Mancherial: ఎంపీ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే వర్గీయులు
ABN , Publish Date - Jul 18 , 2026 | 11:54 PM
దండేపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో సాగుతున్న అంతర్గత విభేదాలు శనివారం ఎంపీ పర్యటనతో రోడ్డెక్కెకాయి.
దండేపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో సాగుతున్న అంతర్గత విభేదాలు శనివారం ఎంపీ పర్యటనతో రోడ్డెక్కెకాయి. దండేపల్లి మండలం గూడెంలో శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నతపాఠశాల విద్యార్థులకు విశాఖచారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్కూల్‌బ్యాగ్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వస్తున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పర్యటనను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గీయులు అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు గానీ, నియోజకవర్గంపార్టీ శ్రేణులకు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎంపీ ఏకపక్ష పర్యటనలు చేయడంపై ఎమ్మెల్యే వర్గీయులు తీవ్రఅభ్యంతరం వ్యక్తం చేశారు. గూడెం గోదావరి వంతెన అటవీచెక్‌పోస్ట్ సమీపంలో వందలాదిమంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపైకి చేరుకొని ఆందోళనకు దిగారు. ఎంపీవర్గం ఏర్పాటు చేసిన స్వాగతతోరణాలు ఫ్లెక్ల్సీలను ఆగ్రహంతో చించివేశారు. ఎంపీ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఎంపీ వంశీకృష్ణ, ఆయన తండ్రి రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఇతర నేతలను ప్రోత్సాహిస్తూ సమాంతరవర్గాలను పెంచి పోషిస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపించారు.
ఎంపీ వంశీకృష్ణ ధర్మపురి నియోజకవర్గ పర్యటన ముగించుకొని గూడెంవైపు వస్తున్నట్లు సమాచారం ఉండటంతో, ఆయన వస్తే అడ్డుకుని తీరుతామని ఎమ్మెల్యేవర్గీయులు నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని రహదారి వైపు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తవాతావరణం చోటుచేసుంది. రాయపట్నం వంతెన వద్దకు పోలీసులు వెళ్లి ఎంపీ తప్ప ఇతర కాన్వాయ్‌ని అడ్డుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాను కాన్వాయ్‌తోనే గూడెం స్కూల్‌కు వస్తా అని ఎంపీ పోలీసులతో వాగ్వాదం చేయడంతో పోలీసుల బందోబస్తు నడుమ గూడెం పాఠశాలకు చేరుకొని విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమం అనంతరం దండేపల్లి మండల పర్యటనకు బయలుదేరడంతో ఎంపీ కాన్వాయ్‌ను ఎమ్మెల్యే వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు చెదరగొట్టారు. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గూడెం వద్ద ఉత్కంఠ వాతావరణం చోటుచేసుకోగా పరిస్థితిని డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ పర్యవేక్షించారు.