలో పనితీరు మెరుగ్గాలేదని పక్కకు పెడుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లు కలిసివచ్చినా కోరుకున్న వార్డుల్లో టికెట్ రాకపోవడంతో మరోచోట నుంచి పోటీకి దిగాల్సి వస్తోంది. దీంతో ఇన్నాళ్లు తాము కష్టపడిన చోట కాకుండా వేరేచోట పోటీచేస్తే ఓట్లు వస్తాయా, రావా అనే తర్జనభర్జన పడుతున్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పలు వార్డుల్లో ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు..
మున్సిపాలిటీల్లో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో బీఫాం కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. కొన్ని పార్టీలను అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించినా మరికొన్ని పార్టీలు ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేదు. బీఫాం ఇవ్వకపోయినా స్వతంత్రంగా అయిన పోటీ చేసేందుకు సైతం అభ్యర్థులు సన్నద్ధం అవుతున్నారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుండ డంతో పాటు ఎన్నికల గుర్తులు సైతం అభ్యర్థులకు కేటాయించనుంది. ఇక ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ఖర్చులకు సైతం ఎలా డబ్బులు కూడబెట్టాలో వాటి ప్రయత్నంలో ఉన్నారు. జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో ఒక్కో అభ్యర్థికి 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలంటే ప్రత్యర్థుల కంటే ఎక్కువ ఖర్చు పెట్టాలని అభ్యర్థులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఖర్చుల కోసం ఇప్పటికే పలువురు అభ్యర్థులు అప్పులు తీసుకురావడం, బంగారం బ్యాంకులో తాకట్టు పెట్టడం, భూములు, ప్లాట్లులు విక్రయించేందుకు వెనకడటంలేదని తెలుస్తోంది.
ఎంత మంది బరిలో ఉంటారో..
జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. ఇందులో ఆసిఫాబాద్ మున్సిపాలిటీ లో 20 వార్డులకు 166 మంది నామినేషన్లు దాఖలు చేయగా అందులో 120 మంది అభ్యర్థులు నామినేషన్లు అధికారులు ధ్రువీకరించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 39, బీఆర్‌ఎస్ నుంచి 24, బీజేపీ నుంచి 27, బీఎస్పీ నుంచి 4, సీపీఐ(ఎం) నుంచి 1, ఇతర పార్టీల నుంచి 11, స్వతంత్రులుగా 14 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డులకు 230 నామినేషన్లు దాఖలు కాగ అందులో 170 అభ్యర్థుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి 40, బీఆర్‌ఎస్ నుంచి 57, బీజేపీ నుంచి 35, బీఎస్పీ నుంచి 14, సీపీఐ(ఎం) నుంచి 2, ఎంఐఎం నుంచి 4, ఇతర పార్టీల నుంచి 6, స్వతంత్ర అభ్యర్థులు 12 నామినేషన్లు అధికారులు పరిశీలించి చెల్లుబాటు చేశారు. ఒకేవార్డు నుంచి ముగ్గురు నుంచి నలుగురు పోటీలో ఉండటంతో ఆయా వార్డుల్లో ఎన్నికలు నువ్వా నేనా అన్నట్లుగా మారాయి. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఉండటంతో ఎవరు నామినేషన్లను ఉపసంహరించుకుంటారో ఎంతమంది బరిలో ఉంటారో లెక్క తేలనుంది.