Share News

Mancherial: ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌..

ABN , Publish Date - Jul 08 , 2026 | 11:41 PM

మంచిర్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్తరణ పనులకు ఎట్టకేలకు బ్రేక్‌ పడింది.

Mancherial:  ఎన్‌హెచ్‌-63 పనులకు బ్రేక్‌..

-నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

-విధానాలు అమలు చేయకపోవడమే కారణం

-విన్నపాలు పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం

-హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత రైతులు

మంచిర్యాల, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌-జగిత్యాల-మంచిర్యాల జిల్లాల్లో ఎన్‌హెచ్‌-63 విస్తరణ పనులకు ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. నేషనల్‌ హైవే అథారిటీ జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తుదితీర్పు వెలువరించింది. జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్రం గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పేరిట పనులకు అనుమతులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మీదుగా జగిత్యాల-మంచిర్యాల వరకు మొత్తం 148.6కిలీమీటర్ల పొడవున్న 63వ జాతీయ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్రప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో ఉన్న రోడ్డును విస్తరించడంతోపాటు అనుకూలంగా లేనిచోట కొత్తగా నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన భూమిని సేకరించాలని నేషనల్‌ హైవే అథారిటీని ఆదేశించింది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలకు దూరంగా గుట్టలు, పట్టాభూముల గుండా సాగేలా అలైన్‌మెంట్‌ రూపొందించారు. అలైన్‌మెంట్‌ ప్రకారం నిజామాబాద్‌ జిల్లా బాల్కొండలోని ఎన్‌హెచ్‌-44నుంచి ప్రారంభమయ్యే రహదారి పలు గ్రామాల గుండా సాగుతూ జగిత్యాల జిల్లాలో ప్రవేశిస్తున్నది. అక్కడి నుంచి రాయపట్నం వద్ద గోదావరి వంతెన మీదుగా జిల్లాలోకి అడుగిడుతుంది.

హై కోర్టును ఆశ్రయించిన రైతులు..

ఎన్‌హెచ్‌-63 కోసం అధికారులు మూడు దఫాలుగా రూట్‌ మ్యాప్‌లో మార్పులు చేశారు. మొదటి అలైన్‌మెంట్‌ ప్రకారం కొందరు బడాబాబులకు నష్టం వాటిళ్లుతండటంతో వారి ఒత్తిళ్లకు తలొగ్గి రెండో రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. అది లక్షెట్టిపేట నుంచి ముల్కల్ల వరకు పూర్తిగా నివాస గృహాల మీదుగా వెళ్తుండటంతో సామాన్య ప్రజానీకానికి తీరని నష్టం కలుగజేసేలా ఉండటంతో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అష్టకష్టాలు పడి నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేతకు గురవుతుండ టంతో ఆయా గ్రామాల ప్రజలు సర్వే పనులను అడ్డుకోవడం, భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆందోళనలు నిర్వహించారు. దీనికి స్పందించిన ఎన్‌హెచ్‌ అధికారులు మూడో రూట్‌మ్యాప్‌ను సిద్ధం చేశారు. కొత్త అలైన్‌మెంట్‌తో జీవనాధారామైన సాగుభూములను సేకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అలైన్‌మెంట్‌ ప్రకారం లక్షెట్టిపేట మండలం మీదుగా గోదావరి నదికి సమాంతరంగా పంటపొలాలు, చేల మీదుగా రహదారి నిర్మాణం జరగాల్సి ఉంది. గతంలో ఈ ప్రాంత రైతులకు చెందిన భూములు పెద్దఎత్తున శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ముంపునకు గరయ్యాయి. మిగిలిన కొద్దిపాటి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మళ్లీ రహదారి నిర్మాణం కోసం తమ భూములు సేకరిస్తుండటంతో వారంతా ఆందోళనబాట పట్టారు. తమకు నష్టం కలిగించే రూట్‌మ్యాప్‌ను కేంద్ర, రాష్ట్ర మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించారు.

నోటిఫికేషన్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ..

రైతుల పక్షాన వెల్గటూర్‌కు చెందిన న్యాయవాది దోరిశెట్టి పోచయ్య 2024లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఎన్‌హెచ్‌-63పనులు నిలిపివేయాలని అప్పట్లో డబ్ల్యూపీ నెం.35476/2024 ద్వారా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌హెచ్‌ అథారిటీ యాక్ట్‌ సెక్షన్‌ 3సీ ప్రకారం అధికారులు విధానాలను అమలు చేయలేదని, రైతుల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ధర్మాసనం తన తీర్పులో తప్పుబట్టింది. ఈ మేరకు అప్పటి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ఎన్‌హెచ్‌-63పనులు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. హైకోర్టులో కేసు ఉన్న ప్పటికీ ఎన్‌హెచ్‌ అధికారులు పనులు చేపట్టేందుకు సిద్దమవుతున్న తరుణంలో రెండేళ్ల అనంతరం ఏకంగా నోటిఫికేషన్‌నే రద్దుచేస్తూ ఈనెల6న తుది తీర్పు వెలువడటం గమనార్హం. సెక్షన్‌ 3సీ ఆఫ్‌ ఎన్‌హెచ్‌ యాక్ట్‌ 1956ప్రకారం నిబంధనలు పాటించకపోవడాన్ని తప్పుపట్టిన జస్టిస్‌ ఎన్‌వీ శ్రావన్‌కుమార్‌ సెగ్మెంట్‌ మొత్దాన్ని రద్దు చేస్తూ తుదితీర్పు వెలువరించారు.

హైకోర్టు తీర్పు హర్షణీయం..

లగిశెట్టి రాజమౌలి, గుడిపేట

రైతులకు ఉపాధి లేకుండా చేసే జాతీయ రహదారి విస్తరణ పనులను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడం హర్షనీయం. కాళ్లరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా రైతులకు సరైన న్యాయం లభించలేదు. అధికారుల చర్యలు రెండేళ్లుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భూములు ఇవ్వమని చెప్పినా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లోనే రైతులందరం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది.

రైతులకు అన్యాయం జరగొద్దని..

హైకోర్టు న్యాయవాది దోరిశెట్టి పోచయ్య

భూములను నమ్ముకొని జీవనం సాగిస్తున్న రైతుల గోడును పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఉన్న భూములన్నీ రహదారి పేరిట లాగేసుకుంటే వాళ్లు ఎలా బతకాలి. నేషనల్‌ హైవే అథారిటీ యాక్ట్‌ ప్రకారం కూడా చెల్లింపులు చేయడం లేదు. అందుకే రైతుల పక్షాన న్యాయ స్థానంలో వాధనలు వినిపించాం. కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది.

Updated Date - Jul 08 , 2026 | 11:41 PM