Mancherial: శ్రావణపల్లి బొగ్గుబ్లాక్.. సింగరేణికి దక్కేనా?
ABN , Publish Date - Sep 19 , 2026 | 12:09 AM
మంచిర్యాల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది.
- వేలంపాటను ప్రారంభించిన కేంద్రప్రభుత్వం
- ఇప్పటికే సర్వే నిర్వహించిన సింగరేణి అధికారులు
- తాడిచర్ల బ్లాక్ కేటాయింపుతో చిగురిస్తున్న ఆశలు
మంచిర్యాల, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. కేంద్రప్రభుత్వం శ్రావణపల్లి బొగ్గుబ్లాక్‌ను వేలంలో పెట్టడంతో అది సింగరేణికి దక్కు తుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది. తన క్యాప్టివ్ అవసరాలకోసం వేలం పాటలో పాల్గొనడం ద్వారా తెలంగాణలోని రెండు కోల్‌బ్లాక్‌లను దక్కించుకోవాలని తెలంగాణ జెన్‌కో కూడా ప్రయత్నాలు చేస్తుండటంతో సింగరేణి వేలం బరిలో నిలుస్తుందా?. అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. తెలంగాణలోని సింగరేణి కోల్‌బెల్ట్‌లోని అపార బొగ్గునిల్వలు కలిగిన శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్-3లకు కేంద్రప్రభుత్వం 16వ విడుత వేలంపాటను ఈనెల17న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వేలంపాటలో మణుగూరు పీకేఓసీ-2 డీప్‌సైడ్‌ను సింగరేణి దక్కించు కోగా, శ్రావణపల్లి, కోయగూడెం బ్లాక్‌లను సైతం దక్కించుకొనేందుకు సింగరేణి కూడా రంగంలోకి దిగే అవకాశాలు అనేకం ఉన్నాయి. దీంతో సింగరేణిలోని రెండుబ్లాక్‌ల కోసం జెన్‌కో టెండర్లు వేస్తుందా...? లేక ఇతరరాష్ట్రాల్లోని బ్లాకుల కోసం ప్రయత్నిస్తుందా?. అన్న సందేహాలు వ్యక్తమ వుతున్నాయి.
చిగురిస్తున్న ఆశలు!
తెలంగాణలోని తాడిచర్ల-2 బొగ్గుబ్లాక్‌ను కేంద్రప్రభుత్వం సింగరేణికి కేటాయించడంతో శ్రావణపల్లి గనిపై కూడా ఆశలు చిగురిస్తున్నాయి. జూలై14వ తేదీన సింగరేణి భరోసా యాత్రలో భాగంగా కేంధ్ర గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి మంచిర్యాలలో పర్యటించిన సందర్భంగా బొగ్గు గనులపై మాట్లాడుతూ సింగరేణిని కాపాడేందుకు బీజేపీ అవసరమైన చర్యలు చేపడుతుందన్న హామీ ఇచ్చారు. మరోవైపు తాడిచర్ల బ్లాక్ మాదిరిగానే మరో గని గురించి త్వరలో గుడ్ న్యూస్ చెప్తానన్న వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. కేంద్రమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో శ్రావణపల్లి బ్లాక్‌ను కూడా సింగరేణికే కేటాయిస్తారన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సింగరేణికి.. కార్పొరేట్ సంస్థల నుంచి పోటీ..
ఇదిలా ఉండగా శ్రావణపల్లి బ్లాకును దక్కించుకొనేందుకు పలు కార్పోరేట్ సంస్థలు పోటీ పడుతుండగా, కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుగొన్న తామే ఆ బ్లాక్‌ను కైవసం చేసుకోవాలని సింగరేణి పట్టుదలతో ఉంది. శ్రావణపల్లి చేజారితే భవిష్యత్తులో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగి సంస్థ మనుగడకే ముప్పు వాటిల్లుతుందని భావిస్తున్న సింగరేణి దాన్ని దక్కించుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అయితే నేరుగా బ్లాక్ కేటాయించడం కుదరదని, వేలంలో ప్రైవేటు కంపెనీలతో పోటీపడి కైవసం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. శ్రావణపల్లిలో బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు మూడు దశాబ్దాల నుంచే సింగరేణి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి అనేకమార్లు సర్వేలు సైతం చేసింది. శ్రావణపల్లి ఓసీపీ ఏర్పాటు చేస్తే సుమారు మూడు వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రజల అభ్యంతరంతో నిలిచిన పనులు..
శ్రావణపల్లి ఓపెన్‌కాస్టు ప్రాజెక్టు బొగ్గు తవ్వకాలతో నెన్నెల మండలంలోని 350గిరిజన కుటుంబాలు ఉన్న శ్రావణపల్లి ముంపునకు గురవుతుండగా జెండా వెంకటాపూర్, నార్వాయిపేట, జోగాపూర్, మందమర్రి మండలంలోని మామిడిగట్టు, సారంగపల్లి గ్రామాలపై తీవ్రప్రభావం పడనుంది. ఆయాగ్రామాల పరిధిలో సుమారు 14వేల ఎకరాల మామిడి తోటలు, ఆరువేల ఎకరాల వరిపొలాలు ఓసీపీవల్ల కనుమరుగవుతాయని అంచనా. అలాగే సుమారు 500ఎకరాల ఆయకట్టుకు నీరందించే చెరువులు, కుంటలు కూడా ఓసీపీ వల్ల కాలగర్భంలో కలిసే అవకాశాలు ఉండటంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2005లో గ్రామానికి వచ్చిన సింగరేణి అధికారులపై ప్రజలు దాడిచేశారు. మరోసారి సర్వేకు వచ్చిన రెవెన్యూ, ఇంజనీరింగ్ అఽధికారులను దినమంతా గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో అధికారులు వెనుకడుగు వేశారు. ప్రస్తుతం బొగ్గుబ్లాక్‌ను కేంద్రం వేలంలో పెట్టడంతో ప్రజలు ఎలా స్పందిస్తారోనన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.