Mancherial: ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడు?
ABN , Publish Date - Jul 31 , 2026 | 11:03 PM
మంచిర్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖలో ఏర్పడ్డ ఉపాధ్యాయుల ఖాళీల కారణంగా విద్యార్థులకు పాఠాలు అందని ద్రాక్షలా తయారయ్యాయి.
-రిటైర్ అయినా భర్తీకాని స్థానాలు
-కొన్ని పాఠశాలల్లో ఇప్పటివరకు పాఠాలు ప్రారంభించని వైనం
-ఎస్‌ఏ-1 పరీక్షలు ముగిసినా స్పందన శూన్యం
-రెగ్యులర్ డీఈవో లేకపోవడమే కారణం
-జిల్లాలో కంటుపడుతున్న పాఠశాల విద్య
మంచిర్యాల, జూలై 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో విద్యాశాఖలో ఏర్పడ్డ ఉపాధ్యాయుల ఖాళీల కారణంగా విద్యార్థులకు పాఠాలు అందని ద్రాక్షలా తయారయ్యాయి. కొత్తవారితో ఖాళీల భర్తీ సంగతి పక్కనబెడితే రిటైరైన ఉపాధ్యాయుల స్థానాలను ఇతరులతో సర్దుబాటు చేయడంలోనూ విద్యాశాఖ అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వివిధ సబ్జెక్టులను బోధించే ఉపాధ్యాయులు 34మంది వరకు ఉద్యోగవిరమణ చేశారు. పదవీ విరమణతో ఏర్పడనున్న ఖాళీలను గుర్తించి ముందుగానే ఉపాధ్యాయులు సర్దుబాటు చేయాల్సి ఉండగా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ ప్రక్రియ ఏడు నెలలు గడుస్తున్నా ముందుకు సాగకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. పదవీ విరమణ ద్వారా ఏర్పడ్డ ఖాళీలను అలాగే వదిలివేయడం వల్ల ఆయాపాఠశాలల్లో పాఠాలు బోధించే వారే లేకుండా పోయారు. ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివరివరకు 130మంది వరకు ఉపాధ్యాయులు ఉద్యోగవిరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏడునెలల కాలం గడిచిపోగా, ముందు ముందు రిటైరయ్యే స్థానాలను ఎప్పుడు సర్దుబాటు చేస్తారో విద్యాశాఖ అధికారులకే తెలియాలి.
ఫ ఎస్‌ఏ-1 పరీక్షలు ముగిసినా..
విద్యాశాఖ క్యాలెండర్ ప్రకారం ప్రతిమూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ప్రగతిని పరీక్షించేందుకు పరీక్షలు నిర్వహించడం ఆనవాయితీ. గతంలో ఉన్న త్రైమాసిక, షాణ్మాసికం పరీక్షలకు బదులుగా కొన్నేళ్లుగా సమ్మేటివ్ అసెస్‌మెంట్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూలై చివరల్లో ఎస్‌ఏ-1 పరీక్షలు సైతం నిర్వహించారు. ఆ పరీక్షలకు పాఠ్యాంశాల బోధన జరుగకుండానే విద్యార్థులు హాజరయ్యారంటే అతిశయోక్తి కాదు. ఆ పరీక్షలను విద్యార్థులు ఎలా రాసి ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి చేపడుతున్న చర్యల కారణంగా వాటికి తల్లిదండ్రుల నుంచి ఆదరణ పెరుగుతోంది. ఈ కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుండగా, ప్రైవేటు విద్యాసంస్థలు రోజురోజుకూ నిర్వీర్యం అవుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా జరుగకపోవడం విద్యార్థులకు శాపంగా పరిణమించింది. కేవలం విద్యార్థులను చేర్చుకోవడంలో చూపుతున్న శ్రద్ధ.. వారికి విద్యాబోధన అందించడంలో కానరావడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫిబ్రవరి నుంచి జూలై నెలఖారు వరకు జిల్లాలో పని చేస్తున్న ఉపాధ్యాయుల్లో 25మంది స్కూల్ అసిస్టెంట్లు, నలుగురు ఎస్జీటీలు, ముగ్గురు ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ల్యాంగ్వేజ్ పండిట్లు గ్రేడ్-2 ఒకరు పదవీ విరమణ పొందారు. వీరిలో సింహభాగం ఖాళీల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు నేటికీ జరుగలేదు. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖకు రెగ్యులర్ అధికారి లేకపోవడంతో పాఠశాల విద్య కుంటుపడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఇంతకుముందు ఇక్కడ రెగ్యులర్ డీఈవోగా పనిచేసిన యాదయ్య హైదరాబాద్‌కు బదిలీ అయినప్పటి నుంచి ఇన్‌చార్జిగా జిల్లా అదనపుకలెక్టర్ చంద్రయ్యకు బాధ్యతలు అప్పగించారు. జిల్లా అదనపుకలెక్టర్‌గా క్షణం తీరికలేకుండా విధులు నిర్వహించే ఆయనకు అదనంగా విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడం వల్ల పర్యవేక్షణ లోపించి విద్యాశాఖ గాడి తప్పందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫ నిర్వీర్యం అవుతున్న పాఠశాలలు..
ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టకపోవడంతో ఉన్నతపాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. ఖాళీలను డిప్యుటేషన్ల ద్వారా భర్తీచేయాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు టీచర్లు అయిష్టత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మెయిన్‌సెంటర్లు, రోడ్డు సౌకర్యం ఉన్న పాఠశాలలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్న ఉపాధ్యాయులు మారుమూల స్కూళ్లకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కోటపల్లి జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్‌కు చెందిన తెలుగు పండిట్ ఉపాధ్యాయుడు ఒకరు మే నెలలో పదవీవిరమణ చేశారు. అక్కడ ఏర్పడ్డ ఖాళీని రెండు నెలలు గడుస్తున్నా సర్దుబాటు చేయకపోగా, అదే పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మరో తెలుగు ఉపాధ్యాయుడికి చెన్నూరుకు డిప్యుటేషన్ ఇచ్చారు. ఇలా పాఠశాలలో రెండు తెలుగు పోస్టులు ఖాళీ అయి పాఠాలు బోధించే వారు లేకుండా పోయారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు 400మంది విద్యార్థులతో వెలుగు వెలిగిన కోటపల్లి జడ్పీఎస్‌ఎస్‌లో ప్రస్తుత విద్యార్థుల సంఖ్య 39కి పడిపోయింది. దీన్ని బట్టే జిల్లాలో విద్యావ్యవస్థ పనితీరు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో తెలుగు-4, ఆంగ్లం-3, హిందీ-1, ఫిజికల్ సైన్స్-2, బయాలాజికల్ సైన్స్-3, సోషల్ స్టడీస్-12 మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. ఆయా స్థానాలను డిప్యుటేషన్ల ద్వారా సర్దుబాటు చేయాల్సి ఉంది.
ఫ రెగ్యులర్ డీఈవోను నియమించాలి..
- విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షుడు, శ్రీరామోజు కొండయ్య
రెగ్యులర్ డీఈవో లేని కారణంగా విద్యాశాఖ పూర్తిగా గాడితప్పింది. రిటైరైన ఉపాధ్యాయుల స్థానాలను సర్దుబాటు చేయడంలోనూ జిల్లా విద్యాశాఖ విఫలం అవుతోంది. ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు డిప్యుటేషన్లు ఇవ్వడం ద్వారా పదవీ విరమణతో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే సర్దుబాటు చేయాలి. ఇప్పటికైనా జిల్లాలో విద్యాబోధన సజావుగా జరిగేట్లు కలెక్టర్ చర్యలు తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.