Mancherial: నిఘా నీడలో నిమజ్జనం
ABN , Publish Date - Sep 23 , 2026 | 11:30 PM
మంచిర్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.
- రేపు మంచిర్యాలలో గణపతి నిమజ్జనోత్సవం
- పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
- జిల్లా కేంద్రంలో భారీట్రాఫిక్ ఆంక్షలు
- 24గంటలపాటు మద్యం షాపులు బంద్
మంచిర్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గణేష్ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రామగుండం పోలీస్‌కమిషనర్ అంబర్‌కిషోర్ ఝా నేతృత్వంలో మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఆధ్వర్యంలో జిల్లాలోని గోదావరి తీరంలో పుష్కరఘాట్లను రెండురోజులుగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో బుధవారమే అక్కడక్కడ గణపతి నిజమజ్జన కార్యక్రమం జరుగుతుండగా, హిందూ ఉత్సవసమితి సూచనల మేరకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం పెద్ద ఎత్తున నిమజ్జనోత్సవం జరుగనుంది. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన గణపతి మండళ్ల నుంచి వినాయకులను వాహనాల్లో గోదావరినదిలో నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా కేంద్రం, గూడెం సమీపంలోని గోదావరి పుష్కరఘాట్‌తోపాటు జైపూర్ మండలం ఇందారం సమీపంలోని గోదావరి వంతెన వద్ద పెద్దఎత్తున వినాయక నిమజ్జనాలు చేపడతారు. దీంతో శుక్రవారం నాటి నిమజ్జన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను పోలీస్‌శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు పర్యవేక్షిస్తున్నాయి.
భారీ పోలీసు బందోబస్తు..
గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2530 గణేష్ మండళ్లు ఏర్పాటు చేయగా, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్‌లో డీసీపీ భాస్కర్ నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని గోదావరితీరం వెంట మొత్తం 41నిమజ్జన ప్రదేశాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఇందారం సమీపంలోని గోదావరి బ్రిడ్జి, దండేపల్లి మండలం గూడెం గోదావరి వంతెన, లక్షెట్టిపేట, జిల్లా కేంధ్రంలోని గౌతమేశ్వరాలయం, సీతారాంపల్లిలోని ఇంటెక్‌వెల్‌తోపాటు బెల్లంపల్లిలోని పోచమ్మ చెరువు, చెన్నూరులోని పెద్ద చెరువు, సాలిగాం ప్రాజెక్టు, కాసిపేట మండలంలోని సల్పలవాగు వద్ద నిమజ్జన ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఆయాప్రదేశాల్లో బందోబస్తు నిర్వహించేందుకు గాను పోలీస్‌శాఖ నుంచి ముగ్గురు ఏసీపీలు, సీఐ, రిజర్వు ఇన్‌స్పెక్టర్లు-11, ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐలు-26 మంది, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు-67 మంది, కానిస్టేబుళ్లు- 90 మంది, మహిళా కానిస్టేబుళ్లు-17 మంది, హోంగార్డులు-30 మంది, స్పెషల్ పార్టీ సిబ్బంది -10 మందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
భారీ ట్రాఫిక్ ఆంక్షలు..
గణేష్ నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో నిమజ్జన ప్రదేశాల వద్ద రోడ్ల మర్మతులు, ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లు, భారీ క్రేన్లు, గజ ఈతగాళ్లు, మంచినీటి వసతి ఏర్పాట్లు చేశారు. నిమజ్జన ప్రాంతాలను సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించనున్నారు. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా డీజేలు వినియోగించడం, బాణాసంచా కాల్చడాన్ని పూర్తిగా నిశేదించారు. అలాగే జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాల నుంచి గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో పోలీసుశాఖ భారీఆంక్షలు విధించింది. వాహనాల రాకపోకలకు వేర్వేరుదారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌జాం కాకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు.
మద్యం షాపులు బంద్..
గణపతి నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అబ్కారీశాఖ ఆధ్వర్యంలో మద్యం షాపులను మూసివేసేందుకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఈనెల 25న జిల్లాలో నిమజ్జన కార్యక్రమం ఉండగా, ఆరోజు ఉదయం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు బార్లు, మద్యం షాపులను మూసివేయనున్నారు. అబ్కారీశాఖ అధికారులు మద్యం షాపులకు 24గంటలపాటు సీలు వేయనున్నారు.
కడుపునింపుతున్న అన్నదానాలు..
గణపతి నవరాత్సోవాలను పురస్కరించుకొని వివిధ మండపాల్లో నిర్వాహకులు నిత్యదాన కార్యక్ర మాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్న సమయంలో దాదాపుగా అన్ని గణేష్ మండళ్ల వద్ద భోజనం లభిస్తుండటంతో ముఖ్యంగా యాచకులు, దినసరి కూలీలు, ప్రయాణికులు, షాపింగ్ మాల్స్‌లో పనిచేసే సిబ్బందికి చాలా ఉపయోగకరంగా మారింది. జిల్లా కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గణేష్ మండలి వద్ద పెద్దఎత్తున అన్నదాన కార్యక్రమానికి ప్రజలు బారులు తీరుతున్నారు.