Mancherial: అక్రమ వసూళ్లపై చర్యలేవి?
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:57 PM
మంచిర్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మునిసిపల్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
-చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
-ప్రైవేటు అసోసియేషన్ ఆగడాలను అరికట్టేదెప్పుడు?
-క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో పైరవీలకే పెద్దపీట
-అడ్డగోలు వసూళ్లతో లబోదిబోమంటున్న ప్రజలు
-తీసుకున్న సొమ్ము వాపస్ చేసేందుకు నిరాకరణ!
మంచిర్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): క్యాతన్‌పల్లి మునిసిపల్ కార్యాలయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్మాణ అనుమతులు ఇప్పించేందుకు బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేసిన ఓ వార్డు కౌన్సిలర్‌ను అక్కడి అధికారులు వెనుకేసుకొస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ ప్రైవేటు అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సదరుకౌన్సిలర్...ఆ కార్యాలయాన్నే వసూళ్లకు అడ్డాగా మార్చినప్పటికీ అడిగేవారు లేకుండాపోయారు. ఇదేఅదునుగా ప్రతీపనికి ఓరేటు చొప్పున ప్రజల నుంచి బల వంతంగా వసూలు చేస్తున్నారన్న అభియోగాలున్నాయి. పైసలు ఇయ్యనిదే పనులు కావంటూ హుకుం జారీచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధితులు మొత్తుకుంటున్నారు. జిల్లాలోని క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో పెద్దఎత్తున అవినీతి రాజ్యమేలుతుండటంతో ‘అంతా మా ఇష్టం’ శీర్షికన సెప్టెంబరు 20న ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా అనుబంధంలో కథనం ప్రచురితమైంది. దీంతో అక్రమ వసూళ్లు కొంతమేర తగ్గుముఖం పట్టినప్పటికీ వివిధ పనుల నిమిత్తం ప్రజల నుంచి తీసుకున్న సొమ్ము వాపస్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డబ్బులు అడిగితే కక్ష సాధింపు!
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో ప్రజలకు పనులు చేపట్టేందుకు ప్రైవేటు అసోసియేషన్ బాధ్యుడు అక్రమాలకు తెరలేపాడు. మునిసిపల్ కార్యాలయంలో కూడా అసోసియేషన్‌ను ఆశ్రయిం చాలని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న సదరు ప్రజాప్రతినిధి వినియోగదారుల నుంచి పెద్దమొత్తంలో వసూళ్లకు తెరలేపారు. ఏకంగా సెల్‌ఫోన్ సంభాషణలోనే లక్షలు డిమాండ్ చేశాడనే ప్రచారం ఉంది. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పని జరగనివ్వనని బాహాటంగా బెదిరింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి. తీరా డబ్బులు ఇచ్చాక పని చేయక పోగా, తిరిగి అడిగితే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. డబ్బులు అడిగిన వారిని కిందిస్థాయి ఉద్యోగులతో వేధింపులకు గురిచేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది.
అధికారుల పేరు చెప్పి..
మునిసిపల్ కార్యాలయంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే వినియోగదారుల నుంచి ప్రతి పనికి ఓ రేటు చొప్పున లెక్కలు గట్టి మరీ వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడ పనిని బట్టి రేటు ఫిక్స్ చేస్తారని సమాచారం. కనీసం రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు బాధితులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. అధికారుల పేరుచెప్పి వసూలు చేస్తున్న సొమ్ములో ప్రజాప్రతినిధితోపాటు మునిసిపల్ కార్యాలయానికి సంబంధం ఉన్న పలువురికి వాటాలు ఉంటాయన్న బహిరంగ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలా పెద్దమొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేవగా, ఈ విషయమై అసోసియేషన్ బాధ్యుడికి, కొందరు వినియోగదారులకు మధ్య పలుమార్లు గొడవలు కూడా జరిగినట్లు తెలిసింది. ఏకంగా ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు బదిలీ జరిగినప్ప టికీ, ఘటనపై విచారణ ముందుకు సాగకపోవడం గమనార్హం.
అధికార పార్టీ అండదండలతో..
క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో వెలుగుచూసిన అక్రమవసూళ్ల బాగోతంపై అధికారులు మౌనం ప్రదర్శించడం తీవ్రవిమర్శలకు దారితీస్తోంది. వసూళ్లకు పాల్పడ్డ ప్రజాప్రతినిధి అధికారపార్టీకి చెందిన వాడు కావడంతోనే చర్యలకు వెనుకంజ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న తప్పులకే ఉద్యోగులపై కఠినచర్యలు తీసుకుంటున్న తరుణంలో ప్రజాప్రతినిధుల అవినీతిని ప్రశ్నించకపోవడం పై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ‘అధికారులకు ఓ రూల్...ప్రజాప్రతినిధులకు మరొకటా’ అన్న ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి. క్యాతన్‌పల్లి మునిసిపాలిటీలో వెలుగుచూసిన అక్రమ వసూళ్ల పర్వంలో భాగస్వామ్యం ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులందరిపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు ప్రజల నుంచి ఉన్నాయి.