Share News

Mancherial: వరి సాగయ్యేనా?

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:35 PM

తాండూర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వరిసాగుపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. జూన్‌ నెలలో వర్షాలు లేక రైతన్నలకు నిరాశే మిగిలింది.

 Mancherial:  వరి సాగయ్యేనా?

- ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో కురవని వర్షం

- జూలై నెలపైనే అన్నదాతల ఆశలు

- వరి నారు మడులపై సందిగ్ధంలో రైతులు

తాండూర్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): వరిసాగుపై రైతులు సందిగ్ధంలో ఉన్నారు. జూన్‌ నెలలో వర్షాలు లేక రైతన్నలకు నిరాశే మిగిలింది. కొందరు రైతులు పత్తిగింజలు వేసినా సరిగ్గా మొలకెత్తకుండా నష్టం వాటిల్లింది. కొద్దిపాటి వర్షాలు కురవడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ సరైన మోతాదులో వర్షాలు లేక ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కనీసం 50శాతం విత్తనాలు వేయడం కూడా పూర్తి కావాల్సింది. కానీ వర్షం కురవకనే పనులు ముందుకు సాగడం లేదని రైతులు పేర్కొంటున్నారు. మరో పక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవవని ప్రభుత్వం పేర్కొంటుండడంతో ఎం చేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. కొందరు రైతులు జూన్‌ నెల గడిచిపోయినా ఇప్పటి వరకు నారు మడులు వేయలేదు. వేదామా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. మండలంలో ఇప్పటి వరకు 20నుంచి 60శాతం వర్షపాతమే నమోదైంది. రైతులు పత్తి విత్తనాలు మినహా ఇతర పంటలు వేసుకోలేదు.

వరి సాగుపై సందిగ్ధం..

ఇప్పటివరకు రైతులు పత్తి, ఇతర విత్తనాలు వేశారు. జూలై మొదటి వారం వరకు పత్తి విత్తుకోవడం పూర్తి అయ్యింది. ప్రస్తుతం వరినాట్లు వేసుకోవడం ఎక్కువ ఉంటుంది. దీర్ఘకాలిక వరి రకం ఈనెల మొదటి వారం వరకు పూర్తి కావాల్సి ఉంటుంది చెరువుల్లో నీరు చేరకపోవడంతో సుమారు 80నుంచి 90శాతం మంది రైతులు ఇంకా నారుమడి వేయలేదు. బోరున్న రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకున్నారు. మిగితా రైతులు ఈ నెలలో కురిసే వర్షాలపైన ఆధారపడ్డారు. ఈ నెలలో వర్షాలు లేకపోతే వరిసాగు కష్టమేనని రైతులు వాపోతున్నారు. బోర్ల కింద వరిపంట వేయాలన్నా ఆచితూచి అడుగువేస్తున్నారు. బోర్లు ఉన్న రైతులు ఇప్పుడు వరిపంట వేస్తే చుట్టుపక్కల రైతులకు దారి కష్టాలు నెలకొంటాయి. మొదటి వేసిన పొలం తొందరగా రాగా తర్వాత వేసిన పొలాలకు వరికోత సమయంలో హార్వెస్టర్‌ వెళ్లాలంటే ఇబ్బందిగా మారుతుంది.

- వరి వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం..

- ప్రేమ్‌కుమార్‌, రైతు, గంపలపల్లి

నేను ప్రతి సంవత్సరం వర్షాల మీద ఆధారపడి వరి సాగు చేస్తున్నాం. రెండు సంవత్సరాల నుంచి వానలు ఎక్కువ పడడం, ఎరువుల రేట్లు పెరగడంతో నష్టపోయాం. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పొలాలు సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నాం. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో వర్షం పడలేదు.

Updated Date - Jul 08 , 2026 | 11:35 PM