Mancherial:వామహస్తం.. వరమే..
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:56 PM
కోటపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కొందరు వ్యక్తుల్లోని భిన్నత్వం వారిని ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా ప్రతివ్యక్తిలో భిన్నమైన లక్షణాలుంటే వెంటనే గుర్తించవచ్చు.
- పుట్టుకతోనే కొందరికి ఎడమచేతి వాటం
- నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే
కోటపల్లి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కొందరు వ్యక్తుల్లోని భిన్నత్వం వారిని ప్రత్యేకంగా ఉండేలా చేస్తుంది. సాధారణంగా ప్రతివ్యక్తిలో భిన్నమైన లక్షణాలుంటే వెంటనే గుర్తించవచ్చు. ప్రతి వంద మందిలో 90నుంచి 95 శాతం మంది కుడిచేతి వాటం వారు ఉండగా 5నుంచి 10శాతం మంది లెఫ్డ్ హ్యాండర్స్ కనిపిస్తుంటారు. ఎడమ చేతి వాటం అనేది జన్యు ప్రభావ ఫలితంగా కలుగుతుందని పరిశోధనల్లో తేలింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 13న లెఫ్డ్ హ్యాండర్స్ డే జరుపుకుంటారు. నేడు (గురువారం) ప్రపంచ లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా కథనం..
- జన్యు ప్రభావంతో..
ప్రతి వ్యక్తి పుట్టినప్పటి నుంచి కుడి, ఎడమ చేతి వాటాలను సహజ సిద్ధంగా కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తికి మెదడు, కుడి, ఎడమ రెండు అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరభాగాన్ని మెదడు ఎడమ అర్ధభాగం నియంత్రిస్తుందని, కుడి అర్ధభాగం మెదడు బలంగా ఉన్న వారిలో ఎడమచేతి వాటం వస్తుందని నిపుణులు చెబుతుంటారు. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని గమనిస్తే మాన్పించవద్దని సూచిస్తున్నారు.
-భిన్నమైన శైలి..
కుడి చేత వాటం వారికంటే ఎడమ చేతి వాటం వారిలో ప్రత్యేక తెలివి తేటలు ఉంటాయని, మేథో శక్తి, ఆలోచన, తెలివి భిన్నంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో గుర్తింపు పొందిన మేథావుల్లో చాలా మంది ఎడమచేతి వాటం వారేనని సమాచారం. ప్రముఖ సినీనటుడు అమితాబ్ బచ్చన్, ప్రఖ్యాత క్రికెటర్లు సౌరవ్ గంగూళి, యువరాజ్‌సింగ్ వారు ఎడమచేతి వాటం వారే కావడం విశేషం. కాగా ఇటీవల పాఠశాల ల్లోనూ ఎడమచేతి వాటం కలిగిన విద్యార్థులు పలువురు కనిపిస్తున్నారు.
-పనులను మాన్పించవద్దు...
ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వయస్సు నుంచి వస్తువులను పట్టుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడే కుడి ఎడమలను గుర్తించవచ్చు. పిల్లలు ఎడమ చేతివాటం పనులు చేస్తుంటే తల్లిదండ్రులు మాన్పించే ప్రయత్నం చేయవద్దని అలా చేస్తే సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. కుడి చేతితో రోజువారీ పనులు చేయడం సహజం, అయితే ఆ పనులన్నీ ఎడమ చేతితో చేయడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. రోజువారీ పనులు ఎడమ చేతితో చేస్తూ ప్రత్యేకంగా గుర్తింపు పొందిన వారు చాలా మంది ఉన్నారని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఇక కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నాడో సినీ కవి. అంటే వ్యక్తిలోని భిన్నత్వాన్ని బట్టి ప్రత్యేకతను ఆపాదిస్తామనడానికి ఎడమ చేతి వాటం వారే నిదర్శనం.