Mancherial: బొగ్గుబాయి చుట్టూ రాజకీయం
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:58 PM
మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు బొగ్గుబాయి బాట పడుతున్నాయి.
-హరీష్‌రావు పర్యటనతో మొదలు
-కార్మికుల మద్దతు కోసం నేతల ఆరాటం
-అధికార కాంగ్రెస్‌సహా అన్ని పార్టీలదీ అదే దారి
-గనులపై ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న పర్యటనలు
మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు బొగ్గుబాయి బాట పడుతున్నాయి. బొగ్గు బావులపై రాజకీయ నేతలు వరుసగా చేపడుతున్న పర్యటనలు గనులపై ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండున్నరేళ్లు సపమయం ఉండగానే నాయకుల పర్యటనలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.
సింగరేణి పరిరక్షణ పేరుతో బీఆర్‌ఎస్ బాయిబాట పట్టగా, మాజీమంత్రి తన్నీరు హరీష్‌రావు గత నెల7వ తేదీన గోదావరిఖనిలో ‘‘కాంగ్రెస్‌కో హఠావో....సింగరేణి బచావో’’ పేరుతో సదస్సు ఏర్పాటు చేశారు. ఇక సింగరేణి బొగ్గు యాయం కాలేదని నిరూపించేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అదేనెల 13న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, సింగరేణి సీఎండీ బుద్దజ్యోతి ప్రకాశ్‌లతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్‌కాస్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఓపెన్‌హౌజ్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించి వాస్తవాలను మీడియా ముందు ఉంచారు. అలాగే జూన్ 16న ‘‘బాయిబాట’’ పేరుతో తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట కవిత ఎస్‌ఆర్‌పీ-3 గనిని సందర్శించి, కార్మికులతో మమేకం అయ్యారు. అదేరోజు కవిత జిల్లాలోని కోల్‌బెల్ట్ ప్రాంతాలైన కాసిపేట, బెల్లంపల్లి, మంచిర్యాల నగరంలో పర్యటించారు. ఐదు రోజులపాటు ఆమె కోల్‌బెల్ట్ ఏరియాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి, కార్మికులతో మాటామంతి చేపట్టారు. జూన్19న ‘‘సింగరేణి భరోసా యాత్ర’’ పేరుతో బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా బాయిబాట పట్టి సింగరేణి కార్మికులతో మమేకం అయ్యారు. తిరిగి ఈ నెల 14న ‘‘సింగరేణి భరోసా యాత్ర’’ పేరుతో కేంద్ర గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి శ్రీరాంపూర్‌లోని పలు గనులను బీజేపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రారావుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి తాడిచర్ల బొగ్గు బ్లాక్‌ను సింగరేణి కేటాయించేందుకు కృషిచేసినట్లు తెలిపారు. అనంతరం అదేరోజు క్యాతన్‌పల్లి మునిసిపాలిటీ పరిధిలో సమావేశం ఏర్పాటు చేసి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. అలా కార్మికుల మద్దతు కోరేందుకు ప్రధాన పార్టీల నాయకులు తాపత్రయ పడుతుంటం కోల్‌బెల్ట్ ప్రాంతంలో తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది.
సింగరేణి ఎన్నికలు ఉండటంతో..
సింగరేణిలో త్వరలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటీయూసీ పదవీకాలం పూర్తికానుండటంతో ఎన్నికలు నిర్వహించడం అనివార్యం కానుంది. దీంతో తమ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలకు కార్మికుల మద్దతు కోరేందుకే అగ్రనేతలంతా బాయిబాట పడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అధికార కాంగ్రెస్ తరుపున ఐఎన్‌టీయూసీ సింగరేణిలో కార్మికసంఘంగా పని చేస్తుండగా, బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా టీబీజీకేఎస్, బీజేపీకి అనుబంధంగా బీఎంఎస్, టీఆర్‌ఎస్(కవిత పార్టీ)కి అనుబంధంగా హెచ్‌ఎంఎస్ యూనియన్లు పనిచేస్తున్నాయి. రాబోయే సింగరేణి గుర్తింపుసంఘం ఎన్నికల్లో తమ అనుబంధ సంఘం ప్రాతినిథ్యం వహించాలంటే కార్మికుల మద్దతు తప్పనిసరి. దీంతో కార్మికుల మద్దతు కోసమే ఆయాపార్టీల అగ్రనేతలు గనులను సందర్శిస్తూ పర్యటనలు సాగిస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లోనూ లబ్ధి..
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో గెలుపొందే కార్మిక సంఘం కనీసం రెండేళ్లపాటు పదవీ బాధ్యతలు నిర్వహించనుంది. సింగరేణి వ్యాప్తంగా దాదాపు 40వేల మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. వారి మద్దతు కూడగట్టగలిగితే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో బయట పడవచ్చుననే ఉద్దేశ్యంతోనే నాయకులు ఆరాటపడుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. గుర్తింపు సంఘంగా గెలుపొందితే సింగరేణివ్యాప్తంగా ఉన్న కార్మికులసంఖ్యలో అధికశాతం తమను వెన్నంటే ఉంటారన్న భావన నేతల్లో కనిపిస్తోంది. అలా తమ అనుబంధ కార్మికసంఘం ద్వారా సింగరేణిలో బలోపేతమైతే రెండేళ్ల అనంతరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కోల్‌బెల్ట్ పరిధిలోని నియోజకవర్గాల్లో పాగా వేయవచ్చుననే ఆలోచనతో అగ్రనేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కార్మికులను మమేకం చేసుకోవడం కోసం హామీలు ఇస్తున్నారన్న ప్రచారమూ ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి చేతుల మీదుగా 335మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయగా, బొగ్గు మాయం అంశం ఎజెండాతో బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌లు కార్మికులను మచ్చిక చేసుకొనే పనిలో నిమగ్నమయ్యాయి. ఇక బీజేపీ తాడిచెర్ల-2 బొగ్గుబ్లాక్‌ను సింగరేణికి కేటాయించడం ద్వారా కోల్ బెల్ట్‌లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాబోయే రోజుల్లో సింగరేణికి మరిన్ని బ్లాకులు కేటాయిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించడం కూడా నల్లనేలలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికేనన్న చర్చ జరుగుతోంది.