Share News

Mancherial: మూలనపడ్డ భూసార పరీక్ష కేంద్రం

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:57 PM

మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం నిరుపయోగమై రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది.

Mancherial:  మూలనపడ్డ భూసార పరీక్ష కేంద్రం

- కార్యాలయం లేకపోవడంతో టెస్టులకు నో

- రైతువేదికలో మూలుగుతున్న సామగ్రి

- ప్రతీ టెస్టింగ్‌కు ఆదిలాబాద్‌కు శాంపిల్స్‌

- భవనం కేటాయింపులో తీవ్రజాప్యం

- పట్టించుకోని వ్యవసాయశాఖ, ఇతర అధికారులు

మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం నిరుపయోగమై రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ఎప్పటికప్పుడు భూసార పరీక్షలు చేసి, సరైన పంటలు పండించేలా రైతులకు తగిన సలహాలు, సూచనలు అందించాల్సి ఉండగా జిల్లాలో ఆ దిశగా ఆశించిన మేర కృషి జరగడంలేదనే ఆరోపణలున్నాయి. వ్యవసాయ శాఖలో సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా భూసారపరీక్షలు నిర్వహణకు నోచుకోవడం లేదు.

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో ఉన్న పాతబీట్‌బజార్‌ ఆవరణలో రూ.14.5లక్షల నిధులతో నిర్మించిన మినీభూసార పరీక్ష కేంద్రాన్ని 2017ఏప్రిల్‌ 20న అప్పటి రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అప్పటినుంచి 2022వరకు కేంధ్రంలో భూసారపరీక్షలు నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయరంగానికి సంబంధించి వరి, పత్తిపంటలే అధికంగా ఉంటాయి. విస్తీర్ణాన్ని బట్టి ఆయాపంటల దిగుబడి పెంచేందుకు హైదరాబాద్‌లోని వ్యవసాయశాఖ కమిషనరేట్‌ అధికారులు ఎప్పటికప్పుడు భూసారపరీక్షలు నిర్వహించేందుకు లక్ష్యం విధిస్తుంటారు. ఇందులో భాగంగా జలాధార వ్యవసాయానికి ప్రతి 2.5హెక్టార్లకు ఒక పరీక్ష, అలాగే వార్షాధార పంటలకు ప్రతి 10హెక్టార్‌కు ఒక పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతిఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)ని కేటాయించి, ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టర్‌ పరిధిలో లక్ష్యాన్నిభట్టి భూసార పరీక్షలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ల్యాబ్‌ సౌకర్యమే లేనిచోట లక్ష్యం ఎలా నెరవేరుతుందా అని ఏఈవోలు తలలు పట్టుకోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి.

భవనం లేక మూలనపడ్డ సామాగ్రి..

జిల్లా కేంద్రంలో గతంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని భవనం లేదనే సాకుతో నాలుగేళ్ల క్రితం పూర్తిగా మూసివేశారు. అందులోని సామగ్రిని నస్పూర్‌ పరిధిలోని సీతారాంపల్లిలోగల రైతువేదికలో పడవేయగా, పనికిరాని స్థితిలో మూలుగుతోంది. గతంలో కాలేజ్‌రోడ్డులోని బీట్‌మార్కెట్‌ యార్డు ఆవరణలో భూసారపరీక్ష కేంద్రం ఉండగా, ఆ స్థలంలో మెడికల్‌కాలేజ్‌ నిర్మించారు. దీంతో భూసార పరీక్ష కేంద్రాన్ని మూసివేశారు. రైతులకు అత్యంత ఉపయోగకారిగా ఉన్న భూసారకేంద్రాన్ని మరో చోటుకు తరలించాల్సి ఉన్నప్పటికీ సామగ్రిని నిర్లక్ష్యంగా పడవేయడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సాయిల్‌ టెస్టింగ్‌ కిట్లన్నీ పనికిరాకుండా పోయాయి. కేవలం భవనం లేదనే సాకుతో సెంటర్‌ను మూసివేనప్పటికీ జిల్లా కేంద్రంలోనే అనేక ప్రభుత్వ కార్యాలయాల కోసం వినియోగించిన భవనాలు ఖాళీగా ఉన్న విషయం అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా గతంలో వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయం కోసం వినియోగించిన భవనం ఖాళీగా పడి ఉన్నది. అందులో ఉన్న ఏడీ కార్యాలయాన్ని కలెక్టరేట్‌ సముదాయంలోకి తరలించారు. ఆ భవనాన్ని భూసార పరీక్షకేంద్రానికి వినియోగించే అవకాశం ఉన్నా..సంబంధిత అధికారులు ఆ దిశగా దృష్టిసారించడం లేదు. అలాగే పాత గర్మిళ్లలోని ప్రభుత్వ ప్రాథమికపాఠశాల భవనం సైతం ఖాళీగానే ఉంది.

మినీల్యాబ్‌ల ఏర్పాటుకూ కలగని మోక్షం..

జిల్లావ్యాప్తంగా వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి మండలాలు, గ్రామాల వారీగా 32 మినీ భూసార పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేయాలని ఐదేళ్ల క్రితం అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. ఆయా భూసార కేంధ్రాలకు అవసరమై ల్యాబ్‌ పరికరాలు మంజూరైనప్పటికీ అవి మంచిర్యాల ప్రధాన పరీక్ష కేంద్రంలోనే మూలుగుతున్నాయి. దీంతో భూసార పరీక్షల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆయా మండలాలు, గ్రామాల్లో మినీ భూసార పరీక్షకేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. మినీ ల్యాబ్‌ల ఏర్పాటు కోసం రెండు టేబుళ్లు పట్టే గదితోపాటు విద్యుత్‌ సరఫరా, డిస్టిల్డ్‌ వాటర్‌, నీటి కుళాయితో కూడిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ అవసరమవుతాయి. ఇవన్నీ గ్రామాల్లో అందుబాటులో లేక మినీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయలేదని సమాచారం. జిల్లా కేంద్రంలో ఉన్న భూసారకేంద్రంలో కేవలం మూడు మినీల్యాబ్‌లు ఏర్పాటు చేయగా వివిధ మండలాల ఏఈవోలు పరీక్షలు జరిపేవారు. కాలక్రమంలో జిల్లా కేంద్రంలో ఉన్న ఆ ఒక్క పరీక్షకేంద్రాన్ని సైతం మూసివేయడంతో ప్రస్తుతం భూసార పరీక్షకేంద్రాన్ని ఎత్తివేయడంతో ప్రతీసారి శాంపిల్స్‌ను ఆదిలాబాద్‌కు పంపాల్సి రావడంతో ఫలితాలు వెలువడటంలో తీవ్రజాప్యం జరుగుతోంది. 2025-26 సంవత్సరానికి సంబంధించి జిల్లావ్యాప్తంగా నాలుగువేల భూసార పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శాంపిల్స్‌ అన్నీ 170కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌కు పంపవలసి రావడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది.

వాలంటీర్లకు శిక్షణతోనే సరి..

పంట భూముల్లో ఊరూరా భూసారపరీక్షలను ఉద్యమంలా నిర్వహించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. విచ్చలవిడిగా రసాయనిక ఎరువుల వినియోగం వల్ల నేల సారం దెబ్బతిని పంట దిగుబడి తగ్గుతోందని భావించిన ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 30వేల మందిని వాలంటీర్లుగా ఎంపిక చేసింది. వారిలో మొదటి దఫాలో కొంతమందికి తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా శిక్షణ కూడా ఇచ్చారు. ప్రతిగ్రామానికి ముగ్గురు చొప్పున వాలంటీర్లను కేటాయించనున్నట్లు ప్రకటించారు. అయితే వీరికి మొదటి దఫా శిక్షణతోనే సరిపెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే, భూసార పరీక్షల కేంద్రాలు సైతం అందుబాటులోకి రావడం ద్వారా రైతులకు మేలు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jul 18 , 2026 | 11:57 PM