Share News

Mancherial: సాదాబైనామాల పరిశీలన వేగవంతం!

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:50 PM

మంచిర్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామాలతో భూముల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగం పుంజుకుంది.

Mancherial:   సాదాబైనామాల పరిశీలన వేగవంతం!

- జిల్లా వ్యాప్తంగా 20వేల పైచిలుకు దరఖాస్తులు

- 2016 నుంచి క్రమబద్దీకరణకు నోచుకోని వైనం

- అసైన్డ్‌ భూముల పరిష్కారం లబ్ధిదారుల ఎదురుచూపు

- ధరణిలో పరిష్కారం కాని భూ సమస్యలు

మంచిర్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామాలతో భూముల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన వేగం పుంజుకుంది. త్వరితగతిన దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రవేశపెట్టిన ’ధరణి’ భూ సమస్యలకు పరిష్కారం చూపకపోగా అనేక చిక్కుముడులను తెచ్చిపెట్టింది. అర్జీల పరిష్కారం కోసం రైతులు కాళ్లరిగేలా తిరిగినా స్పందనలేకుండా పోయింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ హయాంలో ’ధరణి’ స్థానంలో ప్రవేశపెట్టిన ’భూ భారతి’ పోర్టల్‌ ద్వారా జీవో 76ను అనుసరించి సాదాబైనామాల సమస్యలకు పరిష్కారం చూపే దిశగా రెవెన్యూ అధికారులు కృషిచేస్తున్నారు. భూ భారతి పోర్టల్‌ కింద సాదాబైనామాల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను సైతం ఆహ్వానించింది. ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పెద్దమొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. అధికారులు స్వీకరించిన దరఖాస్తుల్లో అధిక భాగం సాదాబైనామా, అసైన్డ్‌ భూములకు సంబంధించినవి కావడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా సాదాబైనామా పరిష్కారం కోసం 20,759దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 12,269 పరిష్కారం కాగా, మరో 8490పెండింగులో ఉన్నాయి.

సమస్యల పరిష్కారం దిశగా..

ప్రభుత్వం ఆర్వోఆర్‌-2020-25 భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చినందున ఇందులో భాగంగా రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయగా బాధితులు దరఖాస్తులు చేసుకున్నారు. గతప్రభుత్వం అంతకు ముందున్న రైతులకు భూహక్కులు కల్పించే పట్టదారు పాసుపుస్తకాల చట్టం-1971ని రద్దుచేసి కొత్తగా పాసుపుస్తకాల చట్టం-2020 పేరిట ధరణిని తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా, కొత్త సమస్యలను తీసుకొచ్చింది. ఈక్రమంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్‌ను తీసుకొచ్చింది. ఇందులో బాగంగా మండలాల వారీగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించింది.

ఊపందుకున్న కార్యాచరణ..

రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సాదాబైనామా కూడా ఒకటి. గతంలో గ్రామాల్లో చాలామంది రైతులు రెవెన్యూస్టాంప్‌ పేపర్లు, తెల్లకాగితాలపై భూముల క్రయవిక్రయాలు జరిపే వారు. ఈ విధానంలో భూములపై హక్కు సంపూర్ణంగా లభించేది కాదు. ఈ విషయమై దృష్టిసారించిన గత ప్రభుత్వం సాదాబైనామాల సమస్యను పరిష్కరించేందుకు 2016లో జీవో నంబర్‌ 153ను తీసుకొచ్చింది. 2014జూన్‌ 2వ తేదీకి ముందుగా సాదాబైనామాలతో భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి చట్టబద్దత కల్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020అక్టోబర్‌ 12న కూడా జీవో నంబర్‌ 112ను జారీ చేసింది. సాదాబైనామాల సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా వేసింది. అయినా సమస్యలకు పరిష్కారం లభించలేదు. ఆ సమస్య పరిష్కారం కాకుండానే 29అక్టోబర్‌ 2020లో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల చట్టాన్నితెచ్చింది. ఎన్నిసార్లుజీవోలు తెచ్చినా.. పరిష్కారం చూపకపోవడంతో విమర్శలు మూటగట్టుకుంది. గతప్రభుత్వం కేవలం జీవోల జారీతోనే సరిపెట్టిందని, సాదాబైనా మాలపై తహసీల్దార్‌లకు అధికారాలు ఇచ్చినప్పటికీ, వాటిని పరిష్కరించేందుకు సరైన మార్గదర్శ కాలను విడుదల చేయలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం భూభారతి చట్టం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రారంభించింది.సాదాబైనామాలతోపాటు అసైన్డ్‌ భూముల సమస్యల పరిష్కారం కోసం కూడా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భాగంగా 2020వరకు ఉన్న సాదాబైనామాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు.

పరిగణలోకి సెల్ఫ్‌ డిక్లరేషన్‌..

గతంలో సాదాబైనామాల క్రమబద్దీకరణకు పట్టేదారు రిజిస్ట్రేషన్‌ చేయాలనే నిబంధన ఉండేది. ఒకవేళ పట్టేదారు బతికి ఉండని పక్షంలో అప్పటికే రాసుకున్న సాదాబైనామాల విషయమై సరియైన విదివిధానాలను ఆనాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూపొందించలేదు. దీంతో సాదాబైనామాల అంశం ముందుకు సాగలేదు. ప్రస్తుత ప్రభుత్వం పట్టేదారుతో పనిలేకుండా కొనుగోలుదారుకు హక్కులు సంక్రమించే విధంగా చర్యలు చేపడుతోంది. క్రమబద్దీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న భూమి చుట్టుపక్కల ఉన్న వారిని విచారించడం ద్వారా పరిష్కరించనున్నారు. వారి అభిప్రాయాలు నమోదు చేయడంతోపాటు కొనుగోలుదారు సెల్ఫ్‌డిక్లరేషన్‌ తీసుకోవడంద్వారా నేరుగా క్రమబద్దీకరించనున్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:50 PM