Mancherial: కరువు కోరలు..
ABN , Publish Date - Oct 28 , 2026 | 11:57 PM
మంచిర్యాల, అక్టోబరు 28 (ఆంఽధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు.
- ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు విలవిల
- వర్షభావంతో పంట కోల్పోయిన రైతులు
- జిల్లాలో 11 కరువు మండలాలు ఎంపిక
- ఉపాధి చూపించడం ద్వారా ఆర్థిక భరోసా
మంచిర్యాల, అక్టోబరు 28 (ఆంఽధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితుల కారణంగా రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలు అల్లాడుతున్నారు. సాగునీరు దొరకక రైతులు తీవ్రంగా నష్టపోగా భూగర్భజలాలు అడుగంటి సామాన్యప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరిసాగు చివరిదశలో పంటకు నీరందక రైతులు నానా ఇబ్బందులు పడ్డారు. వాటర్‌ట్యాంకర్లు ఏర్పాటు చేసి పంటలను కాపాడు కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రాజెక్టుల పరిధిలో ఉన్న పంట పొలాలతో పాటు సొంతంగా బోర్ల ద్వారా సాగు అవుతున్న వరిపంట కొంతమేర మెరుగ్గా ఉండగా అనేక ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు పడక తప్పలేదు. దీనికి తోడు విద్యుత్ కోతలతో సరియైున సమయంలో కరెంటు సరఫరా కాక మోటార్లు నడపలేని స్థితిలో రైతులు పంటలను కోల్పోయారు. బావులు, బోర్లు, చెరువులలో నీరు అడుగంటిపోతుండగా ప్రాజెక్టులలోనూ నీటిమట్టం రోజురోజుకు పడిపోతుండడం ఆందోళనకర విషయం. వాస్తవంగా ఈ ఏడాది ఖరీఫ్సీజన్లో వరిపంట ఆశాజనకంగా ఉండగా ఎల్‌నినో ప్రభా వంతో ఆశించినమేర దిగుబడి రాకరైతులకు పెట్టుబడులు కూడా గిట్టుబాటు కాలేదని వాపోతు న్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర ఆశాజనకంగా ఉండడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సన్నరకాలకు ప్రకటించిన బోనస్‌తో కలిపి మంచి లాభదాయకం ఉంటుందన్న తరుణంలో ఎల్‌నినో పంజా విసిరింది.
11మండలాల్లో తీవ్ర కరువు..
ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలో 11మండలాలను కరువుప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని భీమారం, చెన్నూరు, దండేపల్లి, హాజీపూర్, జన్నారం, కోటపల్లి, మంచిర్యాల, మంద మర్రి, నస్పూర్, నెన్నెల, వేమనపల్లి మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించింది. ఆయా మండలాల్లో తీవ్రకరువు పరిస్థితులు నెలకొనగా అక్కడి ప్రజలను ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఆయా మండలాల్లో వేలాదిమంది పండించిన వేలాది ఎకరాలలో పంటలు కనీసం 30శాతం మేర నష్టపోయారు. ఎల్‌నినో ప్రభావంతో చివరిదశలో ఉన్న వరిసాగుకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఆయా మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. కనీసం మైనస్ 2నుంచి మైనస్ 23వరకు లోటు వర్షపాతం నమోదుకాగా రైతులతోపాటు సామాన్య ప్రజలకు కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఎల్‌నినో కారణంగా రైతుల ఆశలపై నీళ్లుచల్లగా సామాన్య ప్రజలు కూడా తాగునీటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. సెప్టెంబర్ నెలాఖరు వరకు ఆయా మండలాలలో భూగర్భ జలాలు, వర్షపాతం ఆధారంగా కరువు మండలాలుగా ఎంపిక చేశారు.
వేదిస్తున్న కరెంటు కోతలు..
తీవ్ర వర్షభావ పరిస్థితులకు తోడు అప్రకటిత కరెంటు కోతలు కూడా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కరెంటు కోతల వల్ల ముఖ్యంగా రైతులు తీవ్రఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు కరెంటు పోతుందో.. ఎప్పుడు వస్తుందో అనే పరిస్థితులు నెలకొన్నాయంటే అతిశయోక్తి కాదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్‌కోతలు విధిస్తుండడంతో బోర్లపై ఆధారపడి సాగుచేసే రైతులు తీవ్రఇబ్బందులను ఎదుర్కొన్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాలతోనే విద్యుత్‌శాఖ అధికారులు అప్రకటిత కోతలను విధించినట్లు తెలుస్తోంది. విద్యుత్‌కోతల కారణంగా మోటార్లు కూడా కాలిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షభావ పరిస్థితుల కారణంగా పంటను కోల్పోగా మరోవైపు మోటర్ల మరమ్మతులతో తమపై మరింతభారం పడినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు.
ప్రభుత్వపరంగా ఉపాధి కల్పన..
ఎల్‌నినో ప్రభావం కారణంగా జిల్లాలోని 11మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించగా ఆయా మండలాలోని రైతులు, ప్రజలకు ప్రభుత్వపరంగా ఉపాధి కల్పించే యోచన చేస్తున్నారు. ఉపాధిహామీ పథకం ద్వారా ఆయామండలాల ప్రజలకు పనులు కల్పించడం ద్వారా ఆర్థిక భరోసా కల్పించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో ఒకప్పుడు యజమా నులుగా పంటలను సాగుచేసిన రైతులు ఉపాధిహామీ పనుల కింద కూలీలుగా మారే పరిస్థితులు నెలకొనడం ఆందోళనకర విషయం. ప్రభుత్వపరంగా ఉపాధి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ తమకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారనే మనస్తాపంలో రైతులు ఉండగా సామాన్య ప్రజలు సైతం అదే భావనలో కొట్టుమిట్టాడుతున్నారు.