Share News

Mancherial: రికవరీ చేస్తారా.. వదిలి పెడతారా?

ABN , Publish Date - Aug 24 , 2026 | 11:53 PM

మంచిర్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ధి చేకూర్చి, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో

Mancherial: రికవరీ చేస్తారా.. వదిలి పెడతారా?

- ‘రైతుబీమా’ నగదు రికవరీలో సాగదీత

- సంవత్సరాలు గడుస్తున్నా ముందుకు సాగని ప్రక్రియ

- నోటీసులు జారీచేసి మిన్నకున్న అధికారులు

- ఆపై చర్యలు తీసుకోవడంలో అంతులేని జాప్యం

మంచిర్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): అర్హత లేకపోయినా అక్రమార్కులకు రైతుబీమా పథకం కింద లబ్ధి చేకూర్చి, ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారు. బాధ్యులపై పోలీసులు కేసులు నమోదు చేయగా, ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే అక్రమంగా లబ్ధిపొందిన వారి నుంచి రెవెన్యూ రికవరీ యాక్టు కింద డబ్బులు తిరిగి సేకరించాల్సి ఉన్నా.. సంబంధిత అధికారులు ఆ ఊసే ఎత్తడం లేదు.

రైతుల సంక్షేమం కోసం అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘రైతుబీమా’ పథకంలో నెలకొన్న అవినీతి, అక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ‘రైతుబీమా పక్కదారి’ శీర్షికన 2021జూలై 2న ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంపై స్పందించిన అప్పటి జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి మంచిర్యాల ఆర్డీవో దాసరి వేణును విచారణాధికారిగా నియమించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో అదేరోజు దండేపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. బోగస్‌పత్రాలు సృష్టించి పథకానికి దరఖాస్తు చేశారని తేలడంతో 13-07-2021న విచారణ అధికారి మండల తహసీల్దార్‌కు రెవెన్యూ రికవరీచట్టం 1864ప్రకారం సొమ్ము రికవరీ చేయాలని ఆదేశాలు జారీచేశారు. అయితే ఐదు సంవత్సరాలు గడుస్తున్నా సొమ్ము రికవరీకి నోచుకోవడం లేదు.

అక్రమం జరిగిందిలా...

రైతుబీమా పథకంలో చేరేందుకు 18ఏళ్ల నుంచి 59సంవత్సరాల వయస్సుగల రైతులు అర్హులు. అయితే దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన ఇద్దరు వ్యక్తుల పేరిట వయస్సు తగ్గించి పథకానికి దరఖాస్తు చేశారు. గ్రామానికి చెందిన గోపతి రాజయ్యకు 75ఏళ్లు కాగా, బత్తుల రాజలింగయ్యకు 80ఏళ్లు ఉన్నప్పటికీ బోగస్‌ ఆధార్‌ కార్డులు సృష్టించి, వయస్సు తక్కువ చూపుతూ పథకంలో లబ్ధిపొందారు. ఇదిలా ఉండగా పై ఇద్దరు వ్యక్తులు వృద్ధాప్య పింఛన్లు కూడా పొందుతున్నారు. వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే అప్పటి నిబంధనల ప్రకారం 59సంవత్సరాలు పైబడి ఉండాలి. ఇందుకోసం ఒరిజినల్‌ ఆధార్‌కార్డులతో దరఖాస్తు చేసుకోగా, ఇరువురి పేరిట పింఛన్లు మంజూరయ్యాయి. ఇలా అక్రమంగా రెండు పథకాలలో లబ్ధి పొందుతున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ఈ తతంగమంతా నడిపించిన మధ్య దళారులతో కుమ్మక్కయిన అప్పటి వ్యవసాయశాఖ అధికారులు.. అర్హత లేకపోయినా ఆ ఇద్దరు రైతులకు రైతుబీమా పథకం వర్తింపజేశారు. రాజలింగయ్య 2019మే 5న, రాజయ్య 2020ఆగస్టు 28న చనిపోయారు. దీంతో బీమా సొమ్ము వారి నామినీల పేరిట చెరో రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలు బ్యాంకు అకౌంట్లలో జమ అయింది. అయితే అక్రమంగా పొందిన బీమా సొమ్మును లబ్ధిదారుల నామినీల నుంచి రికవరీ చేయాలని కలెక్టర్‌ పోలీసులను సైతం ఆదేశించారు.

నోటీసులకే పరిమితం..

ఆర్డీవో ఆదేశాలతో సొమ్ము రికవరీ కోసం అధికారులు బాధ్యులకు నోటీసులు జారీ చేశారు. రైతు బీమాలో అక్రమంగా సొమ్ము కాజేసిన బత్తుల రాజలింగయ్య, గోపతి రాజయ్యకు నామినీలుగా ఉన్న బత్తుల రాజేశ్వరి, గోపతి నారాయణ నుంచి అక్రమంగా లబ్ధి పొందిన సొమ్ము రూ.5లక్షల చొప్పున మొత్తం రూ.10లక్షలు రికవరీ చేయాలని ఆర్డీవో ఆదేశాలతో దండేపల్లి తహసీల్దార్‌ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు లబ్ధిదారుల కుటుంబీకులు స్పందించకపోవడంతో వారికి చెందిన భూములను స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా అదే నెలలో నామినీలు ఇద్దరికీ అప్పటి తహసీల్దార్‌ హన్మంతరావు సెక్షన్‌-7 కింద డిమాండ్‌ నోటీసులు జారీచేశారు. కొర్విచెల్మలోని గోపతి నారాయణకు సంబంధించిన భూముల సర్వేనంబర్లు 35/6ఏలో 1.1ఎకరాలు, 52/6/1లో 1.2ఎకరాలు, 236/5/1లోని 0.22 ఎకరాల భూములతోపాటు ముత్యంపేటలోని బత్తుల రాజేశ్వరికి సంబంధించిన సర్వే నంబర్లు 5/అ లో 0.4 ఎకరాలు, 39/అ లో 0.1ఎకరాలు, 39/ఆ లో 0.32ఎకరాలను జప్తు చేస్తున్నట్లు నోటీసులు జారీఅయ్యాయి. అక్రమంగా రైతుబీమా సొమ్ము పొందినందున తక్షణమే నామినీలు ఇద్దరు చెరో రూ.5లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలని, లేనియెడల పైన పేర్కొన్న భూములను బహిరంగవేలం ద్వారా విక్రయించి, సొమ్మును ప్రభుత్వ ఖజానాలో జమచేయనున్నట్లు తహసీల్దార్‌ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సంవత్సరాలు గడిచినా సొమ్ము రికవరీ చేయకపోగా, కేవలం నోటీసుల జారీకే పరిమితం కావడం గమనార్హం.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు..

రైతుబీమా పక్కదారి సంఘటనలో నిందితులపై దండేపల్లి పోలీసులు కేసులు నమోదు చేశారు. సంఘటనపై విచారణ జరిపిన మంచిర్యాల ఆర్డీవో ఆదేశాలతో వ్యవసాయశాఖ అప్పటి ఏఈవో సాయికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ మార్గంలో రైతుబీమా పొందిన మృతులకు నామినీగా ఉన్న బత్తుల రాజేశ్వరి, ఆమె భర్త తిరుపతి, గోపతి నారాయణ మధ్యవర్తిత్వం నెరిపిన ముత్యంపేట ఎంపీటీసీ ముత్తె రాజయ్యపై ఐపీసీ417,420,34 సెక్షన్ల కింద ఎస్సై శ్రీకాంత్‌ కేసు నమోదు చేశారు. ఈ విషయమై మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన కొండ నరేష్‌ అదే నెలలో రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయించాడు. రైతుబీమా అక్రమాల విషయంలో రాజకీయంగా ప్రమేయం ఉన్నందున కేసు నీరుగారిపోకుండా ఉండే ఉద్దేశ్యంతో ఆయన హెచ్‌ఆర్‌ సీలో ఫిర్యాదు చేశారు.

రికవరీ ఉత్తిమాటేనా?

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుబీమా స్థానంలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకాన్ని తెరపైకి తెచ్చింది. రైతుబీమా పథకం ఈనెల14న రెన్యువల్‌ కావల్సి ఉండగా, కొత్త పథకం తెచ్చే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రీమియం చెల్లింపులు నిలిపివేసింది. కొత్త పథకంలో భాగంగా రైతులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతికుటుంబానికి బీమాసౌకర్యం కల్పించాలని భావిస్తుండగా, ఈ క్రమంలోనే సరికొత్త బీమాపథకాన్ని అమలు చేస్తామని గతఅసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో ప్రకటించింది. ఇందులో భాగంగా 2026-27వార్షిక బడ్జెట్‌లో రూ.4వేలకోట్ల నిధులు కూడా కేటా యించింది. ఈ ఏడాది జూన్‌ రెండో తేదీ నుంచి ‘ఇందిరమ్మ జీవిత బీమా’ అమలు కావలసి ఉండగా, అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయమై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ నవంబర్‌ 19న ఇందిరాగాంధీ జయంత్రి సందర్భంగా కొత్త పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. దీంతో రైతుబీమా పథకం నిలిచిపోయినట్లేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో దండేపల్లి మండలంలో రైతుబీమా పథకంలో జరిగిన అవకతవకలలో పక్కదారి పట్టిన సొమ్ము బాధ్యులనుంచి రికవరీ చేస్తారా? వదిలిపెడతారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా అక్రమ మార్గంలో ప్రభుత్వ సొమ్ము కాజేసినందున రికవరీ చేయడం ద్వారా మరోమారు ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చర్యలుచేపట్టాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 24 , 2026 | 11:53 PM