Share News

ఎన్‌హెచ్‌-63 పనుల్లో కదలిక

ABN , Publish Date - Jun 04 , 2026 | 10:53 PM

నిజామాబాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రహదారి విస్తరణ పనులకు నిధుల విడుదలకు ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పనులు పట్టాలెక్కనున్నాయి.

ఎన్‌హెచ్‌-63 పనుల్లో కదలిక
పోచంపహాడ్‌ వద్ద రహదారి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ (ఫైల్‌)

- వేగం పుంజుకోనున్న రహదారి పనులు

- నిధులు మంజూరుకు కేంద్రం ఆమోదం

- జగిత్యాల-మంచిర్యాల ఫోర్‌లేన్‌ పనులకు మోక్షం

- తీరనున్న కష్టాలు

మంచిర్యాల, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్తరణ పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. రహదారి విస్తరణ పనులకు నిధుల విడుదలకు ను కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పనులు పట్టాలెక్కనున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయ సూచన మేరకు రోడ్డు నిర్మాణానికి వీలుగా అటవీ, పర్యావరణ అనుమతులు మంజూరుకాగా, కేంద్రం నిధులు కేటాయించడంతో ఇంతకాలం పెండింగ్‌లో ఉన్న పనులకు మోక్షం లభించనుంది. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల, జగిత్యాల-కరీంనగర్‌ రహదారులు రెండింటికి కలిపి కేంద్రం రూ. 7,597 కోట్లకు ఆమోదం తెలిపింది. రహదారి విస్తరణ పనులకు సంబంధించి ఇప్పటికే మూడుసార్లు అలైన్‌మెంట్‌ను అధికారులు మార్చగా, తమ విలువైన భూములు కోల్పోతున్నామని ఆదినుంచి రైతులు తీవ్రంగా విభేదిస్తున్నారు. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట పనులకు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. అయితే పూర్తిగా గ్రీన్‌ ఫీల్డ్‌ నిర్మాణానికి అవకాశం లేకపోవడంతో బ్రౌన్‌ఫీల్డ్‌ కింద ప్రస్తుతం ఉన్న రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6 కిలీమీటర్ల పొడవున్న 63వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఎట్టకేలకు అనుమతులు లభించాయి. గతంలో ఉన్న రోడ్డును విస్తరించడంతోపాటు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని సేకరించాలని నేషనల్‌ హైవే అథారిటీని ఆదేశించింది. అధికారులు తయారు చేసిన అలైన్‌మెంట్‌ ప్రకారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని ఎన్‌హెచ్‌-44 నుంచి ప్రారంభమయ్యే రహదారి పలు గ్రామాల గుండా సాగుతూ జగిత్యాల జిల్లాలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి రాయపట్నం వద్ద గోదావరి వంతెన మీదుగా జిల్లాలోకి అడుగిడుతుంది. జిల్లాలో గూడెం మీదుగా లక్షెట్టిపేట నుంచి హాజీపూర్‌, ముల్కల్ల మీదుగా గాంధారి వనం వద్ద ఎన్‌హెచ్‌-363కి అనుసంధానం చేయనున్నారు. రహదారి నిర్మాణం పూర్తయితే ఇంతకాలం కష్టాలు పడుతున్న ప్రయాణికుల ఇబ్బందులు తొలగుతాయి.

రైతుల అభ్యంతరంతో....

ఎన్‌హెచ్‌-63 కోసం అధికారులు మూడు దఫాలుగా రూట్‌ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్‌మెంట్‌ ప్రకారం కొందరు బడా బాబులకు నష్టం వాటిళ్లుతండటంతో వారి ఒత్తిడికి తలొగ్గి రెండో రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేశారు. అది లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుంది. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి తీరని నష్టం కలిగేలా ఉంది. అష్టకష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేతకు గురవుతుండటంతో ఆయా గ్రామాల ప్రజలు సర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పలురకాల ఆందోళనలు నిర్వహించారు. దీనికి స్పందించిన ఎన్‌హెచ్‌ అధికారులు మూడో రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో జీవనాధారామైన సాగు భూములను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్‌మెంట్‌ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదుగా గోదావరి నదికి సమాంతరంగా పంట పొలాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందిన భూములు పెద్దఎత్తున శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గరయ్యాయి. మిగిలిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదారి నిర్మాణం కోసం తమ భూములు సేకరిస్తుండటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుతం కేసు పెండింగ్‌లో ఉంది.

ప్రారంభం కానున్న పనులు....

ఎన్‌హెచ్‌-63 పనులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో త్వరలో రహదారి విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్మూర్‌-జగిత్యాల-మంచిర్యాల రహదారిని హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌లో విస్తరించేందుకు మార్గం సుగమం అయింది. ఇదిలాఉండగా తమ సమస్యలు పరిష్కరించిన తరువాతనే రహదారి నిర్మాణ పనులు చేపట్టాలనే డిమాండ్‌లు సంబంధిత రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ తమకు నష్టం కలిగించే విధంగా విస్తరణ పనులు చేపడితే అడ్డుకునేందుకు సైతం వెనకాడవద్దనే నిర్ణయానికి బాధిత రైతులు వచ్చినట్లు తెలుస్తోంది. కేంద్రం నిర్ణయించిన మేరకు రహదారి విస్తరణ ఎంత ముఖ్యమో....దాని కింద భూములు కోల్పోతున్న సామాన్య ప్రజలు, రైతుల డిమాండ్లను కూడా పరిగణలోకి తీసుకోవాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.

Updated Date - Jun 04 , 2026 | 10:53 PM