Mancherial: సన్నబియ్యం ధరలకు రెక్కలు..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:06 AM
బెల్లంపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో క్వింటాలుకు దాదాపు రూ.2వేలకు పైగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
- రెండు నెలల వ్యవధిలో క్వింటాల్‌కు రూ.2వేలు పెరుగుదల
- ఎల్‌నినో ప్రభావంతో మరింత పెరుగుతాయని వ్యాపారుల అక్రమ నిల్వలు
- అధికారులు దృష్టి సారించేనా?
బెల్లంపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): సన్నబియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రెండు నెలల వ్యవధిలో క్వింటాలుకు దాదాపు రూ.2వేలకు పైగా పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఎల్‌నినో కారణంగా బియ్యం ధరలు మరింతగా పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. దీంతో కొందరు బియ్యం, రైసుమిల్లుల వ్యాపారులు పెద్దఎత్తున అక్రమంగా బియ్యం నిల్వ చేస్తున్నారు. అధికారులు అక్రమనిల్వలను గుర్తించి తనిఖీలు చేస్తే ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశాలు ఉంటాయి. ఓ వైపు నిత్యావసర వస్తువులు మరోవైపు బియ్యం ధరలు పెరగడంతో సామాన్య మధ్య తరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది.
- రూ.2వేలకు పైగా పెరిగిన ధరలు..
గడిచిన రెండు నెలల వ్యవధిలో సన్నబియ్యం ధరలు రూ.2వేలకు పైగా పెరిగాయి. ఆగస్టు నెలలో జైశ్రీరాం రకం సన్నబియ్యం ధర క్వింటాల్కుకు రూ.7800ఉండగా సెప్టెంబరులో రూ.8500లకు పెరిగింది. ప్రస్తుతం అక్టోబరు నెలలో ఏకంగా రూ.9800లకు పెరిగింది. అలాగే హెచ్ఎంటీ రకం సన్నబియ్యం రెండు నెలల క్రితం క్వింటాల్కుకు రూ.6500ఉండగా ప్రస్తుతం రూ.8500లకు ధర పలుకుతోంది. రిటైల్ మార్కెట్లో జైశ్రీరాం సన్నబియ్యం ధరల అమ్మకాలు కిలో రూ.100కు వ్యాపారులు విక్రయిస్తున్నారు. సన్నబియ్యం ధరలు సెంచరీ కొట్టడంతో బియ్యం కొనుగోలు చేయాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- వ్యాపారుల అక్రమ నిల్వలు
సన్నబియ్యం ధరలు క్వింటాల్‌కు రూ.10వేలు దాటుతుందనే అంచనాతో వ్యాపారులు అక్రమంగా పెద్ద ఎత్తున బియ్యం నిల్వలు చేస్తున్నారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో ఈ ఏడాది వరిసాగు తగ్గింది. దిగుబడి సైతం గణనీయంగా తగ్గుతుందనే అంచనా నేపథ్యంలో వ్యాపారులు దీన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్లో బియ్యం నిల్వలు తగ్గుతున్నాయనే ప్రచారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది. ఇదే అదునుగా కొందరు రైసుమిల్లర్ల యజమానులు హోల్‌సేల్ బియ్యం వ్యాపారులు సన్నబియ్యంను గోదాముల్లో పెద్ద ఎత్తున అక్రమంగా నిల్వ ఉంచారు.
- ప్రజలపై ఆర్థిక భారం..
జిల్లాలో రోజుకు 500నుంచి 600క్వింటాళ్ల బియ్యం విక్రయిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో క్వింటాల్‌కు రూ.2వేలు అదనపు భారం ప్రజలపై పడుతోంది. రోజుకు సుమారుగా రూ.10లక్షల అదనపుభారం పెరిగిన బియ్యం ధరలతో ప్రజలపై పడుతుండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే బియ్యం ధరల పెరుగుదలతో పలు హోటళ్లలో భోజనాల ధరలను పెంచారు. ఒక్కో హోటల్లో ప్లేట్ వెజ్ భోజనం ధర రూ.100నుంచి, 120నుంచి రూ.150వరకు పెంచారు.
-నియంత్రణపై అధికారులు దృష్టి సారించేనా?
రోజు రోజుకు పెరుగుతున్న బియ్యం ధరలతో అక్రమ నిల్వలపై అధికారులు దృష్టిసారించాల్సి ఉంది. అలాగే అక్రమ నిల్వలపై సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ఆయా గోదాములపై దాడులు నిర్వహించాలి. అక్రమంగా సన్నబియ్యం నిల్వచేసే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొంటున్నారు.
ఫ బియ్యం ధరలను తగ్గించాలి..
- రాయ్, బెల్లంపల్లి
పెరిగిన సన్నబియ్యం ధరలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకంగా క్వింటాల్‌కు రూ.2 వేలకు పైగా పెరగడంతో బియ్యం కొనుగోలు చేయలేకపోతున్నాం. గతంలో ప్రతినెల 25కిలోల బియ్యం ఒకేసారి కొనుగోలు చేసేవాళ్లం. ప్రస్తుతం బియ్యం ధరలు పెరగడంతో ఒకేసారి కొనలేకపోతున్నాం. బియ్యం ధరలను ప్రభుత్వం నియంత్రించాలి.
ఫ అక్రమ నిల్వలపై దాడులు చేపట్టాలి
- వెంకటేష్, బెల్లంపల్లి
వ్యాపారులు, రైసుమిల్లర్ల యజమానులు బియ్యం ధరలు పెరుగుతాయని పెద్ద ఎత్తున అక్రమంగా బియ్యం నిల్వ చేస్తున్నారు. బియ్యం ధరల పెరుగుదలకు అక్రమనిల్వలు సైతం కారణంగా చెప్పవచ్చు. దీనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం సరైందికాదు. ఉన్నతాధికారులు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి బియ్యం విక్రయించే విధంగా చర్యలు చేపట్టాలి.