Mancheriala: అదను చూసి కబ్జా
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:52 PM
మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా స్థలానికి రెక్కలు వచ్చాయి.
- రూ.10కోట్ల విలువైన స్థలానికి రెక్కలు
- పాఠశాల కోసం కేటాయించిన స్థలం అన్యాక్రాంతం
- హైటెక్‌సిటీ లే అవుట్ వెంచర్‌లోని ఎకరా స్థలంపై కన్ను
- గుట్టు చప్పుడు కాకుండా స్థలం చుట్టూ బౌండరీ ఏర్పాటు
- ఆక్రమించరాదని బోర్డు ఏర్పాటు చేసినా పట్టని అక్రమార్కులు
మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా స్థలానికి రెక్కలు వచ్చాయి. కోట్ల విలువైన స్థలంపై కన్నేసిన కబ్జాకోరులు గుట్టు చప్పుడు కాకుండా దాని చుట్టూ ఐరన్ షీట్లతో బౌండరీ ఏర్పాటు చేసి, తాళం వేశారు. స్థలం విలువ ప్రస్తుతం రూ.10 కోట్ల వరకు ఖరీదు చేస్తుండగా, హైటెక్‌సిటీ వెంచర్ ఏర్పాటు సమయంలో నిర్వాహకులు సదరు స్థలాన్ని మునిసిపాలిటీకి కేటాయించారు. స్థలాన్ని కాపాడాల్సిన మునిసిపాలిటీ దానికి రక్షణ కల్పించకపోవడంతో ఆక్రమార్కుల చేతుల్లోకి వెళ్లింది. ఖాళీగా ఉన్న స్థలాన్ని చేజి క్కించుకునేందుకు ఫెన్సింగ్ వేసే పేరుతో గతేడాది కూడా ప్రయత్నాలు చేయడంతో 2025 సెప్టెంబర్ 13న ‘కబ్జానా...రక్షణ చర్యలా..?’ శీర్షికన ’ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీంతో అక్ర మార్కులు పలాయనం చిత్తగించగా, స్పందించిన మున్సిపల్ అధికారులు.. సదరు స్థలం కాలనీ డెవలపర్స్ పాఠశాల ఏర్పాటు కోసం మున్సిపాలిటీకి కేటాయించారని, అందులో స్కూల్ బిల్డింగ్ మినహా, ఇతరత్రా నిర్మాణాలు చేపడితే మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. అనంతరం స్థలం రక్షణ గాలికి వదిలివేయడంతో కబ్జాకోరులు తాజాగా చుట్టూ బౌండరీ ఏర్పాటు చేశారు.
ఫ ఖరీదైన స్థలం కావడంతో..
2006లో హైటెక్‌సిటీ వెంచర్ ఏర్పాటు సమయంలో లే అవుట్ నిబంధనల మేరకు డెవలపర్స్ ఎకరం స్థలాన్ని స్కూల్ బిల్డింగ్ కోసం కేటాయించారు. సర్వేనంబర్లు 366,367,368,371నుంచి 392, 397, 399, 405లో మొత్తం 68.95 ఎకరాల భూమికి లేఅవుట్ అనుమతులు పొందారు. ఇందులో పైన పేర్కొన్న ఎకరాన్ని ప్రత్యేకంగా పాఠశాలకు కేటాయించారు. హైటెక్‌సిటీ నగర నడిబొడ్డున ఉండటం, కాలక్రమేణ కాలనీకి ప్రాధాన్యత పెరగడంతో అక్కడి ప్లాట్ల ధరలకు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హైటెక్‌సిటీలో ఎక్కడ చూసినా చదరపు గజం కనీసం రూ.50వేల పైచిలుకు ధర పలుకుతోంది. హైటెక్‌సిటీలో నిర్మించిన హరిహర క్షేత్రం దేవాలయం వెనకాల ఉన్న ఎకరం స్థలాన్ని పాఠశాలకు కేటాయించినట్లు లే అవుట్ ప్లాన్‌లోనూ పొందుపరిచారు. కాలనీ భూముల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో పాఠశాల స్థలంపై అక్రమార్కుల కళ్లు పడుతున్నాయి. గతంలోనూ ఇదేస్థలాన్ని అక్రమంగా కబ్జాచేసిన కొందరు అందులోప్లాట్లు ఏర్పాటు చేస్తూ హద్దురాళ్లు సైతం పాతారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు హద్దు రాళ్లను తొలగించి, స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. గతేడాది గుర్తు తెలియని వ్యక్తులు స్థలం చుట్టూ పాతఫెన్సింగ్ ఉండగానే, కొత్తగా సిమెంట్ స్తంభాలు పాతి రేకులు ఏర్పాటు చేసేందుకు యత్నించారు. స్థలంలో పెరిగిన మొక్కలను సైతం తొలగించారు. స్థలం వద్ద బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్న అధికారులు, దానికి రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం కావడంతోనే అక్రమార్కులు ఏకంగా బౌండరీ ఏర్పాటు చేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
ఫ నిబంధనలు ఇలా..
మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల్లో లే అవుట్ వెంచర్లు ఏర్పాటు చేసే రియల్టర్లు పలు నిబంధ నలను అమలు పరచాల్సి ఉంటుంది. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం-2019, పంచాయతీ చట్టం- 2018 ప్రకారం మొత్తంలో లే అవుట్ స్థలం నుంచి 10శాతం గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు మరో 30శాతం ప్రజల అవసరాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఆ 30 శాతంలో మంచినీటి ట్యాంకులు, పాఠశాల, గుడి, తదితర ప్రజోపకర పనులు మాత్రమే చేపట్టవలసి ఉంది. అందుకు భిన్నంగా హైటెక్‌సిటీలో స్కూల్ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఇతరులు అక్రమంగా బౌండరీ ఏర్పాటు చేసి, కబ్జా చేయడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దాదాపు 20 సంవ్సరాలపాటు స్థలం ఖాళీగా ఉండటంతో సహజంగానే దానిపై ఇతరుల కళ్లు పడుతున్నాయన్న అభిప్రాయాలను కాలనీవాసులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్థలం చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేసి, కబ్జాలకు గురికాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
ఫ వెల్ఫేర్ అసోసియేషన్ లేకపోవడంతోనే..
గతంలో ఉన్న హైటెక్‌సిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రద్దు కావడంతో ప్రశ్నించే వారులేక పాఠశాల స్థలాన్ని ప్రైవేటువ్యక్తులు ఆక్రమించేయత్నం చేస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కొందరు స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించగా, అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేసి కాపాడుకున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు. ఇప్పటికైనా కాలనీ అసోసియేషన్‌ను గతంలో మాదిరిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
ఫ ఇతర నిర్మాణాలు చేపట్టరాదు..
- అన్వేష్, మున్సిపల్ కమిషనర్
మున్సిపాలిటీల చట్టం-2019 ప్రకారం పాఠశాలకు కేటాయించిన స్థలంలో ఇతర నిర్మాణాలు చేపట్టడం చట్టవిరుద్ధం. సదరు స్థలంలో కేవలం పాఠశాల భవనం నిర్మాణం మాత్రమే చేపట్టవలసి ఉంటుంది. ప్రైవేటువ్యక్తులు స్థలం చుట్టూ బౌండరీలు ఏర్పాటు చేసినందున తొలగించాలని తక్షణమే నోటీసులు జారీచేస్తాం. స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోక తప్పదు.