Share News

Mancherial: ఆదివాసీ గూడేల్లో గుస్సాడి సంబరాలు

ABN , Publish Date - Oct 25 , 2026 | 11:59 PM

దండేపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గూడేల్లో గుస్సాడీ సంబరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివాసీ దేవాలయంగా పేరొందిన పద్మల్‌పురికాకో దేవాలయం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరినది తీరాన కొలువై ఉంది

 Mancherial:   ఆదివాసీ గూడేల్లో గుస్సాడి సంబరాలు
గుడిరేవు గోదావరి తీరం ఆలయం వద్ద గిరిజన గుస్సాడీ నృత్యం (ఫైల్‌)

ప్రారంభమైన దండారీ ఉత్సవాలు

పద్మల్‌పురి కాకో ఆలయంలో ఏర్పాట్లు

పౌర్ణమితో ఉత్సవాలు షురూ..

దండేపల్లి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీ గూడేల్లో గుస్సాడీ సంబరాలు నేటినుంచి ప్రారంభం కానున్నాయి. ఆదివాసీ దేవాలయంగా పేరొందిన పద్మల్‌పురికాకో దేవాలయం దండేపల్లి మండలం గుడిరేవు గోదావరినది తీరాన కొలువై ఉంది. ప్రతియేట దసరా నుంచి దీపావళి పండుగ వరకు ఇక్కడ దండారీ గుస్సాడి వేడుకలు వైభవంగా జరుగుతుంటాయి. దసరా తర్వాత వచ్చే పౌర్ణమితో ఉత్సవాలు ప్రారంభమై దీపావళి అమావాస్యతో ముగుస్తాయి.

రాష్ట్ర నలుమూల నుంచి ఆదివాసీలు కుటుంబసమేతంగా తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆదివాసీలు అంటేనే సంస్కృతీ, సాంప్రదాయాలకు మారుపేరు. కొత్తగా పెళ్లైన జంటలను ఆలయంలో అమ్మవారి ముందు బేటింగ్‌ (కొత్త కోడళ్ల పరిచయం) కార్యక్రమం నిర్వహిస్తారు. ఆదివాసీలు వారి సాంప్రదాయాలతో వచ్చి గంగమ్మతల్లికి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే దేవతలకు పూజలు చేస్తారు.

తెలంగాణలో ప్రసిద్ధి..

గుడిరేవు సమీపంలో గోదావరి తీరంలో ఉన్న పద్మల్‌పురి కాకో దేవాలయం తెలంగాణలోనే ఆదివాసీల ఏకైక దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఇది చాలా పురాతన దేవాలయం. గుడిరేవు గ్రామానికి కిలోమీటర్‌ దూరంలో గోదావరి తీరంలో ఉంది. రాష్ట్రంలో ఉన్న ఆదివాసీ తెగలు గోండు, ప్రదాన్‌, కోలాం, తోటి ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఉమ్మడి జిల్లాలో ఊట్నూర్‌, నార్నూర్‌, జైనూర్‌, గుడిహత్నూర్‌, ఇచ్చోడ, భోథ్‌, ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, తిర్యాణి, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తదితర ప్రాంతాల నుంచి ఆదివాసీలు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తుంటారు. వందలాది మంది ఆదివాసీలు ఎడ్లబండ్లు, ప్రత్యేక వాహనాలు తీసుకొని ఇక్కడికి వస్తుంటారు.

గోదావరిలో స్నానాలు ఆచరించి తీరంలోని పద్మల్‌పురి ఆలయంలో సాంప్రదాయ బద్దంగా ప్రత్యేకపూజలు చేస్తారు. రెండు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. పురుషులు నెత్తిమీద నెమలి పించాలు ధరించి చేసే గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. దీపావళి వరకు ఆలయం వద్ద దండారీ ఉత్సవాలతో గుస్సాడీ వేడుకలు, ప్రత్యేక భజన కార్యక్రమాలు కొనసాగుతాయి.

ఆదివాసీల ప్రత్యేక నైవేద్యాలు..

పద్మల్‌పురికాకో అమ్మవారికి ఇష్టమైన పిండి పదార్థాలు ఆదివాసీలు ప్రత్యేక నైవేద్యాలు తయారు చేస్తారు. పాయసంతో రుబ్బిన పెసరు, మిసుము, బబ్బెర గారెలు తయారు చేసి కాకోబాయికి నైవేద్యంగా సమర్పిస్తారు. వీటితో పాటు గానుగతో తయారు చేసిన నువ్వులు, పల్లినూనె వేసి గిరిజనులు ఆలయం వద్ద వంటకాలు చేయడం ఇక్కడ ప్రత్యేకం. దీంతో పాటు దంచిన బియ్యంతో అరిసెలు తయారు చేస్తారు. మరికొందరు కుటుంబసమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కోళ్లు, మేకలు బలిచ్చి విందు భోజనం చేస్తారు.

Updated Date - Oct 25 , 2026 | 11:59 PM