Mancherial: పరిహారం లెక్కలు తేల్చరూ!
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:03 AM
మంచిర్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 63పరిహారం లెక్కలు తేల్చకపోవడంతో బాధితులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు.
- ఎన్హెచ్63 పరిహారంలో గందరగోళం
- గంపగుత్తగా ఒక్కటే లెక్క చొప్పున చెల్లింపు
- బాధితులకు నోటీసులు అందజేసిన అధికారులు
మంచిర్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారి 63పరిహారం లెక్కలు తేల్చకపోవడంతో బాధితులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. జాతీయ రహదారి(ఎన్హెచ్-63) విస్తరణ కోసం కేంద్రప్రభుత్వం అలైన్మెంట్ రూపొందించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ -జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో గ్రీన్ఫీల్డ్ సర్వేపేరిట విస్తరణకు కేంద్రప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నార్పూర్ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6కిలోమీటర్ల పొడవునా రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ మేరకు అవసరమైన భూసేకరణ కోసం నేషనల్ హైవే అథారిటీ నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో భాగంగా జిల్లాకు చెందిన లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతుల భూములను సేకరించాలని నిర్ణయించారు. అయితే రహదారి విస్తరణ కోసం ఇప్పటికే పలుమార్లు అలైన్మెంట్ వివిధ కారణాల చేత రద్దు కాగా మూడోసారి రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం అధికారులు ముందుకు సాగుతున్నారు.
ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే..
సాధారణంగా రైతుల నుంచి పట్టాభూములు సేకరించి అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు సంబంధిత భూయజమానుల సంసిద్ధత తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం అవసరమైతే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలనే నిబంధన ఉంది. అయితే ఎన్హెచ్-63పనులను చేపట్టేందుకు రైతుల నుంచి భూములు సేకరిస్తుండగా ప్రజాభిప్రాయసేకరణ లేకుండానే పరిహారం ఫిక్స్చేయడం పట్ల అభ్యం తరాలు వ్యక్తమవుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ అధికారులు నేరుగా డిజిట్ జారీచేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు రాస్తారోకోలు, ధర్నాలు సైతం నిర్వహించారు. పట్టాభూములు కావాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం ధర చెల్లించాల్సి ఉండగా అందుకు భిన్నంగా నేరుగా నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల కోపోద్రిక్తులవుతున్నారు. కనీసం గ్రామసభలు కూడా నిర్వహించకుండా రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా అవార్డులు పాస్చేయడం పట్ల తీవ్రవ్యతిరేకత వ్యక్తమ వుతోంది.
గంపగుత్తగా పరిహారం చెల్లించేందుకు ఏర్పాట్లు..
జాతీయ రహదారి-63 విస్తరణ కోసం సేకరిస్తున్న భూములకు అధికారులు గంపగుత్తగా లెక్కలు కట్టి చెల్లించడం పట్ల తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు నివాసగృహాలతో పాటు సొంత పొలాలు, చేలు, ఖాళీస్థలాలు, బోర్లు, ఇతర సంపదను పరిగణలోకి తీసుకొని దేనిది దానికి చొప్పున లెక్కకట్టి పరిహారం చెల్లించాల్సి ఉంది. అందుకు భిన్నంగా రైతుకు తన ఆస్తిని బట్టి ఒకే రకమైన పరిహారం చెల్లించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. వాస్తవానికి గుడిపేట వద్ద నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు విష యంలో పరిహారం ప్రతీదానికి లెక్కకట్టి చెల్లించారు. అదేతీరుగా తమకు కూడా చెల్లించాలని ఎన్హెచ్-63 బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఒక వ్యక్తికి చెందిన ముంపుకు గురయ్యే అన్ని ఆస్తులను పరిగణలోకి తీసుకున్నారు. అలా ఒక్కో దానికి లెక్కకట్టి పూర్తి పరిహారం చెల్లించారు. అందుకు భిన్నంగా ఎన్హెచ్-63 పరిహారం చెల్లింపులు చేస్తుండడంతో రైతులు వ్యతిరేకిస్తున్నారు.
బాధితులకు నోటీసులు అందజేత..
ఓ వైపు భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తుండగానే మరోవైపు అధికారులు బలవంతంగా వారికి నోటీసులు అందజేస్తున్నారని వాపోతున్నారు. బలవంతంగా నోటీసులు చేతిలో పెట్టి గంప గుత్తగా భూములు సేకరించే యత్నాలు జరుగుతున్నాయని, ఇదే జరిగితే తాము పూర్తిగా మునిగి పోతామన్న ఆవేధనలో రైతులున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వహణ సమయంలోనూ ప్రభుత్వం తమ భూములు సేకరించిందని చెబుతున్నారు. అప్పుడు బంగారు పంటలు పండించే భూముల న్నింటిని కోల్పోగా అరకొర మిగిలిన వాటిలో సాగుచేస్తూ తాము జీవనం సాగిస్తున్నామని చెబుతు న్నారు. ఇప్పుడు ఎన్హెచ్-63పేరుతో ఉన్న భూములు కూడా లాక్కుంటుండడంతో వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
పామాయిల్ పంటకు తీవ్రనష్టం..
కందుల రమేష్, రైతు, గుడిపేట
నాకున్న మూడు ఎకరాల భూమిలో ప్రభుత్వసూచనల మేరకు నాలుగు నెలల క్రితం పామాయిల్ పంట వేశాను. అందులో 142మొక్కలు నాటించగా ఇప్పుడు అవి ఏపుగా పెరిగి పంటచేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు నా భూములను ఎన్హెచ్-63కింద కోల్పోతున్నాను. ఎకరంనర భూమితోపాటు 75మొక్కలు కోల్పోవాల్సి వస్తోంది. ఈమేరకు అధికారులు చెట్లు, బోరు, పైపులైన్లకు పరిహారం ఎంత అనేది స్పష్టం చేయకుండానే హడావుడిగా నోటీసులు అందజేయడం అన్యాయం.