Mancherial: గృహోపకరణాలు కాలిపోతున్నాయి
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:10 AM
బెల్లంపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా వేసవికాలాన్ని తలపించే ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రత దీనికి తోడు విద్యుత్‌సరఫరాలో నిరంతరం హెచ్చుతగ్గుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.
- విద్యుత్ సరఫరాలో లో, హై ఓల్టేజ్ సమస్య
- రూ. లక్షల్లో ఆస్తినష్టం
- ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు
బెల్లంపల్లి, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా వేసవికాలాన్ని తలపించే ఎండలు, పెరిగిన ఉష్ణోగ్రత దీనికి తోడు విద్యుత్‌సరఫరాలో నిరంతరం హెచ్చుతగ్గుదలతో వినియోగదారులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. విద్యుత్ హెచ్చుతగ్గుదల కారణంగా ఇళ్లలో ఎలక్ర్టిక్ వస్తువులు కాలిపోతున్నాయి. నెలల తరబడి హెచ్చుతగ్గుల సమస్య వేధిస్తుండడంతో రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లుతోంది. విద్యుత్‌శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెలల తరబడి విద్యుత్ హెచ్చుతగ్గుదల..
పట్టణంతోపాటు ప్రధానంగా కాల్‌టెక్స్ ఏరియాలో కొన్నినెలలుగా విద్యుత్ హెచ్చుతగ్గుల సమస్య వినియోగదారులను వేధిస్తోంది. తరచూ విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు ఉంటుండడంతో ఇంటిలోని ఫ్రిజ్‌లు, ఫ్యాన్‌లు, ఏసీలు, కూలర్లు, టీవీలు, ఇన్వర్టర్లతో పాటు ఇతర వస్తువులు కాలిపోతున్నాయి. రాత్రి సమయాల్లో లోవొల్టేజీతో ఫ్యాన్లు తిరగడానికి మొరాయిస్తున్నాయి.
లక్షల్లో ఆస్తినష్టం..
పట్టణంలోని కాల్‌టెక్స్ ఏరియాలో నెలలుగా విద్యుత్ హెచ్చుతగ్గుదల కారణంగా భారీ మొత్తంలో ఇళ్లలోని ఎలక్ర్టిక్ వస్తువులు కాలిపోతున్నాయి. కాల్‌టెక్స్ ఏరియాలోని పలువురి ఇళ్లలో ఏకంగా 12ఏసీలతో పాటు 14ఫ్యాన్లు, ఐదు ఫ్రిజ్‌లు, ఆరు టీవీలు కాలి పోయాయి. శుక్రవారం రాత్రిసైతం విద్యుత్ హెచ్చు తగ్గుదల కారణంగా కాల్‌టెక్స్ ఏరియాలోని దాదాపు 10ఇళ్లలోని ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు కాలిపోయాయి. వీటివిలువ సైతం లక్షల్లో ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యం వీడని అధికారులు..
పట్టణంలో విద్యుత్‌హెచ్చుతగుదల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్చుతగ్గుదల సమస్య తీర్చాలంటూ పలుమార్లు విన్నవించుకుంటున్నా పట్టిం చుకోవడం లేదు. కాల్‌టెక్స్ ఏరియాలోని ట్రాన్స్‌ఫారం వరకు సామర్థ్యానికి మించిన విద్యుత్‌కనెక్షన్లు ఉండడం కారణంగా విద్యుత్‌హెచ్చు తగ్గుదల సమస్య ఏర్పడుతు న్నది. కొన్నినెలల క్రితం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మంజూ రైనప్పటికీ అధికారులు ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ హెచ్చుతగ్గుదల సమస్య తీర్చాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
ఆస్తినష్టం వాటిల్లుతోంది..
నవాబు, బెల్లంపల్లి
కొన్ని నెలలుగా విద్యుత్ లో, హై ఓల్టేజ్ కారణంగా ఎలక్ర్టిక్ వస్తువులు కాలిపోతున్నాయి. వేల రూపాయల ఆస్తినష్టం వాటిల్లుతోంది. విద్యుత్‌అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
నష్టపరిహారం చెల్లించాలి..
ఫయీం మున్నీసా, బెల్లంపల్లి
మా ఇంటిలో ఫ్యాన్లు, కూలర్‌తోపాటు ఏసీలు కాలిపోయాయి. విద్యుత్ సమస్య అధికారుల దృష్టికితీసుకెళ్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఆస్తినష్టం ఏర్పడడమే కాకుండా విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నాం.