Share News

Mancheriala: నాడు కళకళ.. నేడు వెలవెల!

ABN , Publish Date - Apr 25 , 2026 | 11:55 PM

మంచిర్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో ఒకప్పుడు కళకళలాడిన సూపర్‌బజార్లు.. నేడు నిర్వహణ లోపంతో వెలబెలబోతున్నాయి.

Mancheriala:   నాడు కళకళ.. నేడు వెలవెల!

-బోసిపోతున్న సింగరేణి సూపర్‌బజార్లు

-సరుకులు లేక ఖాళీగా దర్శనమిస్తున్న వైనం

-ఒక్కొక్కటిగా మూతపడుతున్న స్టోర్స్‌

-మ్యాన్‌పవర్‌ లేదంటున్న సింగరేణి అధికారులు

-సబ్సిడీ సరుకులు పునరుద్దరించాలని కార్మికుల డిమాండ్‌

మంచిర్యాల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మిక కుటుంబాలకు అవసరమైన నిత్యావసర సరుకులతో ఒకప్పుడు కళకళలాడిన సూపర్‌బజార్లు.. నేడు నిర్వహణ లోపంతో వెలబెలబోతున్నాయి. సరుకులు లేక స్టోర్లు ఖాళీగా దర్శనమిస్తుండగా, అరకొర సామగ్రి కొనుగోలు చేయలేక కార్మిక కుటుంబాలు వెనుదిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మిక కుటుంబాలకు నిత్యావసర సరుకులను సబ్సిడీకి అందించేందుకు యాజమాన్యం సూపర్‌బజార్లను నెలకొల్పింది. సింగరేణి కోఆపరేటివ్‌ సొసైటీలతో ఆయా షాప్‌లను నిర్వహించేది. సూపర్‌బజార్లపై పర్యవేక్షణకు కంపెనీ మేనేజర్‌తోపాటు డివిజన్ల వారీగా ప్రాజెక్టు మేనేజర్లు సైతం విధుల్లో ఉండేవారు. ఒకసారి సూపర్‌ బజార్‌కు వెళితే నెలకు సరిపడా గ్రాసం కార్మిక కుటుంబాలు పొందేవారు. అదికూడా బయట సూపర్‌మార్కెట్లతో పోల్చితే అతి తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు లభించేవి. పైగా సామాగ్రి కొనుగోలు చేసిన కార్మిక కుటుంబం అప్పటికప్పుడు బిల్లు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండేదికాదు. మరుసటి నెల వేతనంలోనే సూపర్‌బజార్‌ బిల్లును మినహాయించుకునేవారు. అలా చేతిలో నగదు లేకపోయినప్పటికీ నెలకు సరిపడా సరుకులు కార్మిక కుటుంబాలకు అందేవి. మ్యాన్‌పవర్‌ లేదనే సాకుతో సింగరేణి కోఆపరేటివ్‌ సొసైటీలు సూపర్‌ బజార్లను మూసివేస్తుండగా, యాజమాన్యం పట్టించుకోకపోవడం పట్ల కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగ్గుముఖం పడుతున్న కార్మికుల సంఖ్య..

కాలక్రమంలో సింగరేణిలో కార్మికుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఒకప్పుడు లక్ష మందికి పైగా ఉన్న కార్మికుల సంఖ్య నేడు 40వేలకు చేరింది. కార్మికుల సంఖ్య తగ్గుతున్నట్లుగానే సింగరేణి సూపర్‌బజార్‌లు కూడా క్రమంగా మూసివేతకు గురవుతున్నాయి. ఒకప్పుడు ప్రతి డివిజన్‌కు నాలుగైదు సూపర్‌ బజార్లు ఉండగా, ప్రస్తుతం వాటిసంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం ఒక్కో ఏరియాకు ఒక్కస్టోర్‌ కూడా కానరాకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్‌, బెల్లంపల్లి, మందమర్రి డివిజన్‌లకు సంబంధించి ప్రస్తుతం మందమర్రితోపాటు జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌(ఎస్టీపీపీ)లో మాత్రమే రెండుసూపర్‌బజార్లు మిగిలాయి. వాటిలో కూడా అరకొర సరుకులతో కాలం నెట్టుకు వస్తున్నారు. ఒకప్పుడు సింగరేణి ఏరియాలోని శ్రీరాంపూర్‌, రామకృష్ణాపూర్‌, బెల్లంపల్లిలో అన్ని వసతులతో కూడిన సూపర్‌ బజార్లు ఉండేవి. కార్మిక కుటుంబాలతో అవి నిత్యం కలకలలాడేవి. నేటి డీ మార్ట్‌, రిలయన్స్‌, విజేతలాంటి అధునాతన సూపర్‌ మార్కెట్లకు ధీటుగా అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సూపర్‌బజార్‌లను ప్రైవేటు పరం చేస్తుండటంతో నిర్వహణ లోపం కారణంగా కాలక్రమేణ అవి మూసివేతకు గురవుతున్నాయి. అకడక్కడ తెరిచి ఉన్నవి కూడా త్వరలో మూసివేతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా సింగరేణి సూపర్‌బజార్‌ల నిర్వహణ సొసైటీలకు నిర్ణీత కాలంలో ఎన్నికలు నిర్వహించి, కొత్త కమిటీలను ఎన్నుకోవలసి ఉంది. అధికారులు ఆ ఊసే ఎత్తకపోవడంతో సూపర్‌బజార్‌ల నిర్వహణపట్ల నీలినీడలు అలుముకున్నాయి. కేవలం నిత్యావసర సరుకులే కాకుండా, హోంనీడ్స్‌ అయిన ఫ్రిజ్‌లు, మిక్చర్‌ గ్రైండర్లు, టీవీలు తదితర నాణ్యమైన వస్తువులు కూడా సూపర్‌బజార్‌లలో వాయిదాల పద్ధతిలో లభించేవి. కార్మికులకు అవసరమైన గృహోపకరణ సామాగ్రి అంతా ఒకేచోట లభించడంతో ఇబ్బందులు ఉండేవి కావు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం సూపర్‌బజార్‌ల నిర్వహణపై ధృష్టి సారించడం ద్వారా సబ్సిడీ సరుకులు పునరుద్దరించడంతోపాటు కార్మిక కుటుం బాల ఇబ్బందులు తొలగించాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

సూపర్‌ బజార్‌లపైనే ఆధారపడే వాళ్లం..

గూడూరి యాదిరెడ్డి, రిటైర్డ్‌ కార్మికుడు

మేము సింగరేణిలో ఉద్యోగం చేసే సమయంలో ఏరియా సూపర్‌ బజార్‌లు ఎంతగానో ఉపయోగపడేవి. చేతిలో నగదు లేకపోయినా, మరుసటి నెల వేత నంలో బిల్లు మినహాయించే పద్ధతి ఉండటంతో సరుకులకు ఇబ్బందులు ఉండేది కాదు. కాలక్రమేణా సూపర్‌బజార్‌లు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ప్రస్తుతం అరకొర సరుకులు మాత్రమే అందుబాటులో ఉండటం వల్ల కార్మిక కుటుంబాలు ప్రైవేటు సూపర్‌మార్కెట్లపై ఆధారపడాల్సి వస్తోంది. సింగరేణి అధికారులు సూపర్‌బజార్‌ల పునరుద్దరణపై దృష్టిసారిస్తే బాగుంటుంది.

Updated Date - Apr 25 , 2026 | 11:55 PM