Share News

Mancherial: ఆశగా.. ఆకాశం వైపు

ABN , Publish Date - Jul 15 , 2026 | 11:53 PM

హాజీపూర్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వానాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Mancherial:  ఆశగా.. ఆకాశం వైపు

- వానాకాలం మొదలై నెలన్నర

- ఆశించిన స్థాయిలో కురవని వర్షం

- నిండని ఎల్లంపల్లి

- ఆందోళనలో రైతాంగం

- నాటేసే దశకు పెరిగిన వరినారు

హాజీపూర్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వానాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశగా వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. జిల్లాలోని గుడిపేట వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంకా నిండుకోలేదు. జూన్‌ రెండో వారం నుంచే నారుమళ్లు పోసుకున్న రైతులు ప్రస్తుతం నాట్లువేసే పరిస్థితి లేదంటూ ఆకాశం వైపు చూస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ రైతులు వర్షాలు తక్కువగా కురిసినా ఎగువన వర్షాలు కురిస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో సాగు పనులు చేపట్టేవారు. కానీ ఈ వర్షాకాలం కాలం ఎల్‌నినో ప్రభావంతో ప్రాజెక్టులోకి చుక్కనీరు చేరలేదు. సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎల్లంపల్లి ప్రధాన వనరు..

వర్షాభావ పరిస్థితుల్లో దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలాల రైతులకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రధాన నీటి వనరు. కానీ ఈ ఏడాది ఈ ప్రాజెక్టులోకి ఇప్పటివరకు నీరు చేరకపోవడంతో రైతులు అగమ్యగోచర పరిస్థితులో ఉన్నారు. గతేడాది జూలై రెండో వారానికి సుమారు 9టీఎంసీల నీరు నిలువ ఉండి బ్యాక్‌వాటర్‌ పెరగడంతో బోర్లు,బావులకు నీరుచేరి పంటలు సాగు చేశారు రైతులు. బ్యాక్‌ వాటర్‌లో మోటార్లు వేసిన రైతులు కూడా ఇప్పటికే నాట్లకు సిద్ధం అయ్యారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం వేసవిలో ఉన్న 7టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇక్కడ వర్షాలు లేని పక్షంలో ఎగువన కురిసిన వర్షాలతోనైనా గతంలో ప్రాజెక్టులోకి నీరు చేరేది. కానీ ఇప్పుడున్న వర్షాభావ పరిస్థితుల్లో ప్రాజెక్టు ఎండాకాలం మాదిరి తలపిస్తున్నది. ఎల్లంపల్లిలో సుమారు 9టీఎంసీల నీరు చేరితో గూడెం లిఫ్ట్‌ నడిచే పరిస్థితి ఉంది. తద్వారా ఆ లిఫ్ట్‌ ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండలంలోని సుమారు 20ఎకరాల వరిసాగు ఆధారపడి ఉంది. అంతేకాకుండా ప్రాజెక్టులోకినీరు చేరితే గోదావరి పరివాహక ప్రాంతాల రైతులు బోర్లు, బావులు నిండేవి. బ్యాక్‌వాటర్‌లో కిలోమీటర్ల కొద్ది లైన్లు వేసిన రైతులు ప్రస్తుతం నారుమల్లు కూడా పోసుకోని పరిస్థితి నెలకొంది.

సన్నాల సాగుపై తీవ్ర ప్రభావం..

అసలే ఈ ఏడాది ఖరీఫ్‌లో ప్రభుత్వం రైతులను కేవలం సన్నరకాల వరిధాన్యం మాత్రమే పండించాలని హుకుం జారీ చేసింది. అయితే దొడ్డు రకాలతో పోలిస్తే సన్నరకం 20నుంచి 30 రోజుల పంట వ్యవధి ఎక్కువగా ఉంటుంది. సన్నరకం సాగు 140రోజుల వరకు ఉంటుంది. అదే దొడ్డు రకం అయితే 110నుంచి 120రోజుల్లో పంట కోతకు వస్తుంది. దీంతో రైతులు ప్రభుత్వ సూచనల ప్రకారం దొడ్డు రకం వైపు సాగుకు సిద్ధం అయ్యారు. పంటకాలం ఎక్కువ కావడంతో జూన్‌ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్దం చేశారు. ఇప్పుడు ఆ నారుమళ్లు నెల వయస్సుకు చేరాయి. కానీ నీళ్లు లేక పొలం దున్నడం కావడం లేదు. దున్నుతుంటే భూమి లోపల ఫీట్‌ లోతులో ఇంకా పొడిపొడి ఉండడంతో నీళ్లు సరిగ్గా పట్టడంలేదు. నార్లు మాత్రం నెల కావస్తుండ డంతో నాటువేసే సమయం కావడం నారు ముదిరి పంట దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తిరిగి మళ్లీ నారుమడులు పోసు కుంటున్నారు.

Updated Date - Jul 15 , 2026 | 11:53 PM