Share News

Mancherial: విజృంభిస్తున్న దోమలు..

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:06 AM

మంచిర్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది.

Mancherial: విజృంభిస్తున్న దోమలు..

- వర్షాల కారణంగా వేగంగా వృద్ధి

- సాయంత్రం వేళల్లో కుప్పలుగా ఇళ్లలోకి

- నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం

- డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రభలే ప్రమాదం

- మున్సిపాలిటీల తీరుపై ప్రజల అసహనం

మంచిర్యాల, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మున్సిపాలిటీలు, గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వర్షాలు కురుస్తుండటంతో దోమల వృద్ధి వేగంగా జరుగుతోంది. గుంపులుగుంపులుగా పుట్టుకొస్తున్న దోమలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. సాయంత్ర మైతే చాలు.. చెరువులు, నాలాల పక్కనున్న కాలనీల్లో ప్రజలు తలుపులు తెరవాలంటేనే భయపడిపోతున్నారు. ఆరుబయట సైతం నిల్చోలేని పరిస్థితి నెలకొంది. వీధుల్లో డ్రైనేజీ లను రోజుల తరబడి శుభ్రపరచకపోవడం, మురికినీటిపై దోమలు వేగంగా వృద్ది చెందుతుండటంతో ప్రజలు రోగాల బారినపడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు చేపట్టవలసిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దోమల నియంత్రణ చర్యలను మొక్కుబడిగా చేపడుతూ ప్రజారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ పరిస్థితి గ్రామపంచాయతీలతో పోల్చితే మున్సిపాలిటీలలో మరింత అధ్వానంగా తయారైంది.

జాడలేని ఫాగింగ్‌..

వర్షాకాలం ప్రారంభమై రెండునెలలు కావస్తున్నా దోమల నివారణకు ఇప్పటివరకు వీధుల్లో ఫాగింగ్‌ చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వర్షాకాలం ప్రారంభమైందంటే గతంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు తేడాలేకుండా విరివిరిగా దోమలనివారణ చర్యలు చేపట్టేవారు. మున్సిపాలిటీల్లో మంచి శుక్రవారం, మంచి ఆదివారం పేరుతో అధికారులు, పాలకులు పారిశుధ్య పనులు చేపట్టేవారు. ఇందులో భాగంగా పారిశుధ్య కార్మికులతో కలిసి కూడళ్లు, టైర్లకొట్లు, డ్రైనేజీల్లో నీరు నిలువ ఉండకుండా చర్యలు చేపట్టేవారు. కొబ్బరి బోండాల్లోనూ నీరు నిలువ ఉండకుండా వాటిని జనావాసాల నుంచి దూరంగా తరలించేవారు. ఇళ్లు, పరిసరాలతోపాటు నిర్మాణంలోని నీటి ట్యాంకులు, వ్యర్థాలు, పాత సామాగ్రిని తనిఖీచేసేవారు. నీటి నిల్వలు తొలగించి, దోమల మందు పిచికారీ చేసేవారు. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో బహిరంగ ప్రదేశాల్లో నీరు నిలిచి ఉంది. ముఖ్యంగా వినియోగంలో లేని భవనాలు, నిర్మాణంలో ఉన్న కట్టడాల వద్ద దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నివారణలో ఫాగింగ్‌ ప్రధానం. మున్సిపాలిటీల పరిధిలో ఫాగింగ్‌ యంత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నప్పటికీ వాటికి మరమ్మతులు చేయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఫాగింగ్‌ యంత్రాల సేవలను ఇంతవరకు వినియోగించిన దాఖలాలు లేవు. ఇదిలా ఉండగా రికార్డుల్లో మాత్రం ఎప్పటికప్పుడు దోమల నివారణచర్యలు చేపడుతున్నట్లు నమోదు చేస్తుండటం కొస మెరుపు. మరోవైపు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో పాలకవర్గాలు ఏర్పడినా కూడా పారిశుధ్యం లోపించడం నిర్లక్ష్యానికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలక వర్గాలు లేని సమయంలో ప్రత్యేకఅధికారుల పర్యవేక్షణలో పారిశుధ్యం పూర్తిగా లోపిం చగా, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండటంతో ప్రజల ఛీత్కారాలు ఎదుర్కోవలసి వస్తోంది.

క్లోరినేషన్‌ ఏదీ?

ప్రజలకు తాగునీరు అందించే రక్షిత మంచినీటి ట్యాంకుల్లోనూ క్లోరినేషన్‌ చేసిన దాఖలాలు కానరావడం లేదు. నిలువ నీరు ఉన్నచోట లార్వా వృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. క్లోరినేషన్‌ చేయడం వల్ల దోమలు వృద్ది చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వీధుల్లోని నాలాల్లో సైతం బ్లీచింగ్‌ చేసిన పాపాన పోవడం లేదు. నీరు నిలువ ఉండే చోట్ల బ్లీచింగ్‌ చేస్తే ఆదిలోనే లార్వా అంతమై దోమల బెడద తగ్గుతుంది. ఆ చర్యలు కూడా మున్సిపాలిటీల్లో చేపట్టడం లేదు. దీంతో సాయంత్రం వేళ్లలో లైట్లు వేయగానే నాలాల్లో ఉన్న దోమలన్నీ ఇళ్లలోకి చేరుతున్నాయి. గుంపులు గుంపులుగా వస్తున్న దోమల కారణంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

పొంచిఉన్న వ్యాధుల ముప్పు..

పరిసరాలు పరిశుభ్రంగా లేని కారణంగా వివిధ వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. దోమకాటు వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా లాంటి విషజ్వరాలు సోకుతాయి. ముఖ్యంగా పగలు కుట్టే దోమల పట్ల పౌరులు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. అవి కుడితే డెంగ్యూ, చికున్‌గున్యా వంటి తీవ్రమైన జ్వరాలు సోకుతాయి. వర్షాలు, వాతా వరణ మార్పుల కారణంగా ఇప్పటికే ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆస్పత్రులలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతానికి వైరల్‌ జ్వరాలతో ప్రజలు బాధపడుతున్నప్పటికీ దోమల కారణంగా విషజ్వరాలు సోకే అవకాశాలు కూడా ఉన్నాయి. తాగునీరు సరఫరాచేసే ట్యాంకుల్లో క్లోరినేషన్‌ చేయని కారణంగా నీరు కలుషితమై అతిసార ప్రభలే ప్రమాదం కూడా పొంచి ఉంది. అధికారుల వైఖరిపట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పల్లెలే నయం..

పారిశుఽధ్య చర్యలు మున్సిపాలిటీలతో పోలిస్తే పల్లెల్లోనే కాస్త మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. వర్షాలు తగ్గుముఖం పట్టగానే పంచాయతీల్లో ఫాగింగ్‌, క్లోరినేషన్‌, బ్లీచింగ్‌ తదితర పనులు చేపట్టారు. వీధుల్లో మొలిచిన గడ్డి, పిచ్చిమొక్కలను తొలగించడం, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం వంటి పనులు చేపడుతున్నారు. డ్రైనేజీల్లో లార్వా వృద్ధి చెందకుండా ఉండేందుకు ఆయిల్‌బాల్స్‌ వేస్తున్నట్లు అధికారులు చెబుతు న్నారు. ఆయిల్‌బాల్స్‌ నీటిలో వేయగానే చమురు విస్తరించి, ఆపరిసరాల్లో దోమల వృద్ధికి ఆటంకం ఏర్పడుతున్నది. తద్వారా గ్రామాల్లో దోమల నివారణకు దోహదపడుతోంది. అయితే ఆ ప్రక్రియంతా కేవలం గ్రామాలకే పరిమితం కావడం గమనార్హం. గ్రామాల్లో చేపడుతున్న దోమల నివారణ చర్యలేవీ ప్రస్తుతం మున్సిపాలిటీల్లో అమలు కావడం లేదు. ఇప్పటికైనా మున్సిపల్‌ యంత్రాంగం స్పందించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని పుర ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 12:06 AM