Share News

Mancherial: పరిహారం చెల్లించేదెప్పుడు?

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:53 PM

మంచిర్యాల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గుడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపుబాధితుల సమస్యలు దశాబ్దాలు గడుస్తున్నా

Mancherial:  పరిహారం చెల్లించేదెప్పుడు?

-ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిర్వాసితుల బాధలు

-భూములు కోల్పోయిన రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు

-సంవత్సరాలుగా పరిహారం కోసం ఎదురుచూపులు

-కాంగ్రెస్‌ సర్కారు కనికరించడం లేదంటూ ఆవేదన

మంచిర్యాల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గుడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపుబాధితుల సమస్యలు దశాబ్దాలు గడుస్తున్నా తీరడం లేదు. 2004జూలై 28వ తేదీన అప్పటి ఉమ్మడిఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైస్‌ రాజశేఖర్‌రెడ్డ్ది ప్రాజెక్ట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నత్తనడకన సాగిన పనుల కారణంగా మూడేళ్లల్లో పూర్తి కావలసిన ప్రాజెక్‌ ్ట నిర్మాణం 12 సంవత్సరాల తరువాత 2015లో పూర్తయింది. అప్పటి ఉమ్మడిఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల నడుమ గోదావరిపై ఎల్లంపల్లి ప్రాజెక్టును నిర్మించేందుకు అప్పటి ప్రభుత్వం 2004లో సుమారు రూ.600కోట్లు కేటాయించింది. 20.175టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఆనకట్ట నిర్మాణానికి రూ.408.85కోట్లు కేటాయించగా గేట్ల నిర్మాణానికి సుమారు రూ.191 కోట్లు కేటాయించారు. మంచిర్యాల వైపున మట్టికట్ట పొడవు 2.10కిలోమీటర్లు, ఎల్లంపల్లి వైపున పొడవు 2.30కిలోమీటర్లు నిర్మించారు. ఆనకట్ట పొడవు 1.118కిలోమీటర్లు కాగా 62గేట్లు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌ మండలంలో ఏడు గ్రామాలు, లక్షెట్టిపేట మండలంలో రెండు గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో ప్రజల కోసం పునరావాస ఏర్పాట్లు చేశారు.

పరిహారం కోసం ఎదురుచూపులు..

ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ కింద మంచిర్యాల జిల్లాలోని తొమ్మిది గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. ఇందులో హాజీపూర్‌ మండలంలోని గుడిపేట, నంనూర్‌, చందనాపూర్‌, రాపల్లి, కొండపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలతో పాటు లక్షెట్టిపేట మండలంలోని గుళ్ళకోట, సూరారం గ్రామాలను ముంపు కింద ఎంపిక చేశారు. హాజీపూర్‌ మండలంలోని చందనాపూర్‌ గ్రామానికి సంబంధించి మొత్తం 183 నివాస గృహాలు ఉండగా వీరికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదు. మేజర్‌సన్స్‌, ఇతర చెల్లింపులను చేయలేదు. అలాగే కొండపల్లి గ్రామంలో మొత్తం 253నివాస గృహాలుండగా ఎఫ్‌ఆర్‌ఎల్‌ కింద సుమారు 90నివాస గృహాలున్నాయి. కర్ణమామిడిలో 176ఎఫ్‌ఆర్‌ఎల్‌ కింద నివాసగృహాలున్నాయి. పడ్తనపల్లిలో 30ఎఫ్‌ఆర్‌ఎల్‌ కింద నివాసగృహాలున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి దశాబ్దం గడుస్తున్నప్పటికీ పరిహారం చెల్లించలేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇండ్లు త్యాగం చేసినప్పటికీ అధికారులు, ప్రభుత్వం పరిహారం చెల్లించడంలో విఫలమయ్యారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు.

చెల్లింపుల్లో జాప్యం..

ఎల్లంపల్లి ముంపు బాధితుల కోసం పునరావాస కాలనీలు ఏర్పాటు చేసి, అప్పటి ఇందిరమ్మ పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. హాజీపూర్‌, లక్షెట్టిపేట మండలాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల చివరి విడుత రూ.70వేల చొప్పున 1180 మందికి ఇప్పటి వరకు చెల్లించలేదు.

-హాజీపూర్‌ మండలం కొండపల్లి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో నెలకొన్న సమస్యల కారణంగా 59కుటుంబాలు ప్లాట్లు తీసుకునేందుకు అంగీకరించలేదు. దీంతో అప్పట్లో ఒక్కో కుటుంబానికి రూ.2.70లక్షల పరిహారం ప్రకటించారు. అవికూడా ఇప్పటి వరకు చెల్లించలేదని బాధితులు వాపోతున్నారు.

-ముంపు బాధితుల పిల్లలు 18సంవత్సరాలు నిండినా వారికి మేజర్‌ సన్స్‌ కింద పరిగణించి ఒక్కొక్కరికి రూ.2లక్షల ప్యాకేజ్‌ ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బులు కూడా ఇప్పటికీ అందలేదని బాధితులు చెబుతున్నారు. మొత్తంగా దాదాపు రూ.4కోట్లమేర పునరావాస బకాయిలు ఉన్నట్లు ప్రజలు తెలిపారు. అయితే పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముంపు బాధితులను పట్టించుకోకపోవడంతో సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.

పొరుగు జిల్లాల్లో అందిన పరిహారం..

ఇదిలా ఉండగా 2024అక్టోబర్‌ 26న అప్పటి ఎమ్మెల్యే (ప్రస్తుత మంత్రి) అడ్లూరి లక్ష్మణ్‌ చొరవతో జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం చెగ్యాం ముంపు బాధితులకు 126కుటుంబాలకు రూ.18కోట్లకు సంబంధించిన చెక్కులను అందజేసినట్లు మంచి ర్యాల జిల్లా బాధితులు చెబుతున్నారు. అయితే తమకు పరిహారం చెల్లింపుల్లో జాప్యం పట్ల మంచిర్యాల జిల్లా బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించింది, రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా తమకు పూర్తిస్థాయి పరిహారం అందించాలని ప్రాజెక్టు ముంపు బాధితులు కోరుతున్నారు.

ఇందిరమ్మ ఇల్లు డబ్బులు ఇస్తలేరు..

లగిశెట్టి రాజమౌళి, గుడిపేట

ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపులో ఇల్లు, ఇంటి స్థలం కోల్పోయాను. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఇందిరమ్మ ఇంటినిర్మాణం కింద మరో రూ.70వేలు చెల్లిస్తామని ప్రకటించారు. సంవత్సరాలు గడిచినా ఎవరూ స్పందించడంలేదు. అలాగే గ్రామంలో మరికొందరికి మేజర్‌సన్‌ ప్యాకేజీ డబ్బులు కూడా అందలేదు. ప్రాజెక్టు నిర్మించిన కాంగ్రెస్‌ ప్రభుత్వమే ప్రస్తుతం అధికారంలో ఉన్నందున వెంటనే పరిహారం చెల్లించాలి.

Updated Date - Jul 22 , 2026 | 11:53 PM