Share News

Mancherial: మారనున్న పల్లె రోడ్లు

ABN , Publish Date - Jul 22 , 2026 | 11:44 PM

కాసిపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

 Mancherial: మారనున్న పల్లె రోడ్లు

- రూ.350కోట్లతో పరిపాలన అనుమతులు

- మెరుగుపడనున్న రవాణా సౌకర్యాలు

కాసిపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నిధుల కొరతతో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రహదారుల పునరుద్దరణకు ప్రభుత్వం రూ.350.50కోట్ల నిధులు కేటాయించడంతో గ్రామీణప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యూటీ మోడల్‌) కింద రహదారులను నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో సరికొత్త విధానం ద్వారా పల్లెల్లోని రోడ్ల రూపురేఖలు మారనున్నాయి. దీంతో అంతర్గత రోడ్లను ఆధునీకరించి జిల్లాకేంద్రానికి అనుసంధానం చేస్తున్నారు. దీనివల్ల రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయి.

-జిల్లాలో ఇలా..

మంచిర్యాల జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు గుర్తించి పంపిన ప్రతిపాదనల మేరకు 358.16 కిలోమీటర్ల మేర మొత్తం 85రహదారులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.350.50కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇందులో ఆర్‌అండ్‌బీ పరిధిలోని రహదారులను రూ.241కోట్లతో, 145.93కిలోమీటర్లు ఉన్నతీకరించనున్నారు. పంచాయతీ రాజ్‌ శాఖ పరిధిలోని 32రహదారులను రూ.60కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. రహదారులకు అయ్యే మొత్తం నిధుల్లో ప్రభుత్వం 40శాతం భరించనుండగా సంబంధిత గుత్తేదారులు 60శాతం ఖర్చు చేస్తారు. తర్వాత గుత్తేదార్లకు ప్రభుత్వమే వాయిదాల ప్రకారం చెల్లిస్తుంది. 15ఏళ్ల పాటు సంబంధిత గుత్తేదారు నిర్వహణ బాధ్యతలను చూడాల్సి ఉంటుంది. త్వరలో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి పనులను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.

-ఆధునీకరించనున్న రహదారులు

జిల్లాలోని రహదారులను గ్రామీణప్రాంతాలతో పాటు మండలకేంద్రాల రోడ్డుకు అనుసంధానం చేస్తూ రహదారిని మెరుగుపర్చనున్నారు. ఇందులో తాండూర్‌, భీమిని నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి 24కిలోమీటర్ల రోడ్డుతో మంచిర్యాల జిల్లా కేంద్రం వరకు అనుసంధానం చేయనున్నారు. అలాగే భీమారం టూ గురిజాల రోడ్డు నుంచి నెన్నెల మండల కేంద్రానికి 29.70కిలోమీటర్ల, మరో 12కిలోమీటర్ల వరకు రోడ్డును అనుసంధానం చేయనున్నారు. అలాగే చెన్నూరు నుంచి వేమనపల్లి 30.63 కిలోమీటర్ల మేరకు రోడ్డును విస్తరించి జిల్లా కేంద్రానికి అనుసంధానం కానుంది. కోటపల్లి నుంచి పారుపెల్లి రోడ్డు 12కిలోమీటర్లు, గూడెం నుంచి మేదరిపేట వరకు 17.10కిలోమీటర్ల మేర రోడ్డును విస్తరించనున్నారు. హాజీపూర్‌ నుంచి పెద్దంపేట వయా టీకనపల్లి 8కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. ఉత్కూరు నుంచి వెంకట్రావుపేట రోడ్డును వయా చందారం మీదుగా 12.50 కిలోమీటర్ల రోడ్డును విస్తరించనున్నారు. కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని కల్వడ నుంచి ఒడ్డుగూడ వయా దహెగాం మండలం మీదుగా సిర్పూర్‌ కాగజ్‌నగర్‌కు 15కిలోమీటర్ల రోడ్లను అనుసంధానం చేయనున్నారు. దీనివల్ల రహదారి సౌకర్యం మరింత మెరుగుపడి ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి.

-మెరుగుపడనున్న రవాణా

జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి మండలకేంద్రాలకు అనుసంధానం చేసే రహదారు లన్నీ ఏకవరుస రహదారులే. ఈ రహదారులను రెండు వరుసలుగా విస్తరించనున్నారు. ప్రమాదకరమైన మూలమలుపులను సరిచేయడంతో పాటు భారీవాహనాల రాకపోకలను సైతం తట్టుకునేలా రోడ్లను ఆధునిక సాంకేతికతతో నిర్మించనున్నారు. దీంతో ప్రజారవాణా మెరుగుపడి వాణిజ్య, వ్యాపార రంగాలు మరింత అభివృద్ధి చెందనున్నాయి.

- ఆధునీకరించే నిర్ణయం తీసుకోవడం అభినందనీయం

- సుంకరి మహేష్‌, భీమారం

భీమారం నుంచి గురిజాల మీదుగా నెన్నెలమండలం వరకు వెళ్లే రహదారిని ఆధునీకరిం చడానికి నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. కొన్నేళ్లుగా సింగిల్‌ రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. డబుల్‌ రోడ్డు వేయనుండడంతో రహదారి కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వం సింగిల్‌ రోడ్లను మండల కేంద్రాలకు అనుసంధానం చేస్తూ జిల్లా కేంద్రం వరకు డబుల్‌ రోడ్లను నిర్మించడానికి చర్యలు తీసుకుంటుండడం సంతోషంగా ఉంది.

Updated Date - Jul 22 , 2026 | 11:44 PM